8, ఆగస్టు 2021, ఆదివారం

16. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ రత్నకింకిణి కారమ్య రశనాదామ భూషితా

 

అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ 
రత్నకింకిణి కారమ్య రశనాదామ భూషితా ॥ 16 ॥


37. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ 

ఆ జగదంబ అరుణ వర్ణ, ఎర్రటి చాయ గల తల్లి అని చెప్పుకున్నాం. 

ఆ దేవి కట్టుకున్న వస్త్రం కూడా ఎర్రనిదే. సాధారణమైన ఎరుపు కాదు. 

ఎర్రెర్రని అంటూ అరుణారుణ అని ప్రత్యేకంగా నొక్కి మరీ చెప్తున్నారు. 

అంత చెప్పిన తరువాత కూడా, ఇంకా కౌసుంభ అని ఒక ఎర్రని పువ్వు పేరు కూడా 

గుర్తు చేస్తున్నారు.  

అంటే ఆ అమ్మ చీర అంత ఎర్రెర్రటి ఎరుపు వర్ణంలో వుంది. 

ఎరుపు శుభస్కరం, మంగళప్రదం. ఎరుపు వెలుగుకీ, నూతనత్వానికీ కూడా సంకేతం. 

కొత్తగా వచ్చిన సూర్య కిరణాలు, చూత పల్లవాలు (మామిడిచిగుళ్లు) కూడా ఎర్రగానే ఉంటాయి. 

ఎరుపులో ఒక చాయని మామిడి చిగురు ఎరుపు అని కూడా అంటాం. 

ఆ ఎర్రచీర కొంగుని కటి చుట్టూ తిప్పి కట్టింది. అంటే కొంగు బిగించి వుంది. 

ఆ ఎర్రని చీర చెంగు నడుము చుట్టూ బిగించిన ఆ తల్లి యుద్ధంలో దిగిన 

మహా పరాక్రమశాలి వలే గోచరిస్తోంది. యుద్ధం ఎవరిపైనా అంటే, ముందే చెప్పుకున్నాం కదా. 

దేవతా శక్తులని రక్షించటానికి, ఆసురీ శక్తులని అదుపు చెయ్యటానికి అనీ. 

ఆ విధంగా ఎర్రని చీర కట్టి, చెంగు నడుము చుట్టూ తిప్పి దోపి, 

సజ్జనులను కాపాడటానికి, దుర్జనులను దండించటానికి నేనున్నాను, 

అని తల్లి పిల్లలని కాపాడినట్టు మనందరినీ కాపు కాస్తున్న 

ఆ జగన్మాత, అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి కి వందనం. 

ఓం శ్రీ అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతట్యై నమః 


38. రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా 

రశనా అంటే స్త్రీలు మొల చుట్టూ ధరించే ఒక ఆభరణ విశేషం, వడ్డాణము లాగా. 

ఆ అంబ షోడశీ కదా, ఆ వడ్డాణం కూడా పదహారు వరసలతో వుంది. 

పైగా అది దండ వలే అమ్మ నడుముకి అల్లుకుని వుంది. 

రత్నాలతో చేసిన రమ్యమైన ఆ నగకు, చక్కని చిరు గజ్జెలు వున్నాయి. 

ఆ కింకిణులు చేసే రమ్యమైన రవళి మహా సమ్మోహనకరంగా వుంది. 

ఆ గజ్జెల వడ్డాణాన్ని నడుము చుట్టూ ధరించి ఆ శ్రీ మహారాజ్ఞి ఎంతో అతిశయంగా, ఠీవిగా వుంది. 

ఆ గజ్జెల రవళి జ్ఞానులకు, భక్తులకు ఎంతో ముచ్చటగా వినిపిస్తుంటే, 

వాళ్ళు ఆ నాద సింధువులో మనసారా మునకలేస్తూ ఉల్లాసంగా ఆనందిస్తున్నారు. 

అదే గజ్జెల రవళి దురాత్ములకు, అజ్ఞానులకు భయం గొలిపిస్తుంటే, వాళ్ళు 

ఎటు పారిపోదామా అని దిక్కులు చూస్తున్నారు.  

దురూహ గలిగిన వారికి భీతి కలిగేలా, శరణు చొచ్చిన వారికి ఆశ్రయం దొరికేలా, 

చక్కని కింకిణీ రవం చేసే రత్న రశనను దామములా ధరించిన, 

ఆ మహారాజ్ఞి, రత్నకింకిణి కారమ్య రశనాదామ భూషిత కు వందనం. 

ఓం శ్రీ రత్నకింకిణికారమ్యరశనాదామభూషితాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి