అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటి భిరావృతా ॥ 25 ॥
వారంతా మహిళాసైన్యమే. కామేశ్వరుడు కూడా భైరవ సేనను సృష్టించాడు.
అయినప్పటికీ మొత్తం సేనలో ఎక్కువమంది స్త్రీలే. సృష్టిలో మొట్టమొదటి మహిళాసైన్యమది.
మరి భండాసురుడికి రుద్రుని వరం వున్నది కదా, ఎవడి చేతా మరణము లేదని, అంటే,
ఏ పురుషుడి చేతా వధింపబడడని. పైగా ఈ బ్రహ్మాండముకు చెందిన వారెవరి చేతా కూడా
మరణము లేదని మరొక వరము. కనుక భండాసురుడ్ని సంహరించటానికి స్త్రీ సేనే కావాలి,
ఈ బ్రహ్మాండమునకు ఆవల నుంచి వచ్చిన లలితాపరమేశ్వరీ దేవే కావాలి.
లలితాదేవి తన అంకుశము నుంచి సంపత్కరీదేవిని సృష్టించింది.
ఈ సంపత్కరి మదించిన ఏనుగు నెక్కి వున్నది.
కొన్ని కోట్ల సింధురవ్రజానికి ఈమె అధినేత్రి. సింధురవ్రజమంటే, ఏనుగుల గుంపు.
ఈ సంపత్కరీదేవి లలితాదేవి గజదళానికి అధికారిణి. కోటానుకోట్ల గజసేనతో సేవింపబడుతూ
వున్న సంపత్కరి, లలితాదేవి శాసనాన్ని అనుసరించటానికి సిద్ధంగా వున్నది.
సంపత్కరీ మాత యోగదాయిని. గజయోగము కన్న గొప్ప యోగము, గజారోహణము కన్నా గొప్ప
వైభవము లేవు. సంపత్కరీ ఈ గజ సమూహానికే అధిష్టాత్రి.
ఈ దేవిని కొలిస్తే గొప్ప యోగాన్ని, వైభవాన్ని ఇస్తుంది. చిత్తవృత్తి నిరోధం చేసి సుఖాన్నిస్తుంది.
యోగదాయిని, వైభవకారిణి, గజారూఢయైన సంపత్కరీ దేవితో సేవింపబడుతున్న,
ఆ సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవిత కు వందనం.
ఓం శ్రీ సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితాయై నమః
కొన్ని కోటానుకోట్ల అశ్వసేనతో, అశ్వారూఢ లలితాదేవి ఆదేశంతో యుద్ధానికి సిద్ధంగా వున్నది.
ఈ అశ్వారూఢ అధిష్టించిన అశ్వము పేరు అపరాజిత, పరాజయములేనిది.
అశ్వములు ఇంద్రియాలకు సంకేతం. అశ్వారూఢ ఆ ఇంద్రియములపై అధిరోహించి
ఇంద్రియములను కళ్లెము పట్టి, తన అధీనములో వుంచుకున్నది అని భావం.
ఒకసారి వీటికి లొంగితే, పదేపదే ఆ విషవలయంలోనే తిరుగుతూ ఉంటాడు జీవుడు.
వాసనలని, ఇంద్రియాలను అదుపులో వుంచుకోవడానికి ఈ దేవిని సేవించాలి.
భండాసురుడు ఇంద్రియలోలుడైన జీవుడైతే, అట్టివానికి కళ్లెము వేసి పట్టటానికి అశ్వారూఢ
అమ్మ ఆదేశం కోసమై అపరాజితను ఎక్కి, తన కోటానుకోట్ల అశ్వసైన్యంతో సన్నద్ధంగా వుంది.
కొన్ని కోట్ల అశ్వసేనకు అధికారిణియైన అశ్వారూఢ చే ఆవృతమైన,
ఆ అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృత కు వందనం.
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
చాలా బాగా ఉంది వివరణ చదువుతుంటే చాలా సంతోషంగా కూడా ఉంది ఇప్పుడు లలిత చదువుతుంటే ఎంతో ఆనందంగా కూడా ఉంది🙏🙏 , ధన్యవాదములు మీకు ఇంత చక్కటి వివరణ ఇంత సులభంగా అందించినందుకు
రిప్లయితొలగించండి