3, ఆగస్టు 2021, మంగళవారం

11. నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా

 నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా ॥ 11 ॥ 

27. నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ 

కచ్చపి సరస్వతీదేవి వీణ. వీణలలో మహత్తరమైన వీణ. 

చక్కని నాదాన్నీ, శబ్దాలనూ పలికే వీణ. 

ఆమె చేతిలో కచ్చపితో  వీణా వాదనము చేస్తూ, గానము చేస్తూ ఉంటే ఎంతో వీనుల విందు

అటువంటి సరస్వతి తన కచ్చపి వాయిస్తూ చేసిన గానము కన్నా 

శ్రీ మాత సంభాషణము ఎంతో మధురంగా శృతిపేయముగా వున్నదిట. 

ఆ విధంగా  సరస్వతీ దేవి అంత గొప్ప గానవిద్యా విశారద, కచ్ఛపీ వాదనముతో చేసిన గానము 

కూడా శ్రీదేవి మధురమైన అతి మామూలు సల్లాపం ముందు ఓడిపోయాయి. 

ఒకసారి అమ్మవారి ముందు సరస్వతీ దేవి, శంకరుని విజయగాధలను కీర్తిస్తూ 

కచ్చపిని వాయిస్తూ గానం చేస్తున్నది.  

తన భర్తను పొగడుతూ సరస్వతీదేవి  చేస్తున్న గానము వింటూ ఆనంద పరవశంతో, 

తల పంకిస్తూ అమ్మ ఎంతో సంతోషంతో 'ఆహా' అన్నది. 

అంతే, ఆ కంఠ మాధుర్యానికి సరస్వతి సిగ్గుపడి వెంటనే గానం ఆపేసి, 

తన కచ్చపికి ముసుగు తొడిగేసింది. 

అటువంటి మధురాతిమధురమైన కంఠం అమ్మవారిది. 

కచ్ఛపీ మధుర గానాన్నే తన స్వీయ మధుర సల్లాపముతో తిరస్కరించిన,

ఆ నిజసల్లాపమాధుర్య వినిర్భత్సితకచ్ఛపి కి వందనం. 

ఓం శ్రీ నిజసల్లాపమాధుర్య వినిర్భత్సితకచ్ఛప్యై నమః 


28. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా 

కామేశ్వరి తన చక్కని మందస్మితమనే మహా ప్రవాహములో ఈ లోకాలన్నిటినీ ముంచివేసింది. 

కామేశ్వరుడు కూడా అమ్మవారి మందహాసమనే వారిధిలో మునకలు వేస్తూ వున్నాడు. 

కానీ ఈత రుచి తెలిసిన కామేశ్వరుడు, ఆ అంబుధిలో మునిగిపోయి ఉక్కిరిబిక్కిరి కాకుండా 

చక్కగా ఈదులాడుతూ, మునుగుతూ తేలుతూ ఆనందిస్తున్నాడు. 

కామేశ్వరుని ఆనందంలో కామేశ్వరి కూడా భాగస్వామిని అవుతూ సంపూర్తిగా 

కామేశుని మనస్సుని తనలో పూర్తిగా నింపుకున్నది. 

కామేశ్వరి తన మనసు నిండా వున్న కామేశ్వరునితో కలసి ఆనందిస్తూ, 

ఈ మహా సృష్టిని సంకల్పించింది. 

అమ్మ కల్పనలో ఈ లోకములు, లోకేశులు, లోకస్థులు సృజింపబడ్డాయి. 

తన మందస్మిత వారిధిలో ఆనందంతో మునకలు వేస్తున్న కామేశ్వరుని 

మనసంతా నింపుకుని వున్న, ఆ మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానస కు వందనం. 

ఓం శ్రీ మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


1 కామెంట్‌:

  1. వివరణ చాలా అద్భుతంగా ఉంది చదువుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది మీకు చాలా చాలా ధన్యవాదములు

    రిప్లయితొలగించండి