ఆ శ్రీ లలిత వుండే మరో స్థానం మహా పద్మాటవి.
పద్మాటవి అంటే ఎన్నెన్నో పద్మాలతో నిండిన అడవి, పెద్ద వనం.
పెద్ద పెద్ద తామర ఆకులతో, ఆ తామరవనం ఎన్నో యోజనాల దూరం వరకు విస్తరించి వున్నది.
ఆ పద్మాల కేసరాలు ఎంతో పొడవుగా వుండి, చాలా దూరం వరకు వాటి సుగంధాన్ని
ప్రసరింప చేస్తున్నాయి.
తుమ్మెదలన్నీ ఆ సుగంధానికి మోహితులై వాటి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.
ఆ సుగంధము, ఈ ఝంకారము కలసి నిత్యమూ ఆ పద్మాటవీ ప్రాంతం ఆనందలాస్యంలో
అద్భుతంగా రమిస్తూ ఉంటుంది. ఆ మహా పద్మాటవే శ్రీలలిత నివాసస్థానం.
మన శరీరంలో ఉన్న షట్చక్రాలన్నీ కూడా ఆ పద్మాటవి లోని పద్మాలే.
ఈ షట్చక్రాలకన్నా పైన, సహస్రారంలో వేయి రేకుల పద్మము ఒకటి వున్నది.
అదే మహా పద్మము. ధ్యానంలో ఆ పద్మాటవిని చేరి అక్కడ మహాపద్మములో
అమ్మను చూసి, ఆమె కృపలో నిశ్చింతగా ఉండవచ్చు.
అమ్మ ఆ పద్మాటవిలో విలాసంగా క్రీడిస్తూ లోకాలోకాలన్నిటినీ పాలిస్తూ ఉంటుంది.
అంతటి మహోన్నతమైన ఆ మహాపద్మాటవీసంస్థ కు వందనం.
ఓం శ్రీ మహాపద్మాటవీసంస్థాయై నమః
60. కదంబ వనవాసినీ
అమ్మ వుండే మరో స్థానం కడిమి చెట్ల తోట. నీపోపవనం.
నీపము అన్నా, కదంబము అన్నా, కాదంబరి అన్నా, కడిమి అన్నా, ఈ కదంబ వృక్షాలే.
అమ్మవారు ఆ కదంబవనంలో ఎంతో ఇష్టంగా క్రీడిస్తూ ఉంటుంది.
ఆ కదంబ కుసుమాలు ధరించి కామేశ్వరి, కామేశ్వరుడితో పరవశిస్తూ ఉంటుంది.
మణిద్వీపంలో, మణిమయమైన గృహంలో, మణిమండప ప్రాకారంలో నిండుగా పూసిన
కదంబ కుసుమాలతో, శోభాయమానంగా విరాజిల్లుతున్న ఆ కదంబవనం అమ్మకు ఎంతో ప్రీతి.
ఆంధ్రదేశంలో త్రిపురాంతకమనే క్షేత్రం వుంది. ఈ ఆలయం చాల పురాతనమైనది.
అక్కడ గర్భాలయంలో బాల త్రిపురసుందరీ దేవి బావిలో నుంచి ఆవిర్భవిస్తున్నట్టు కనిపిస్తుంది.
ఆ బావే చిదగ్ని కుండమని అక్కడి స్థలపురాణం చెపుతుంది.
పరమేశ్వరుడు త్రిపురాసురులని సంహరించింది కూడా ఇక్కడే అని ఆ స్థలపురాణం చెప్తుంది.
అందుకే ఇక్కడి శివుడిని త్రిపురాంతకేశ్వరుడని అంటారు.
ఆ ప్రాంతం కదంబవృక్షాలకు ప్రసిద్ధి. అమ్మవారి ఆలయం చుట్టూ కడిమి చెట్లే.
కదంబ వృక్షాలున్న చోట చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఇటువంటి దేవతావృక్షాలు కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి.
త్రిపురాంతకం అటువంటి ప్రదేశాల్లో ఒకటి. చూడ చక్కగా గుండ్రంగా బంతి వలె వుండి,
చుట్టూ కేసరాలతో మృదువుగా, సుందరంగా, సుగంధభరితంగా ఉంటాయి ఆ పూలు.
ఈ విధంగా పరిమాణంలో, ఆకారంలో బంతి వలె వుండే పూలు కదంబాలు మాత్రమే.
అమ్మకి ఆ వనం, ఆ పుష్పాలు ఎంతో ఇష్టం.
అందుకే ఆ వనంలో ఉండటానికి సంతోషపడుతుంది.
కదంబవనంలో కామేశ్వరుడితో ఉల్లాసంగా గడుపుతున్న, ఆ కదంబవనవాసిని కి వందనం.
ఓం శ్రీ కదంబవనవాసిన్యై నమః
కామదాయినీ అన్నా కామమును తీర్చే తల్లే. ఈ మాత భక్తుల సమస్త కోరికలూ తీరుస్తుంది.
అడిగితే, ఆ శివ సాయుజ్యాన్ని కూడా ఇస్తుంది.
ధర్మమైతే ఎంతటి క్లిష్టమైన వాంఛను కూడా అవలీలగా తీరుస్తుంది.
భండాసురుడంతటి రాక్షసుణ్ణి సంహరించి, దేవేంద్రాదులకు దాస్యవిముక్తి చేయటానికి
ఎంతో అనుకంపతో, చిదగ్నికుండంలో ఆవిర్భవించలేదూ.
ఈ నామం ఆ కామదాయినిని గురించే.
ధర్మరక్షణ కోసం, కష్టమైన కార్యాన్ని సైతం చిరునవ్వుతో పరిష్కరించే,
ఆ కామదాయిని కి వందనం.
ఓం శ్రీ కామదాయిన్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి