మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా ॥ 29 ॥
అమ్మవారి హృదయము నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు గల బాల పుట్టింది.
అందుకే బాల లలితాదేవి పుత్రిక. యుద్ధము ప్రారంభమయింది.
భండాసురుని సైన్యం వస్తున్నది, శక్తి సేన చేతిలో చస్తున్నది.
భండుడు తన ముప్ఫై మంది పుత్రులను ఏకకాలంలో యుద్ధానికి పంపించాడు.
బాల, భండ పుత్రులను వధించటానికి ఉద్యుక్తురాలయి, తల్లి అనుమతి కోరింది.
అమ్మ అనుజ్ఞ ఇవ్వగానే యుద్ధంలోకి దిగింది, ఆ తొమ్మిది సంవత్సరాల బాల.
తన పరాక్రమ విక్రమాలతో ఆ ముప్ఫై మంది భండాసుర పుత్రులందరినీ బాల వధించేసింది.
భండ పుత్రులంటే, జీవుని చుట్టూ అల్లుకున్న బంధాలే.
ఆ బంధాలను తొమ్మిదేళ్ల చిరుప్రాయంలో వున్న బాల సునాయాసంగా తెంచివేసింది.
బంధాలు తొలగి, స్వేచ్ఛ, విముక్తి కావాలంటే బాలను ఉపాసించాలి.
బాల ఎవరో కాదు, లలితాదేవి బాల్యరూపమే.
బాల ఎంత గొప్పగా ఆ భండాసుర పుత్రులని వధించిందో,
ఆ వివరాలన్నీ అమ్మకు అందుతున్నాయి.
తన తనయ పరాక్రమాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని, భండ పుత్ర వధ విశేషాలనీ
ఎంతో ఆనందంగా వింటున్న, ఆ భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందిత కు వందనం.
ఓం శ్రీ భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితాయై నమః
ఓం శ్రీ మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితాయై నమః
ఇక్కడ ఒక పాఠాంతరమున్నది. బ్రహ్మాండ పురాణము ప్రకారము, విశుక్రుడిని మంత్రిణి
శ్యామలాదేవి వధిస్తే, దండనాథ వారాహీదేవి విషంగుణ్ణి వధించింది.
కానీ లలితాసహస్రనామముల ప్రకారము, విషంగుణ్ణి మంత్రిణి శ్యామలాదేవి వధిస్తే,
దండనాథ వారాహీదేవి విశుక్రుణ్ణి వధించింది.
ఇటువంటి మరికొన్ని భేదములను కూడా ముందు ముందు గమనించవచ్చు.
పురాణాలన్నీ వ్యాసుడే వ్రాసినా, అన్నిటికీ కొద్ది కొద్ది తేడాలున్నాయి.
ఈ మొత్తం నామాల్లో లలితాసహస్రంలో ఎలా చెప్పబడిందో,
దానిని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని వ్యాఖ్యానం ఇవ్వబడింది.
ఈ బేధాలు ఎప్పుడు, ఏవిధంగా ఏర్పడ్డాయో తెలియదు.
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి