అదృశ్యా అంటే కనిపించనిది. అమ్మ ఇంద్రియాలకు గోచరము కాదు కనుక, ఈ నామం వచ్చింది.
దృశ్యము కనిపిస్తుంది. అదృశ్యము భౌతికనేత్రానికి కనిపించదు.
అంటే బాహ్య ఇంద్రియమైన కంటికి కొన్ని పరిమితులున్నాయి. బాహ్యమైనదే చూపలేని కన్ను,
కనుక కన్ను చూపించే జగత్తు కన్నా భిన్నమైనది ఆ పరమేశ్వరి. అందుకే ఆ తల్లి అదృశ్యా.
అమ్మను చూడాలంటే, అంతర్నేత్రం తెరుచుకోవాలి. అమ్మ ధ్యానగమ్యా కదా.
నేను అనే భావనే 'అ' అనే అక్షరం. ఆ 'నేను' ఎవరో తెలిస్తే, ఆ 'నేను' ను చూడగలిగితే,
ఓం శ్రీ అదృశ్యాయై నమః
650. దృశ్యరహితా
దృశ్యరహితా అంటే దృశ్యముగా కనపడనిది, దృశ్య జగత్తులో లేనిది.
నిర్గుణమైన, నిరాకరమైన ఆ పరమేశ్వరి ఏ దృశ్యములోనూ ఉండదు.
దృశ్యాన్ని రహితము చేస్తోంది, కనుక ఆ తల్లిని ఈ నామంలో, దృశ్యరహితా అంటున్నాం.
దృశ్యం వ్యావహారికమైతే, అదృశ్యం పారమార్థికం.
ఎప్పుడూ కనపడే దృశ్యం కొంచెమే, దృశ్యరహితమై కనపడనిదే అనంతమైనది.
ఏ విషయమునకూ లొంగనిది కనుక, అమ్మ నిర్విషయ స్వరూపురాలు.
దృశ్యాన్ని రహితం చేస్తూ, సామాన్యచక్షువుకు గోచరించని, ఆ దృశ్యరహిత కు వందనం.
651. విజ్ఞాత్రీ
అమ్మ తెలుసుకొనలేనిది ఏదీ లేదు, కనుక ఈ నామంలో ఆ లలితాదేవిని విజ్ఞాత్రీ అంటున్నాం.
ఆ పరమేశ్వరి తాను అన్నీ తెలుసుకుంటుంది కానీ, తాను దేనికీ తెలియబడదు.
వేదములో, అన్నింటినీ తెలుసుకొను వాడే పరమాత్మ అని చెప్పారు. ఆ పరమేశ్వరి సర్వసాక్షిణీ
కనుక, ఆ జగన్మాతకు తెలియకుండా ఏదీ జరగదు. అందుకే ఆ జగదీశ్వరిని విజ్ణాత్రీ అంటున్నాం.
దేవాలయాలకైనా, ఆ దేవత మనలను చూడాలని సంకల్పిస్తే వెళ్ళగలం కానీ,
మనం ఆ దేవతను చూడాలని సంకల్పిస్తే వెళ్లలేం.
సంకల్పం ఆ మహామాయది, ఆ సంకల్పానుసారం చరించేది జగత్తు.
తెలుసుకొనడమే కానీ తెలియబడని, ఆ విజ్ఞాత్రి కి వందనం.
652. వేద్యవర్జితా
వేద్యము అంటే తెలియదగినది. వేద్యవర్జితా అంటే ఆ విధంగా తెలియబడే దానిని వర్జించినది
అని అర్ధం. అమ్మకు తెలియనిది ఏదీ లేదు, కనుక తెలుసుకొనుటకూ ఏమీ లేదు.
అందువలన ఈ నామంలో అమ్మను వేద్యవర్జితా అంటున్నాం. అమ్మకు సర్వజ్ఞత్వమున్నది.
సర్వమూ ఆ లలితాపరమేశ్వరియే. ఆ తల్లి కన్నా ఈ జగత్తులో భిన్నమైనది ఏదీ లేదు.
కనుక ఆ తల్లికి తెలుసుకొనుటకు, ఈ సమస్త బ్రహ్మాండాలలో ఎక్కడా, ఏమీ లేనే లేదు.
తెలుసుకొనుట అనే కర్మను వర్జించిన, ఆ వేద్యవర్జిత కు వందనం.
ఓం శ్రీ వేద్యవర్జితాయై నమః
653. యోగినీ
యోగము అంటే కలయిక, అపూర్వ వస్తుప్రాప్తి, అదృష్టము, అష్టాంగయోగము, ఐక్యభావన,
అనే అర్ధాలున్నాయి. పరమాత్మతో ఐక్యభావన కలగటమే యోగము.
చిత్తవృత్తి నిరోధకమే యోగమార్గము, అంటే మనసుని అదుపులో వుంచుకోగలగటం.
ఏకాగ్రతతో జీవాత్మను పరమాత్మలో లయం చెయ్యటమే యోగము.
శ్రీచక్రం లోని తొమ్మిది ఆవరణల్లోనూ ప్రతి కోణంలోనూ యోగినులు వున్నారు.
వీరి గురించి 'చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా' నామంలో చెప్పుకున్నాం.
షట్చక్రాలలో, సహస్రారంలో వున్న డాకినీ నుంచి యాకినీ వరకు కల ఏడుగురు యోగినుల
గురించి కూడా చెప్పుకున్నాం. ఈ నామంలో శ్రీచక్రంలోని నవావరణాల లోనూ వుండే
తొమ్మిదిమంది ప్రధాన యోగినుల గురించి తెలుసుకుందాం.
ప్రధమావరణమైన భూపురాన్ని త్రైలోక్యమోహనచక్రం అంటారు. ఆ ఆవరణ దేవత ప్రకటయోగిని.
ద్వితీయావరణమైన షోడశదళాన్ని సర్వాశాపరిపూరకచక్రం అంటారు.
ఆ ఆవరణ దేవత గుప్తయోగిని.
తృతీయావరణమైన అష్టదళాన్ని సర్వసంక్షోభిణీచక్రం అంటారు.
ఆ ఆవరణ దేవత గుప్తతరయోగిని.
చతుర్ధావరణమైన మన్వస్రాన్ని సర్వసౌభాగ్యదాయకచక్రం అంటారు.
ఆ ఆవరణ దేవత సంప్రదాయయోగిని.
పంచమావరణమైన బహిర్దశారాన్ని సర్వార్థసాధకచక్రం అంటారు.
ఆ ఆవరణ దేవత కులోత్తీర్ణయోగిని.
షష్టమావరణమైన అంతర్దశారాన్ని సర్వరక్షాకరచక్రం అంటారు.
ఆ ఆవరణ దేవత నిగర్భయోగిని.
సప్తమావరణమైన అష్టకోణాన్ని సర్వరోగహర చక్రం అంటారు. ఆ ఆవరణ దేవత రహస్యయోగిని.
అష్టమావరణమైన త్రికోణాన్ని సర్వసిద్ధిప్రదచక్రం అంటారు.
ఆ ఆవరణ దేవత అతిరహస్యయోగిని.
నవమావరణం బిందువే. దానిని సర్వానందమయచక్రం అంటారు.
ఆ ఆవరణ దేవత పరాపరరహస్యయోగిని.
ఈ యోగినులందరూ శ్రీలలిత అంశా రూపాలే. వీరందరిచేతా సేవింపబడే మహాయోగిని అమ్మ.
యోగినులకే యోగిని అయిన, ఆ యోగిని కి వందనం.
ఓం శ్రీ యోగిన్యై నమః
654. యోగదా
యోగమంటే ఏమిటో చెప్పుకున్నాం. అటువంటి యోగాన్నిచ్చేది యోగదా.
పరమాత్మతో ఐక్యభావనను కలుగచేసేది ఆ పరమేశ్వరి. కనుక ఆ తల్లిని ఈ నామంలో యోగదా
అంటున్నాం. అసలైన యోగం ఆ శ్రీమాత కృపను పొందటమే.
శ్రీమాత అనుగ్రహం ఉంటేనే అన్ని యోగాలూ కలుగుతాయి. అప్పుడే కళ్ళు చూడగలవు, చెవులు
వినగలవు, కాళ్ళు నడవగలవు. బుద్ధి పనిచేయగలదు. సద్గురువు లభించగలడు.
ఇవి అన్నీ ఇచ్చేది ఆ యోగదా అయిన శ్రీమాత.
ఉపాసకులకు పరమాత్మతో ఐక్యమయ్యే యోగాన్నిచ్చే, ఆ యోగద కు వందనం.
ఓం శ్రీ యోగదాయై నమః
655. యోగ్యా
యోగ్యా అంటే యోగము పొందుటకు అర్హమైనది అని అర్ధం.
అమ్మను నమ్మినవారికి భోగము కూడా యోగముగా దక్కుతుంది. వారికి యోగమే భోగము.
జనకరాజర్షి అట్టివాడు. చక్రవర్తిత్వము ఆయనకు భోగము, యోగము కూడా.
యోగము అంటే, అదృష్టము. సిసలైన ఉపాసకుడు అమ్మ ఏది ఇస్తే దానిని యోగముగా
స్వీకరించి, భోగముగా అనుభవిస్తాడు. కనుక యోగమే భోగము, యోగినియే భోగిని.
ఎవరికి ఏ అర్హత ఉందో, వారికి ఆ యోగాన్నివ్వటం, ఆ యోగ్యురాలైన పరమేశ్వరికే సాధ్యం.
యోగ్యులను గుర్తించి యోగాన్నిచ్చే, ఆ యోగ్య కు వందనం.
ఓం శ్రీ యోగ్యాయై నమః
656. యోగానందా
యోగము వలన పొందే ఆనందస్వరూపురాలు అని అర్ధం.
జ్ఞానశక్తి స్వరూపురాలు, యోగనృసింహ స్వరూపము అనే అర్ధం కూడా వుంది.
యోగ్యులైన వారికి ఆనందమును కలుగచేయు యోగ్యను యోగానందా అంటున్నాం.
శివుడు, శక్తి కలిసి ఉండటాన్ని యోగము అంటారు. యోగము అంటే కలయిక కదా.
అట్టి కలయిక వలన ఆనందము పొందునది శ్రీమాత అని ఒక అర్ధం.
జీవాత్మ పరమాత్మను చేరితే ఆనంద సుధాధారలు వర్షిస్తాయి.
హరివంశంలో, "యోగానందా అంటే, ఘనమైన ఆనందమగు యోగనిద్రా స్వరూపము,
శ్రీమన్నారాయణునితో కలిసి పుట్టినది, సదాశివుని భార్య, స్వల్పకాలము లోనే మోహిని వలె
లోకాల నన్నింటినీ ఆవహిస్తుంది" అని వుంది.
నందానదీ స్వరూపురాలు. హిమవత్పర్వతముల నుండి పుట్టిన అలకనందా అనే గంగానదీ
స్వరూపము అని ఒక అర్ధం. పద్మపురాణంలో సరస్వతీ నదికే నందా అనే నామము వున్నదని
చెప్పారు. పుష్కరక్షేత్రములో వున్న నదికి నందా అనీ, సరస్వతీ అనీ నామాలున్నాయి.
వరాహపురాణంలో, అష్టభుజ గాయత్రియే, నందాదేవి అని వుంది.
సుషుప్తి అవస్థలో యోగనిద్రా రూపములో ఆనందమును కలుగచేసేది యోగానందా దేవియే.
యోగములో ఆనందము నిచ్చు, ఆ యోగానంద కు వందనం.
ఓం శ్రీ యోగానందాయై నమః
657. యుగంధరా
యుగము అంటే కృత మొదలగు నాలుగు యుగములనీ, జత, కాడి, లోకము అనే అర్ధాలున్నాయి.
యుగము అంటే కాలచక్రము. కాలము అనే రథమును అమ్మ నడిపిస్తూనే ఉంటుంది.
బండిని చక్రములు, కాడి ఏ విధముగా మోస్తున్నాయో, ఆ విధంగా సకల లోక భారాన్నీ
మోస్తున్న యోగిని యుగంధర. యుగాలను నిర్వహిస్తున్నది అని ఒక అర్ధం.
యుగములను ధరించేది యుగంధరా. కాలచక్రమును ధరించింది యుగంధరా.
కాలచక్రమనే యుగాలను మోస్తున్న, ఆ యుగంధర కు వందనం.
ఓం శ్రీ యుగంధరాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650