11, నవంబర్ 2021, గురువారం

111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా

  

పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా 
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥

542. పుణ్యకీర్తిః

పుణ్యమును ఇచ్చునది శ్రీమాత. పుణ్యమును ఇచ్చే తల్లి అని కీర్తిని పొందినది శ్రీమాత. 

అందుకే ఈ నామంలో ఆ మాహేశ్వరిని పుణ్యకీర్తీ అని చెప్పుకుంటున్నాం. 

పుణ్య కార్యములు, ధర్మకార్యములు చేయటం వలన పుణ్యము వస్తుంది. అటువంటి పుణ్యము 

వలన కీర్తి వస్తుంది. అట్టి కీర్తిని ఇవ్వడం ఆ పరమేశ్వరికే సాధ్యం. కనుకనే ఆ తల్లి పుణ్యకీర్తీ.  

పుణ్యకార్యములు చేయాలనే బుద్ధి పుట్టించేదీ, ఆ పుణ్యకార్యములు చేయించేదీ కూడా ఆ శ్రీదేవే. 

ఆ విధంగా చేసిన పుణ్యకార్యముల ఫలితంగా, పుణ్యాన్ని మన లెక్కలో వేసేదీ అమ్మే. 

ఆ పుణ్యము వలన కీర్తి లభించేలా చూసేదీ ఆ తల్లే. సర్వమూ ఆ శ్రీదేవికి సమర్పణ చేసి, 

భారమంతా శ్రీమాతపై ఉంచి, జరగవలసిన పనిని చేయటం మాత్రమే భక్తుడు చేయవలసినది. 

ప్రతిఫలాపేక్షను ఆశించకుండా, ఏ స్వార్ధము లేకుండా చేసే పుణ్యకార్యాన్ని అమ్మ ఆనందంగా 

స్వీకరిస్తుంది. పుణ్య కార్యాలు చేస్తున్నాను అనే అహంకారము కానీ, వచ్చిన కీర్తిని చూసి 

గర్వము కానీ, ఆ పుణ్యకార్యము యొక్క విలువను తగ్గిస్తాయి. 

ఇతరులకు వస్తున్న కీర్తిని చూసి అసూయ పడేవాడిని అమ్మ ఆమోదించదు. 

కనుక ఫలము, కీర్తి పట్ల అపేక్ష ఉండకూడదు. పరులను చూసి అసూయ పడకూడదు.  

ఈ రెండూ ఉన్నతికి దారి తీయకపోగా పతనానికి దోహదం చేస్తాయి. 

పుణ్యమునూ, కీర్తినీ ఇచ్చేది ఆ శ్రీదేవి మాత్రమే అన్న దృఢ విశ్వాసం ఉండాలి. 

పుణ్యమును ఇచ్చే తల్లి అని కీర్తి కలిగి వున్న, ఆ పుణ్యకీర్తి కి వందనం. 

ఓం శ్రీ పుణ్యకీర్త్యై నమః  


543. పుణ్యలభ్యా

పుణ్యము వలన మాత్రమే దొరికేది కనుక అమ్మను, ఈ నామంలో పుణ్యలభ్యా అంటున్నాం. 

అమ్మను పట్టుకోవాలంటే పుణ్యము చేయండి, అట్టి పుణ్య మార్గములో వున్నవారికి అమ్మ 

లభిస్తుంది అని ఈ నామంలో చెప్తున్నారు. అందరికీ దొరకనిది, దుర్లభమైనది ఆ త్రిపురసుందరి. 

అటువంటి దుర్లభమైన శక్తిని పొందాలంటే, ఒక మార్గం, పుణ్యం చేయటం. ఆ పుణ్య ఫలితాన్ని

ఆశించకుండా ఆ పుణ్యాన్నీ, దాని వలన వచ్చిన కీర్తినీ తిరిగి ఆ అమ్మకే సమర్పించటం. 

ఇటువంటి పుణ్యం ఎంత అధికంగా చేస్తే, అంత త్వరగా అమ్మకి చేరువవుతాము. 

దేవీభాగవతం తృతీయ స్కంధంలో, 'అధిక పుణ్యం చేసిన వారు, ఇంద్రియనిగ్రహం వున్నవారు 

అమ్మను చూడగలరు. ఇతరులు చూడలేరు' అని చెప్పారు. 

పూర్వ పుణ్యము చేత మాత్రమే దక్కే, ఆ పుణ్యలభ్య కు వందనం.  

ఓం శ్రీ పుణ్యలభ్యాయై నమః  


544. పుణ్యశ్రవణ కీర్తనా 

పుణ్యం ఎన్నో రకాలుగా చెయ్యచ్చు. ఆ మార్గాల్లో ఒకటి, అమ్మవారి పుణ్యస్వరూపమైన కథలను, 

శ్రవణం లేదా కీర్తనం చేయటం. పుణ్య కథలను విన్నా, గానం చేసినా ఆ శ్రీమాత సంతోషిస్తుంది. 

కనుక పుణ్య కథలను వినండి, వినిపించండి. అందుకే ఈ పుణ్య చరిత్రలను కథలుగా 

సప్తాహం, నవాహం, దశాహం అంటూ కొన్ని దినాల పాటు చెప్పిస్తూ వుంటారు. 

పురాణ ప్రవచనాల శ్రవణం కూడా పుణ్య కథా శ్రవణమే కదా. 

హరిదాసుల చేత, గాయనీ గాయకుల చేత పుణ్యకథా గానాలు, కీర్తనలు వినిపించడం, వినడం 

కూడా పుణ్య సముపార్జనమే. త్యాగరాజు, సూరదాసు, మీరాబాయి, రామదాసు, అన్నమయ్య, 

కబీరుదాసు, వంటి భక్తులందరూ గానం ద్వారానే ఆ పరమాత్మను పొందారు. 

నిత్యమూ ఆ భగవతిపై అత్యంత శ్రద్ధతో పుణ్యకథా గానం కానీ, శ్రవణం కానీ చేసేవారిపై అమ్మ 

అనుగ్రహం చూపిస్తుంది. నారద భక్తి సూత్రాలలో నవవిధ భక్తులలో శ్రవణము, కీర్తనము కూడా 

ఉన్నాయని చెప్పారు. పుణ్యకథా గానం, పుణ్యకథా శ్రవణం అంటే ఆ శ్రీదేవికి ఎంతో ప్రీతి. 

పుణ్యచరిత్రలను కథలుగా,  కీర్తనలుగా అనుగ్రహించిన, ఆ పుణ్యశ్రవణకీర్తన కు వందనం. 

ఓం శ్రీ పుణ్యశ్రవణకీర్తనాయై నమః  


545. పులోమజార్చితా 

పులోముని కుమార్తె అయిన శచీదేవిచే అర్చింపబడినది అని భావార్ధం. 

ఈ కథ దేవీ భాగవతం లోని షష్ఠ స్కంధంలో చెప్పబడింది. 

పూర్వం వృత్రాసురుడనే బ్రహ్మరాక్షసుడిని చంపి, బ్రహ్మహత్యా దోషం పొందాడు ఇంద్రుడు. 

అప్పుడు పురంధరుడు ఇంద్రపదవికి అర్హత కోల్పోయాడు. రాజు లేకపోతే, దేవలోకమంతా 

అల్లకల్లోలమై పోయింది. దేవాదులూ, త్రిమూర్తులూ ఆలోచించి, నూరు అశ్వమేధయాగములు 

చేసిన నహుషుడనే చక్రవర్తిని, అధిక పుణ్యము కలవాడిగా గుర్తించి, దేవేంద్ర పదవిని ఇచ్చారు. 

పుణ్యము వలన, నహుషునికి కీర్తి కలిగింది. ఆ కీర్తి వలన ఇంద్ర పదవి లభించింది. 

కానీ తాను ఇంద్రుడిని, అనే గర్వం కలిగి, పురంధరుని భార్య, శచీదేవిని తనతో ఉండమని 

కోరాడు. శచీదేవి, పులోముని కుమార్తె,  పురంధరుని భార్య, మహా పతివ్రత. 

దేవతల గురువైన, బృహస్పతిని, నహుషుని వలన వచ్చిన ఆపదను తప్పించమని కోరింది.   

బృహస్పతి శ్రీవిద్యను ఉపదేశించి, ఆ శ్రీదేవిని అర్చిస్తే, ఆ తల్లి కృప వలన ఆపద తీరిపోతుంది, 

అని మార్గం చూపాడు. శచీదేవి ఆ లలితాత్రిపురసుందరిని శ్రద్ధాభక్తులతో అర్చించింది.  

ఆ పూజ ఫలితంగా నహుషుడు శాపము పొంది సర్పముగా మారాడు. 

శచీపతికి బ్రహ్మహత్యా దోషం పోయి తిరిగి ఇంద్ర పదవి దక్కింది. 

పులోమజచే పూజలందుకొని, ఆ పతివ్రత ఆపదను తప్పించిన, ఆ పులోమజార్చిత కు వందనం. 

ఓం శ్రీ పులోమజార్చితాయై నమః 

  

546. బంధమోచనీ

బంధమోచనీ అంటే, బంధముల నుండి తప్పించునది అని భావం. 

భక్తులకు, ఉపాసకులకు బంధనములు కలగకుండా చేయటం, కలిగిన బంధనముల నుండి

విడిపించటం ఆ అమ్మ కృపావిశేషం. బంధనముల నుండి, కారాగారముల నుండి విమోచనము 

కలిగించునది అని ఈ నామానికి అర్ధం. అజ్ఞానము వలన ఏర్పడిన సంసారబంధనముల నుండి 

తప్పించే శక్తి కలది ఈ త్రిపురసుందరీదేవియే. 

హరివంశంలో ఒక గాధ వుంది. శ్రీ కృష్ణుని మనవడు అనిరుద్ధుడు, బాణాసురుని చెరసాలలో 

బద్ధుడయ్యాడు. అపుడు, అనిరుద్ధుడు బంధ విముక్తికై ఆ నారాయణిని ధ్యానించగా, 

నారాయణుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి అనిరుద్ధుని కారాగార విముక్తుణ్ణి చేసాడు.  

శ్రీలలిత, శ్రీ కృష్ణుడు వేరు వేరు కాదు కదా. 

దేవీభాగవతం షష్ఠ స్కంధంలో మరొక కథ వుంది. ఒకసారి ఏకావళి అనే రాజకన్యను కాలకేతుడనే

రాక్షసుడు అపహరించాడు. ఏకావళికి యశోవతి అనే ఒక చెలికత్తె వుంది. 

ఆమె భగవతీ ఉపాసకురాలు. ఏకావళిని కాలకేతు చెర నుంచి తప్పించమని ఆమె భగవతిని 

ప్రార్ధించింది. అప్పుడు ఆ భగవతి కరుణించి ఏకావళిని, ఆ రాక్షస బంధనం నుంచి విడిపించింది. 

ఎవరికైనా ఇటువంటి కష్టం వచ్చినప్పుడు, ఈ నామంతో అమ్మను జపిస్తే, మేలు కలుగుతుంది.
 
తనను నమ్మిన భక్తులను అన్ని రకముల బంధనముల నుంచీ

తప్పించే,  ఆ బంధమోచని కి వందనం. 

ఓం శ్రీ బంధమోచన్యై నమః 


547. బంధురాలకా 

బంధురాలకా అంటే, చక్కని గిరజాల జుట్టు కలది అని అర్ధం. 

ఈ నామానికి బర్బరాలకా అనే పాఠాంతరము కూడా వున్నదని భాస్కరరాయ పండితుడు

చెప్పాడు. ఈ బర్బరాలకా అనే నామమే ఎక్కువ మందికి సమ్మతమనీ, సాంప్రదాయ సిద్ధమనీ 

కూడా భాస్కరరాయలు అభిప్రాయపడ్డాడు. బర్బరాలకా అన్నా, బంధురాలకా అన్నా ఒకే అర్ధం, 

నల్లని గిరజాలు తిరిగిన ముంగురులు కలదానా అని. 

వంకులు తిరిగిన జుత్తునే ఆభరణంగా కలది ఆ లలితాదేవి.   

జుట్టు మొదలు వద్ద చిక్కులు ఏర్పడవు, కానీ గిరజాల వలన చిక్కులు ఏర్పడతాయి. 

జుట్టు మొదట్లో చిక్కులు లేనట్లే, సృష్టి ప్రారంభంలోనూ ఏ చిక్కులూ లేవు. 

ఆ తరువాతే, చేసుకున్న కర్మల వలన చిక్కులు ఏర్పరుచుకుని, 

ఆ చిక్కులలోనే, గిరజాలలో వలె చుట్లు చుట్లు తిరుగుతూ ఉంటాం. 

అమ్మ గిరజాలని ధ్యానిస్తే, ఆ చిక్కుల చుట్లలో నుంచి బయటపడేస్తుంది. 

ఆ చిక్కులు ఎలా విప్పుకోవాలో  కూడా తెలుస్తుంది.

అంటే అమ్మను ధ్యానిస్తే, జుట్టు సంస్కరించబడుతుంది. చిక్కు వీడిపోతుంది

గిరజాల ముంగురులతో శోభిస్తున్న, ఆ బంధురాలక, ఆ బర్బరాలక కు వందనం. 

ఓం శ్రీబంధురాలకాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

2 కామెంట్‌లు:

  1. ఆహా వివరణ చాలా చక్కగా ఉంది అమ్మ నామాలు అన్నిటికి అన్ని ఎంతో రహస్యమైన అర్ధాన్ని కలిగి ఉన్నాయి చాలా చాలా ధన్యవాదములు ఆంటీ🙏🙏

    రిప్లయితొలగించండి