సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ
స్వాహా, స్వధా, అమతిః, మేధా, శ్రుతిః, స్మృతిః, అనుత్తమా ॥ 110 ॥
533. సర్వౌదనప్రీతచిత్తా
అన్ని రకముల అన్నములనూ ఇష్టముగా, ప్రీతితో భుజించునది పరమేశ్వరి అని అర్ధం.
పాయసాన్నము, స్నిగ్ధౌదనము, గుడాన్నము, దధ్యన్నము, ముద్గౌదనము, హరిద్రాన్నము,
వంటి అన్ని రకముల అన్నములనూ ఇష్టపడుతుంది. ఏ అన్నమైనా అమ్మ ప్రసాదమే.
కనుకనే అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్పారు.
అందుకే అన్నమును నిందించటం కానీ, వృధా చేయటం కానీ చెయ్యటం దోషం.
దైవ దూషణతో సమానం. అన్నద్వేషము దైవద్వేషమే.
ఓం శ్రీ సర్వౌదనప్రీతచిత్తాయై నమః
534. యాకిన్యంబాస్వరూపిణీ
ఈ యాకీనీ నామ దేవత సర్వ వర్ణములలో శోభిల్లుతూ, సర్వ ఆయుధములనూ ధరించి,
సకల దిశలనూ ఏకకాలంలో చూడగలిగే సహస్ర ముఖములు కలిగి, శుక్లధాతువులో ఉంటూ,
అన్ని రకముల చిత్రాన్నములనూ ప్రీతితో నైవేద్యముగా స్వీకరించు శ్రీ లలితాపరమేశ్వరి.
"డ, ర, ల, క, స, హ, య" అను బీజాక్షరములతో సూచింపబడే డాకినీ, రాకినీ, లాకినీ, కాకినీ,
మహాయోగినులు. సహస్రదళపద్మము పూర్ణచంద్రుని వలె షోడశకళలతో ప్రకాశిస్తూ ఉంటుంది.
ఆ ప్రకాశం సూర్యకాంతి వలె తేజస్సుతో, చంద్రకాంతి వలె చల్లదనంతో ఉంటుంది.
అక్కడ చంద్రునికి వృద్ధి, క్షయములు లేవు. నిష్కళంక చంద్రుడు.
ఈ సహస్రార స్థానము మన శరీరమును దాటి పైన వున్న జ్యోతిశ్చక్రములో వున్నది కనుక,
ఆ చంద్రునికి భూమిపైన ఉన్నట్లు కళా భేదములుండవు. అది ఎప్పుడూ పూర్ణమే.
ఆ పూర్ణ స్థానములో శివాశివులిద్దరూ ఆ సహస్రదళపద్మముపై కూడి వుంటారు.
అదే పరమాత్మ స్థానం. ఆ దృశ్యాన్ని వీక్షించిన వారిని యోగులు, అవధూతలు అంటాం.
సహస్ర దళ పద్మములో వుండి, భక్తులకు సాయుజ్యముక్తిని కటాక్షిస్తున్న,
ఆ లలితా పరాభట్టారిక, ఆ యాకిన్యంబాస్వరూపిణి కి వందనం.
ఓం శ్రీ యాకిన్యంబాస్వరూపిణ్యై నమః
535. స్వాహా
ఇంతవరకూ అమ్మవారి యోగినీ రూపాల గురించి తెలుసుకున్నాం.
ఇక ముందు అమ్మవారి మిగిలిన రూపాల గురించి కూడా తెలుసుకుందాం.
అన్ని రూపాలూ తెలిస్తేనే ఆ లలితాత్రిపురసుందరి విరాడ్రూపం కొద్దిగా అయినా
బోధపడుతుంది. ఈ నామంలో అమ్మవారిని స్వాహా అంటున్నాం.
స్వాహాదేవి శివుని అష్టమూర్తులలో ఒకటైన వహ్నిమూర్తి అర్ధాంగి.
వీరి పుత్రుడే కుమారస్వామి అని లింగాపురాణంలోనూ, వాయుపురాణంలోనూ కూడా చెప్పబడింది.
స్వః అంటే, స్వర్గము, ఆత్మ అనే అర్ధాలున్నాయి. హః అంటే హవిస్సు, గతి అని అర్ధాలున్నాయి.
స్వాహా అంటే, ఆత్మ గతి తెలిసినది, స్వర్గ గతి తెలిసినది అని అర్ధం.
స్వాత్మజ్ఞానం కలిగినది స్వాహా. హోమాలలో "స్వాహా, స్వధా, వౌషట్, వషట్" అను శబ్దముల
ద్వారా హవిస్సులను స్వీకరించి దేవతలకు అందించునది అని భావం.
దేవీ భాగవతం ప్రకారం, స్వాహాదేవి అగ్నిదేవుని భార్య. వారికి ముగ్గురు పుత్రులు, ఆవహనీయాగ్ని,
గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని. యజ్ఞాలు, యాగాలు జరిగేటప్పుడు, హోమంలో వేస్తున్న హవిస్సులు
దేవతలకు అందకుండా రాక్షసులు అపహరిస్తుంటే, దేవతలు ఆకలికి బాధపడి
బ్రహ్మ, విష్ణువులను ప్రార్ధిస్తారు. అపుడు విష్ణువు స్వాహాదేవిని, 'అగ్నిదేవుడిని వివాహమాడి,
ఆ హవిస్సులను దేవతలకు అందించమని' చెబుతాడు. ఆ విధంగా యజ్ఞయాగాదులు
జరిగేటప్పుడు హవిస్సులు స్వాహాదేవి ద్వారా దేవతలకు అందుతాయి.
పద్మపురాణంలో మాహేశ్వరీ పీఠాధిష్ఠాన దేవత మాహేశ్వరీదేవియే స్వాహా అని చెప్పబడింది.
అగ్నిదేవుని పత్ని రూపములో దేవతలకు హవిస్సులను అందిస్తున్న, ఆ స్వాహా కు వందనం.
ఓం శ్రీ స్వాహాయై నమః
ఓం శ్రీ స్వధాయై నమః
537. అమతిః
అమతి అంటే అవిద్యా స్వరూపురాలు అని అర్ధం. స్వల్పమగు స్వాత్మజ్ఞానము, వృత్తిజ్ఞానము
కూడా అమతి, అవిద్య అని దుర్గభట్టుడు నిరుక్తంలో చెప్పాడు.
మతి అంటే బుద్ధి. దీనిని సృష్టించింది శ్రీమాత. ఈ నామంలో అమ్మవారిని అమతి అని
చెప్పుకుంటున్నాం. మతీ, అమతీ రెండూ ఆ శ్రీదేవియే. ఆ శ్రీదేవి విద్యావిద్యా స్వరూపిణి కదా.
ప్రధమ సృష్టికి ముందు బుద్ధి సృష్టి జరగలేదు. క్రమేపీ ఈ బుద్ధి సృష్టి, ఆ శ్రీవిద్య ద్వారా జరిగి,
అర్హులకు శుద్ధవిద్య అందింది. ఈ విద్య అందని వారూ వుంటారు.
వారు అమతి యందు ఉంటారు. అంటే అవిద్యా స్వరూపులుగా వుంటారు.
అవిద్యాస్వరూపముగా జీవులయందు వున్న, ఆ అమతి కి వందనం.
ఓం శ్రీ అమత్యై నమః
538. మేధా
మేధా అంటే, బుద్ధి స్వరూపిణి అని అర్ధం. చక్కని ధారణాశక్తి కలవారిని మేధావులు అంటాం.
ఓం శ్రీ మేధాయై నమః
539. శ్రుతిః
శ్రుతులంటే వేదాలు. ఈ నామంలో అమ్మవారిని 'వేదమే రూపముగా కలది' అని కీర్తిస్తున్నాం.
వినబడేదాన్ని కూడా శ్రుతి అంటాం. కనుక ఆ శ్రీదేవిని ఈ నామంలో శ్రవణజ్ఞానస్వరూపురాలు
అని కూడా చెప్పుకుంటున్నాం. శ్రీవిద్యా స్వరూపిణి యైన లలితాదేవి చేత చెప్పబడినవే
శ్రుతులు. అమ్మ ద్వారా బ్రహ్మకు, బ్రహ్మ ద్వారా ఋషులకు, వినడం ద్వారా అందినవే
వేదములు. అందుకే వీటిని శృతులు అన్నారు. సృష్ట్యాదిలో లిపి లేదు.
వేదములన్నీ గురుముఖతః చెప్పబడినవే. విద్ అనే ధాతువు నుండే వేదము, విద్య అనే పదాలు
వచ్చాయి. మొదట, ఋక్, యజుర్, సామ వేదములు అన్నీ కలిపి ఉండేవి.
వాటిని క్రమబద్ధంగా విభజించిన వాడు వేదవ్యాసుడు. వ్యాసుని ద్వారా ఈ వేదములు,
ఆతని శిష్యులైన, పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు మొదలైన వారికి అందాయి.
ఆ తరువాత వారి ద్వారా, వారి శిష్యులకు పరంపరగా అందాయి.
ఇవి అన్నీ గురుముఖతః చెప్పబడినవే.
గురువు ఉచ్చరిస్తుంటే, వాటిని విని, అదే పద్ధతిలో శిష్యులు కూడా వాటిని ఉచ్ఛరించేవారు.
విని నేర్చుకునేవి కనుక ఇవి శ్రుతులు. ఈ నామంలో ఆ పరమేశ్వరిని శ్రుతీ అని అంటున్నాం.
వేదములను మనకు అందించిన ఆ వేద స్వరూపిణి, ఆ శ్రుతి కి వందనం.
ఓం శ్రీ శ్రుత్యై నమః
540. స్మృతిః
స్మృతి అనే నామంతో ఆ మాహేశ్వరిని సంబోధిస్తున్నాం. స్మరించుకునేది స్మృతి.
శ్రుతి శ్రవణ జ్ఞాన రూపమైతే, స్మృతిది స్మరణ జ్ఞాన రూపం.
దేవీ భాగవతంలో సంస్మరించబడునది కనుక స్మృతీ అని చెప్పారు.
వేదార్ధాలను వివరించడానికి చెప్పినవే స్మృతులు.
పద్దెనిమిది మంది ఋషులు పద్దెనిమిది స్మృతులను చెప్పారు.
వీటితో పాటు పద్దెనిమిది ఉప స్మృతులు కూడా వున్నాయి.
అన్నింటిలో చెప్పినది ధర్మ పద్ధతిలో జీవించటం ఎలా అనేదే.
ఈ స్మృతుల ఆధారంగానే ధర్మ సింధు, నిర్ణయసింధు వంటి గ్రంధాలు కూడా రచించబడ్డాయి.
మనుస్మృతి, పారాశర స్మృతి, యాజ్ఞ్యవల్క్య స్మృతి వంటివి కొన్ని బాగా ప్రాచుర్యం లోకి వచ్చాయి.
జరిగినది, జరగబోవునది కూడా, ఈ స్మృతుల ద్వారా స్మరిస్తాము కనుక వీటికి స్మృతులు అని
పేరు వచ్చిందని వాయుపురాణంలో చెప్పారు.
స్మరణ జ్ఞాన రూపములో వున్న, ఆ స్మృతి కి వందనం.
ఓం శ్రీ స్మృత్యై నమః
541. అనుత్తమా
అన్నింటి కన్నా ఉత్తమమైనది అనుత్తమా. లలితాదేవి కన్నా ఉత్తమమైన స్వరూపము
మరియొకటి లేదు కనుక, అమ్మవారిని ఈ నామములో అనుత్తమా అంటున్నాం.
అమ్మను సమానాధికా వర్జితా అని చెప్పుకున్నాం. ఆ మహాశక్తితో సమానులు ఎవరూ లేరు,
అధికులూ ఎవరూ లేరు, కనుక ఆ తల్లి అనుత్తమా. అందరికన్నా శ్రేష్టమైనది అని భావం.
దేవీభాగవతంలోని తృతీయ స్కంధంలో, రుద్రాంశ లేకున్నా, విష్ణ్వంశ లేకున్నా నరాధములు
అనబడరు, కానీ శక్తి అంశ లేనివాడు నరాధముడు అని స్పష్టంగా చెప్పబడింది.
కనుక అన్నింటికన్నా ఉత్కృష్టమైనది, శక్తి అంశను కలిగివుండటం అనేది తెలుస్తోంది.
అనుత్తమా అంటే, స్వతంత్ర బుద్ధి కలది అని ఒక అర్ధం.
అనుత్తమా అంటే, సహజ సిద్ధమైన ఐశ్వర్యమును కలిగివున్నది అని మరియొక అర్ధం.
అందరిలోనూ, అన్నింటిలోనూ శ్రేష్ఠురాలయిన, ఆ అనుత్తమ కి వందనం.
ఓం శ్రీ అనుత్తమాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Nice explanation.
రిప్లయితొలగించండి