1, ఆగస్టు 2021, ఆదివారం

9. పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః నవవిద్రుమబింబశ్రీః న్యక్కారిరదనచ్ఛదా


పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః
నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదా ॥ 9 ॥

 23. పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః

పద్మరాగ మణులు మణులన్నిటిలో మహా ప్రకాశవంతమైనవి. 

పద్మరాగాలంటే, మాణిక్యాలు, కెంపులు. ఆ రాయిని చక్కగా సాన పడితే, 

అవి అద్దం కన్నా ఎంతో పారదర్శకంగా ఉంటాయి. ప్రతిబింబాన్ని చూపిస్తాయి. 

పరిభావి అంటే పరాభవించటం. 

ఇక్కడ అద్దం కన్నా స్వచ్ఛమైన ప్రతిబింబాన్ని చూపేవి సాన పెట్టిన పద్మరాగాలనే శిలలు. 

అంతటి నిగనిగలు కూడా అమ్మవారి కపోలాల తళతళల కాంతి ముందు పరాభవం పొందాయి. 

అమ్మవారి కపోలం, అంటే చెంప, అంత స్వచ్ఛంగా, తరళంగా వున్నది. 

అది ఎంత తరళంగా ఉన్నదంటే, 

ఆ జగన్మాతను చూద్దామంటే, ఆ కపోలంలో ప్రతిఫలిస్తున్నది ఆ పక్కనే కూర్చున్న జగత్పిత.

ఎంత గొప్ప అర్ధనారీశ్వర తత్వమో చూడండి. 

చూస్తున్నది అమ్మవారిని, కనపడుతున్నది అయ్యవారు. 

అమ్మవారి చెక్కిళ్ళు అద్దం అంత స్వచ్ఛంగా, తరళంగా వున్నాయి. 

అద్దం లాంటి అమ్మ చెక్కిళ్ళ ముందు సాన పెట్టబడిన పద్మరాగమణులు కూడా 

తలవంచాయి.    

తన అద్దం లాంటి కపోలాలతో పద్మరాగ శిలలని కూడా పరాభవించిన,

ఆ పద్మరాగశిలాదర్శపరిభావికపోలభు కు వందనం.   

ఓం శ్రీ  పద్మరాగశిలాదర్శపరిభావికపోలభువే నమః 


 24. నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా 

విద్రుమం అంటే పగడం, బింబం అంటే దొండపండు.  

రదనచ్ఛదా అంటే దంత పంక్తిని కప్పి ఉంచే పెదవులు. 

ఇక్కడ అమ్మవారి పెదవుల గురించి చెప్పుకుందాం. 

కొత్తగా సాన పెట్టిన పగడం ధగధగలాడుతూ మిలమిలా మెరుస్తూ ఉంటుంది. 

ఆ మిలమిలలు చూసిన నయనాలు కూడా మెరుస్తాయి. 

అప్పుడే పండిన దొండపండు ఎర్రగా, నిండుగా, ఎంతో ముద్దులొలుకుతూ  ఉంటుంది.  

అమ్మవారివి అందుకే బింబాధరాలు. న్యక్కారి అంటే ధిక్కరించటమే. 

అమ్మవారి అధరాలు కొత్త పగడాలనీ, దొండపండ్లనీ కూడా ధిక్కరించేలా వున్నాయి.  

మిలమిలలాడే నవ విద్రుమాన్నీ, మిసమిసలాడే దొండపండునీ కూడా 

ధిక్కరించేంత అందమైన ఎర్రని మెరిసే పెదవులతో మనలను ఆశీర్వదిస్తున్న,  

ఆ నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛద కు వందనం. 

ఓం శ్రీ నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి