2, ఆగస్టు 2021, సోమవారం

10. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగంతరా


శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా
కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగంతరా ॥ 10 ॥
 

25. శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా

ఈ నామంలో అమ్మవారి దంతపంక్తిని కీర్తిస్తున్నాం. 

శుద్ధవిద్య --- శుద్ధ విద్య అంటే శ్రీ విద్య, షోడశీవిద్య, అసలైన జ్ఞానాన్నిచ్చే విద్య. 

ఈ విద్య పొందడానికి అర్హత, యోగ్యత కావాలి. అందరూ పొందలేరు. 

అమలము శుద్ధవిద్య. బీజాక్షరములతో కూడిన విద్య. 

అన్ని బీజాక్షరములనూ స్పష్టంగా ఉచ్చరించలేని వారు ఈ విద్యకు అనర్హులు. 

కానీ వారు ఇప్పుడు ఆ అర్హత పొందడానికి తపిస్తే, తరువాత జన్మలలో  

ఆ విద్యను పొందే యోగ్యత తప్పక లభిస్తుంది. 

నోటిలో పలువరస కూర్పు ఆ యా బీజాక్షరములను స్పష్టంగా ఉచ్చరించగలిగే విధంగా 

అమరినప్పుడు, ఆ బీజాక్షరములను సరియైన పద్ధతిలో ఉచ్చరించగలరు. 

పళ్ళ కూర్పుపై శబ్ద ఉచ్చారణ ఆధారపడి ఉంటుంది. 

ఇక్కడ బీజాక్షరములు అంటే మన వర్ణమాల లోని అక్షరములే. 

అందుకే వర్ణమాల లోని అక్షరములను తగ్గించకూడదు. 

అంకుర ఆకార --- బీజము నుంచి అంకురం వస్తుంది. అన్ని బీజములూ మొలకెత్తవు.

లోపల మొలకెత్తే శక్తి నిద్రాణముగా వున్న బీజములే అంకురిస్తాయి. 

అంకురించే ముందు బీజము నుంచి మొలక కనిపిస్తుంది. తరువాత బీజము పైకి లేస్తుంది. 

ఆ తరువాత బీజ దళములు రెండూ మొలకను అంటిపెట్టుకునే ఉంటూ రెండుగా

విచ్చుకుంటాయి, సరిగ్గా నోటిలో పైన, కింద వుండే పలువరసల లాగా. 

నోటిలో పళ్ళు ఆ విధంగా అంకురాకారములో వున్నాయి అని భావన. 

ద్విజ --- సాధారణంగా ద్విజులంటే, బ్రాహ్మణులు అనే భావం వాడుకలో వుంది. 

కానీ ద్విజ శబ్దానికి  రెండు జన్మలు ఎత్తినవారని అసలైన అర్ధం. 

పక్షులు, పాములు మొదలైన జంతువులు రెండుసార్లు జన్మమెత్తుతాయి. 

అండముగా ఒకసారి, జంతువుగా ఒకసారి. అవి ద్విజులు. 

అదే విధంగా, శుద్ధవిద్యా జ్ఞానము పొందక ముందు ఒక జన్మ, 

ఆ జ్ఞానము పొందిన తరువాత మరియొక జన్మముగా భావించి,

ఆ శుద్ధవిద్యను పొందిన వారిని ద్విజులు అన్నారు. 

ఈ నామంలో దంతాలను ద్విజులు అంటున్నాం, ఎందుకంటే,

పాలపళ్ళు వచ్చి, అవి రాలిపోయిన తరువాత మరియొక దంత పంక్తి వస్తుంది. 

రెండుసార్లు జన్మించాయి కనుక పళ్లను ద్విజులు అన్నారు. 

పంక్తి ద్వయ --- ఆ పళ్ళు రెండు జతలు కనుక అది పంక్తి ద్వయము. 

షోడశీ అంటే పదహారు. ఈ శుద్ధవిద్య షోడశీ విద్య కదా.  

శివ, శక్తి ఇద్దరికీ కలిపి, పైనా, కిందా చేరి ముప్పది రెండు,  

అంటే పదహారు జతల పళ్ళు, పంక్తిద్వయము, వున్నది.      

ఉజ్వలా --- ఆ దంతపంక్తి ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. 

ఈ నామంలో అమ్మవారి దంత పంక్తి  ఎంత ఉజ్వలంగా  ప్రకాశిస్తోందో చెప్పుకుంటున్నాం. 

శుద్ధవిద్యాంకురాకారములో  ఉజ్వలంగా ప్రకాశించే ద్విజులైన పదహారు జతల పళ్ళు గల,  

ఆ శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వల కు వందనం.  

ఓం శ్రీ శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలాయై నమః 


26. కర్పూరవీటికామోదసమాకర్షిద్ధిగంతరా 

అమ్మవారు వేసుకునే తాంబూలం సుగంధమయమైన కర్పూర తాంబూలం. 

ఏలకులు, లవంగాలు, కేసరి, జాపత్రి, జాజికాయ, పోకలు, మౌక్తిక భస్మము, 

వంటి పలు సుగంధ ద్రవ్యాలతో పాటు పచ్చకర్పూరం కూడా కలిపి సిద్ధంచేసిన 

ఆ కప్పుర విడెము అమ్మ నిత్యమూ నములుతూ ఉంటుంది. అదే అమ్మ ప్రసాదం. 

ఆ సుగంధం దశదిశలా వ్యాపించింది.

అమ్మ ఆ దశదిశలనూ, తన తాంబూలపు సువాసనతో  ఆమోదించి, ఆవరించి వున్నది. 

ఆ యా దిక్పాలకులందరూ ఆ తాంబూలపు సువాసనకు ఆకర్షితులై, 

అమ్మ ఆజ్ఞానువర్తులై వున్నారు. ఈ నాటికీ ఎన్నో శక్తి పీఠాలలో తాంబూలాన్ని 

అమ్మవారికి అర్పించి ప్రసాదంగా స్వీకరించే ఆచారము వున్నది. 

మాహుర్ లో ఏకవీరికా అమ్మవారి తాంబూలపు ప్రసాదం ఎంతో ప్రసిద్ధి. 

అట్టి కర్పూర తాంబూలపు సుగంధముతో దశ దిశలనూ, ఆ దిక్పాలకులనూ 

తన ఆమోదముతో సమాకర్షించి వున్న ఆ కర్పూరవీటికామోదసమాకర్షిద్ధిగంతర కు వందనం. 

ఓం శ్రీ కర్పూరవీటికామోదసమాకర్షిద్ధిగంతరాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి