22, ఆగస్టు 2021, ఆదివారం

30. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా

 

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా 
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా ॥ 30 ॥

76. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా

తదనంతర యుద్ధంలో దండనాథ అయిన వారాహీదేవి విశుక్రుణ్ణి సంహరించింది. 

విశుక్రుడు, భండాసురుని మరొక సచివుడు, సోదరుడు. ఈ సోదరుడు కూడా వారాహీదేవిచే 

హతుడయ్యాడు. మహా వీర్య పరాక్రమముతో వారాహీదేవి విశుక్రుడి ప్రాణాన్ని హరించేసింది. 

విశుక్రుడు శుక్రాచార్యునితో సమానమైనవాడు. తన తేజస్సును, శక్తిని 

విపరీతమైన విషయములకు వాడి ద్వంద్వములో పడిపోయినవాడు. 

ఆ జీవుడి ప్రాణశక్తిని హరించి, ఉద్ధరించింది వారాహీ శక్తి.  

జీవుడు ఎప్పుడూ రాగము-ద్వేషము, ఆనందము-దుఃఖము, కష్టము-సుఖము 

వంటి ద్వందాలలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. 

ఆ స్థితిలో నుంచి జీవుడిని విముక్తుడిని చేయటానికి ఈ శక్తులు ప్రకటితమవుతూ ఉంటాయి. 

విషంగ, విశుక్ర వధల వలన భండాసురుడు రెండు భుజములూ తెగినవాడై పోయాడు. 

విశుక్రుడు ప్రాణాన్ని హరించిన వారాహీదేవి వీర్య శౌర్యాలకు ఆనందిస్తున్న, 

ఆ విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందిత కు వందనం. 

ఓం శ్రీ విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితాయై నమః 


77. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా 

యుద్ధంలో జరుగుతున్న ప్రాణనష్టాన్ని గమనించిన భండాసురుడు ఒక పెద్ద బండపై 

జయవిఘ్నమనే యంత్రమును గీసి దానికి ప్రాణప్రతిష్ట చేసాడు. ఆ బండను బలంగా 

శక్తిసైన్యం మధ్యలోకి విసిరివేసాడు. ఆ బండ వహ్ని ప్రాకారాన్ని కూడా దాటుకుని శక్తి సైన్యం 

మధ్యలో ఎక్కడో పడింది. ఆ యంత్రప్రభావం వల్ల శక్తి సైన్యం ఒక్కసారిగా బలహీనపడింది,

చెదిరిపోయింది. సైన్యమంతా తలొక  తీరుగా మారిపోయారు. అమ్మకు విషయం అర్ధమయింది. 

అప్పుడు ఆ విఘ్నాలను నివారించటానికి సంకల్పించింది. 

తన పతియైన కామేశ్వరుని చిరునవ్వుతో ఒకసారి చూచింది. 

అప్పటికప్పుడు గణేశ్వరుడు జన్మించాడు. గణేశ్వరుడు విఘ్ననాయకుడు. 

కామేశ్వరుని ముఖావలోకనము చేసినంత మాత్రమున గణేశ్వరుని కల్పించే శక్తి గల, 

ఆ కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వర కు వందనం. 

ఓం శ్రీ కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరాయై నమః 


గణేశోత్పత్తి వివిధ సందర్భాలలో వేరే వేరేగా చెప్పబడింది. 

ఇక్కడ లలితాసహస్రనామాలలో చెప్పబడిన గణేశోత్పత్తి వివరం చెప్పాను. 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి