కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా
రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్వితా ॥ 13 ॥
31. కనకాంగదకేయూరకమనీయభుజాన్వితాయై
ఇప్పటివరకు ఆ శ్రీ మాత కురుల నుంచి చుబుకం దాకా దర్శించుకున్నాం.
ఇప్పుడు అమ్మ ఆభరణాలను మనసారా దర్శిద్దాం.
కేయూరము, అంగదము అనే బంగారపు భుజకీర్తులు అమ్మవారి భుజాలను ఆవరించి వున్నాయి.
ఆ రాజరాజేశ్వరి భుజాలను చేరి అవి సార్ధకత పొందాయి.
అమ్మవారి నాలుగు భుజాలనీ, ఎంతో కాంతివంతమైన ఆ బంగారపు భుజకీర్తులు సగర్వంగా
చుట్టుకుని, ఆ మహోన్నతమైన భుజాల వలన అమేయమైన కాంతినీ, శక్తినీ పొందుతున్నాయి.
చిన్నపిల్లలు తల్లిని కావలించుకుని సంబరపడ్డట్టు, ఆ భుజకీర్తులు, జగన్మాత నాలుగుభుజాలనూ
చుట్టుకుని, పట్టుకుని ఆనందిస్తూ ఆభరణాలుగా తమ ప్రకాశాన్ని మరింత పెంచుకుంటున్నాయి.
ఆహా, అమ్మకి భుజకీర్తులవ్వటం వల్ల కదా మాకింత ఘనత కలిగిందీ,
ఇంత విలువ వచ్చిందీ అని ఉప్పొంగిపోతున్నాయి.
అటువంటి గొప్పవైన భుజాలను కమనీయంగా చుట్టుకుని వున్న ఆ ఆభరణాలు
అమ్మని ఎంతో ప్రేమాదరాలతో సేవించుకుంటున్నాయి.
బంగారపు కేయూరాంగదములనే భుజకీర్తులను ధరించి వాటికి తన ప్రకాశాన్ని మురిపెంగా
పంచుతున్న, ఆ కనకాంగదకేయూరకమనీయభుజాన్విత కు వందనం.
ఓం శ్రీ కనకాంగదకేయూరకమనీయభుజాన్వితాయై నమః
32. రత్నగ్రైవేయ చింతాకలోలముక్తాఫలాన్వితా
గ్రీవము అంటే కంఠము. ఇక్కడ అమ్మవారి కంఠాభరణాల గురించిన వర్ణన వుంది.
రత్నములతో కూడిన హారములు ఆ శివాని కంఠములో ఎంతో ముచ్చటగా చేరి వున్నాయి.
ఆ రత్నగ్రీవము మహా సౌందర్యంతో ప్రకాశిస్తోంది.
ఆ రత్నాలకు జతగా మంచి ముత్యములు చక్కగా మెరుస్తూ కదలాడుతున్నాయి.
చెట్ల కొమ్మలకి వ్రేలాడే ఫలముల వలే ఆ ముక్తాఫలాలు రత్నహారానికి వ్రేలాడుతున్నాయి.
అవి చంచలంగా, స్థిరంగా లేకుండా, చింతలతో కల్లోలంగా వున్న మనసు వలె ఊగుతున్నాయి.
ముత్యము చంద్రునికి చెందిన రత్న విశేషము.
చంద్రుడు మనః కారకుడు. మనసు చలిస్తూ ఎప్పుడూ చింతలతో కల్లోలంగా ఉంటుంది.
ఇక్కడ హారములలోని ముత్యాలు ఆ విధంగా చింతలతో కల్లోలంగా వున్న మనసు వలె
కదులుతూ వూగుతున్నాయిట. ఎంత అందమైన పోలిక.
అలా అమ్మ మెడలో కదలాడే ఆ ముత్యాలను చూస్తే మన చింతలు దూరమైపోవూ.
రత్నము ప్రజ్ఞతో ప్రకాశిస్తూ స్థిరంగా బంగారములో పొదగబడి వున్నది.
అమ్మవారి కంఠంలో తళతళలాడే రత్నహారాలను చూస్తే, మనలోని ప్రజ్ఞ ఇంకా ప్రకాశించదూ.
అటువంటి రత్నాలహారము అమ్మ మెడను పట్టుకుని మరింత ప్రజ్ఞను పొందింది.
ఆ రత్నమూ, ఈ ముత్యమూ కలిసి ఆ తల్లి కంఠానికి హారములై గొప్ప మర్యాదని పొందాయి.
చింతలకు కల్లోలంగా వున్న మన మనసు వంటి ముక్తాఫలాలతో కూడిన రత్నహారాలతో,
వెలుగొందుతున్న కంఠము కల ఆ రత్నగ్రైవేయ చింతాకలోలముక్తాఫలాన్విత కు వందనం.
ఓం శ్రీ రత్నగ్రైవేయ చింతాకలోలముక్తాఫలాన్వితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Sri Maatre Namah🙏🙏🙏🤲🤲🤲
రిప్లయితొలగించండిచాలా చక్కగా వివరంగా రాశారు
రిప్లయితొలగించండి