25, ఆగస్టు 2021, బుధవారం

33. కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యకా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా

కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యకా 
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత 
వైభవా ॥ 33 ॥

82. కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యకా  

ఇక భండాసురుడు, అతని శూన్యక నగరము మిగిలాయి. ఆ శూన్యక నగరము ఇప్పుడు తన పేరు  

సార్ధకం చేసుకుంది. నగరం శూన్యమయింది. నగరంలో ఎవరూ లేరు, అందరూ హతులయ్యారు. 

కామేశ్వరి అప్పుడు కామేశ్వరాస్త్రం సిద్ధం చేసుకుంది. భండాసురునిపై సంధించింది. 

ఆ అస్త్రాగ్నిలో భండాసురుడితో పాటు, అతని శూన్యక నగరం కూడా సంపూర్తిగా దగ్ధమైపోయింది. 

యుద్ధం  దిగ్విజయంగా పూర్తి అయింది. దేవతాకార్యం సంపూర్ణంగా ముగిసింది.

చిదగ్నిలో నుండి వచ్చిన లలితాదేవి కామేశ్వరాస్త్రాగ్నిలో భండాసురుణ్ణి దగ్ధం చేసింది. 

అజ్ఞానం నశించింది. జ్ఞానాగ్ని మిగిలింది. జీవుడు దగ్ధమైనాడు. 

బూడిద నుంచి పుట్టిన భండాసురుడు తిరిగి బూడిద అయ్యాడు. 

మనం ఎలా పుడతామో, అలాగే పోతాం. కానీ ఈ మధ్యలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము 

జీవుణ్ణి మాయా మోహితుడ్ని చేసి, భ్రమయే నిజమని నమ్మిస్తూ ఉంటుంది. 

అహంకారం నుంచి, క్రోధం నుంచి పుట్టిన జీవుడూ నశించాడు, అతని సామ్రాజ్యమూ నశించింది. 

బంధువులు, మిత్రులు, పుత్రులు, పరివారము, సేవక బృందమూ నశించింది. 

మిగిలినది ఆత్మయే. జీవుడు దాన్ని గ్రహించేలోగా జీవిత నాటకం అయిపోతూ ఉంటుంది. 

అందుకే ఆ సత్యాన్ని గ్రహించేవరకూ పునరపి జననం, పునరపి మరణం. 

ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అదే పరమాత్మ లీల. 

కామేశ్వరాస్త్రంతో భండాసురుణ్ణి, అతని నగరాన్నీ కూడా సమూలంగా దగ్ధం చేసిన  

ఆ కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యక కు వందనం. 

ఓం శ్రీ కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యకాయై నమః 


83. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా

దేవతా కార్యం విజయంగా ముగిసింది. భండాసుర వధ జరిగింది. 

అరవై వేల సంవత్సరాల పాటు, భండాసురుడుకి భృత్యులై, నానా యాతనలు పడిన 

ఆ బ్రహ్మ, ఉపేంద్రుడు, మహేంద్రుడు మొదలైన దేవతలంతా ఎంతో సంతోషించారు. 

కామప్రళయం సృష్టించి, రాక్షసులు తప్ప మరెవ్వరూ సంతానం పొందకుండా ఆపి, 

తమ సంతానం మాత్రమే వృద్ధి చేసుకున్న ఆ రాక్షస సంతతి అంతా, ఈ యుద్ధంలో 

మరణించారు. మిగిలింది కేవలమూ బూడిద, శూన్యత.   

వేల సంవత్సరాల తరబడి పొందిన వేదన నంతా మరచి, దేవతలంతా హర్షధ్వానాలు చేశారు. 

అమ్మవారికి జయధ్వానాలు చేశారు. అమ్మ వైభవాన్ని, పరాక్రమాన్ని అందరూ స్తుతించారు. 

ఆ విధంగా బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్రాది దేవతలచే స్తుతింపబడే 

వైభవముతో శోభిల్లే ఆ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవ కు వందనం. 

ఓం శ్రీ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి