మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా
కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ ॥ 36 ॥
88. మూలమంత్రాత్మికా
మూలమంత్రమే ఆత్మగా కలది అని ఈ నామ భావము.
మంత్రశాస్త్రము సనాతనధర్మములో మాత్రమే వున్నది. మరెక్కడైనా మంత్రం వున్నప్పటికీ,
దాని ఆధారము తిరిగి, సనాతనధర్మశాస్త్రమే.
మననాత్ త్రాయతే ఇతి మన్త్రః. అంటే, మననము చేస్తూ ఉంటే రక్షించేది మంత్రము.
మంత్రము అంటే గూఢశబ్దము అని కూడా అర్ధం.
అందుకే మంత్రాలు గురు ముఖతః మాత్రమే ఉపదేశం పొందాలి.
ఈనాడు సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది. మనకు మంత్రాలు ఎన్నో రకాల మాధ్యమాల
ద్వారా, అందుబాటులోకి వచ్చేసాయి. అయినప్పటికీ అవి శబ్దములే కానీ మంత్రములు కావు.
మంత్రమన్నది గురువు నుంచి ఉపదేశం పొందినప్పుడే ఫలిస్తుంది, సిద్ధిస్తుంది.
ఈ నామంలో మూలమంత్రమంటే, పంచదశీ మంత్రమే. ఈ పంచదశీ మంత్రము లోని
మూడు భాగములూ కలిస్తే ఏర్పడేదే అమ్మవారి అసలైన రూపమని ముందే చెప్పుకున్నాం.
మూలమంత్రమే అమ్మవారి ఆత్మ, కనుక ఆ శ్రీదేవి మూలమంత్రాత్మిక. మూలమంత్రాన్ని
శ్రద్ధతో, భక్తితో జపిస్తే, అమ్మ భక్తులను ఈ సంసారసాగరము నుంచి దాటిస్తుంది.
లలితా పంచదశీ మంత్రమే తన ఆత్మ అయిన, ఆ మూలమంత్రాత్మిక కు వందనం.
ఓం శ్రీ మూలమంత్రాత్మికాయై నమః
మూలకూట త్రయముల గురించి కూడా ముందే చెప్పుకున్నాం.
పంచదశి లోని వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తికూటములే ఈ కూట త్రయములు.
అమ్మవారి స్థూల దేహముతో సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ దేహములను పోల్చినప్పుడు,
అమ్మవారి కళేబరము, అనగా శరీరము, ఆ మూలకూటత్రయ సమష్టి రూపమే.
త్రిగుణాలు, త్రి అవస్థలు, త్రిమూర్తులు, త్రిమాతలు, త్రినాడులూ, త్రికూటాలూ, త్రినేత్రాలు,
త్రిపుటి, ఈ సృష్టిలో సర్వమూ త్రయీమయమే.
ఆవిధంగా మూలకూట త్రయమే శరీరముగా కల ఆ మూలకూటత్రయకళేబర కు వందనం.
ఓం శ్రీ మూలకూటత్రయకళేబరాయై నమః
90. కుళామృతైక రసికా
కులామృతమును ఆనందముగా సేవించుతున్న తల్లి అని ఈ నామానికి అర్ధం.
కులము అంటే సజాతీయకు సంబంధించిన పదం.
ఒకే దేవతను ఉపాసించేవారు, ఒకే మంత్రమును జపించేవారు, ఒకే యోగ మార్గములో
వున్నవారు, ఒకే పద్ధతిలో సాధన చేసేవారూ, ఒకే స్థితిలో సాధన చేసేవారు
మొదలైన వారంతా సజాతీయులు కనుక, వారు ఆయా కులములకు చెందినవారు.
ఏ చక్రపద్మము వద్ద ఎవరు జపము చేస్తుంటే, వారు ఆ చక్ర కులమునకు చెందినవారు.
ప్రతి కుల సాధనలోనూ అమ్మ వున్నది. సిద్ధి పొందిన ప్రతి సాధకుడికీ ఆ కులధార నుంచి
అమృతము సిద్ధిస్తుంది. ఆ అమృతము సేవించుట వలన కలిగే స్వార్ధరహిత, అమేయానందమే
ఆ మంత్రసిద్ధి, ఆ యోగ సిద్ధి, ఆ జపసిద్ధి, బ్రహ్మానంద స్థితి.
సాగరమధనం, దాని ఫలితముగా అమృతభాండము లభించడం కూడా దీనినే సూచిస్తుంది.
మధించండి, అమృతం తప్పక దొరుకుతుంది. అందరికీ, అన్ని కులాలవారికీ దొరుకుతుంది.
ఏ మార్గము(కులం)లో అమ్మని పూజించినా, ఆ కులములో మనకు కులామృతము లభిస్తుంది.
అమ్మే సాధకులకు ఆ కులామృతమును ఇస్తుంది. బ్రహ్మానందాన్ని అందిస్తుంది.
అడ్డంకులు వచ్చాయని మధ్యలో మానేస్తే, అమృతత్వస్థితిని అందుకోలేరు.
కులామృతమును సేవిస్తూ తృప్తి చెందుతున్న ఆ కుళామృతైకరసిక కు వందనం.
ఓం శ్రీ కుళామృతైకరసికాయై నమః
లలితా రహస్య సహస్ర నామ స్తోత్రములో వున్న కుల, కుళ పదాలు సమానార్ధకముగా
వాడబడినాయి. కులము అన్నా, కుళము అన్నా ఒకటిగానే భావించండి. సంస్కృత వర్ణమాలలో
ళ అనే అక్షరము లేదు. ల అనే అక్షరమే వున్నది. కనుక ల, ళ లు అబేధము.
ప్రస్తుతము సమాజములో వున్న కులవ్యవస్థకూ, వర్ణవ్యవస్థకూ, లలితా రహస్య సహస్ర
నామ స్తోత్రములో వున్న కులవ్యవస్థకూ, వర్ణవ్యవస్థకూ అసలు సామ్యమే లేదు.
భరతఖండము బైట నుంచి వచ్చి పాలించిన వారు, బహుశా మన సనాతన ధర్మాన్ని సరిగ్గా
అవగాహన చేసుకోలేక పోవటం వల్లనో, అపార్థము చేసుకున్నందు వల్లనో, లేక మరి ఏ ఇతర
స్వప్రయోజనాల కోసమో, ప్రస్తుతమున్న కులవ్యవస్థను ఈ విధముగా స్థిరీకరించి వుండవచ్చు.
91. కుళసంకేత పాలినీ
కులము యొక్క రహస్యములను కాపాడు తల్లి అని ఈ నామార్ధం.
ప్రతి కులమునకూ కొన్ని రహస్య మార్గాలుంటాయి. రహస్య మంత్రాలుంటాయి.
అందుకే గురూపదేశము తప్పనిసరి అని శాస్త్రము చెప్పింది. మార్గభ్రష్టము కాకుండా గురువు
కాపాడతాడు. కులము లోపల గూఢముగా వున్న సంకేతములను పాలించే తల్లి లలితాంబిక.
మంత్రము, యంత్రము, తంత్రము, ఉపాసన, సాధన, అనుభవము, వంటి విషయములు
పరమ గోప్యములు, రహస్యములు, గూఢముగా వుంచవలసినవి.
వీటన్నింటినీ కలిపి శాస్త్రములో కులపుస్తకమని అన్నారు.
కులపుస్తకపు సంకేతాలను గుప్తంగానే ఉంచాలి.
ఏవిధంగా అయితే, కుల స్త్రీ అన్ని విషయములను గుప్తంగా ఉంచుతుందో, ఆ విధంగా గుప్తంగా
ఉంచవలసిన విషయములు అవి. ఈ కుల సంకేతాలను అమ్మే స్వయముగా పరిపాలిస్తూ,
ఎప్పుడు, ఎవరికి ఎంత అందాలో, అంత అందిస్తూ ఉంటుంది.
ఆ అమ్మ ఆదేశము లేనిది, ఏదీ ఎవరికీ తెలియబడదు.
కులసంకేతాలను గుప్తంగా ఉంచి పాలిస్తున్న, ఆ కుళసంకేతపాలిని కి వందనం.
ఓం శ్రీ కుళసంకేతపాలిన్యై నమః
-----------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి