భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ॥ 28 ॥
72. భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా
లలితాదేవి సైన్యమంతా యుద్ధానికి ఉత్సాహంగా ముందుకు ఉరుకుతోంది.
యజ్ఞస్థలి అయిన హిమాలయ పర్వతసానువుల నుంచి, దక్షిణాపథంలో వున్న మహేంద్రగిరి
పర్వతాల వద్ద వున్న భండాసురుని రాజధాని, శూన్యకనగరానికి చేరుకుంది అమ్మ సేనావాహిని.
భండాసురుడు విషయం తెలిసినా, 'ఒక స్త్రీ, తన స్త్రీ సేనతో నా అంతటి మొనగాణ్ణి
సంహరించగలదా' అని ఉపేక్షించాడు. అమ్మ విలువ, శక్తి తెలియని సామాన్య జీవుడు, భండుడు.
అమ్మ సైన్యమంతా భండసైన్యాన్ని వధించటానికి ఎంతో రణోత్సాహంతో ఉద్యుక్తులై వున్నారు.
నకులీశ్వరి వంటి శక్తులను, వారి విక్రమాన్నీ చూసి అమ్మ హర్షం వ్యక్తం చేసింది.
జీవుడు మోహములో పడి, సంసార లంపటములో పరిభ్రమిస్తున్నపుడు,
శక్తి సేన మాత్రమే జీవుడిని ఆ బంధనాల నుంచి ఉద్ధరించగలదు.
ఏ శక్తీ పని చేయలేని చోట, స్త్రీ శక్తి అవలీలగా ఆ కార్యాన్ని సాధించగలదు.
శక్తి మహాత్మ్యం అది. ద్వంద్వాన్ని తొలగించి ఏకత్వభావనను కలిగించటమే అద్వైతము.
అప్పుడు జీవుడు, దేవుడు ఒక్కటే అనే జ్ఞానం కలుగుతుంది.
ఆ అద్వైత జ్ఞానాన్ని ఇచ్చి బంధాల నుంచి జీవుడిని విముక్తుడిని చేసేదే శక్తి.
అటువంటి శక్తి సేనలన్నీ భండ వధకు ఉద్యుక్తులై వున్నాయి.
భండాసుర సైన్యాన్ని వధించటానికి సిద్ధంగా వున్న లలితాసైన్యాన్ని చూసి హర్షిస్తున్న,
ఆ భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షిత కు వందనం.
ఓం శ్రీ భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితాయై నమః
ఓం శ్రీ నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి