27, నవంబర్ 2021, శనివారం

127. విశ్వగర్భా, స్వర్ణగర్భా, అవరదా, వాగధీశ్వరీ ధ్యానగమ్యా, అపరిచ్ఛేద్యా, జ్ఞానదా, జ్ఞానవిగ్రహా

  

విశ్వగర్భా, స్వర్ణగర్భా, అవరదా, వాగధీశ్వరీ 
ధ్యానగమ్యా, అపరిచ్ఛేద్యా, జ్ఞానదా, జ్ఞానవిగ్రహా ॥ 127 ॥

637. విశ్వగర్భా

విశ్వమునే గర్భములో దాచింది కనుక విశ్వగర్భా అనే నామం వచ్చింది. 

ప్రళయకాలంలో మొత్తం విశ్వాన్ని అమ్మ తన కడుపులో దాచి రక్షిస్తుంది అని చెప్పుకున్నాం. 

పంచీకరణమైన ఈ ప్రపంచాలనన్నీ లయము చేసి తన గర్భములో మోస్తుంది ఆ శ్రీలలిత.

ప్రళయకాలానంతరము తిరిగి ఈ విశ్వాన్ని నూతనంగా ప్రసవిస్తుంది. 

విశ్వమునే గర్భంలో మోస్తున, ఆ విశ్వగర్భ కు వందనం. 

ఓం శ్రీ విశ్వగర్భాయై నమః  

638. స్వర్ణగర్భా

స్వర్ణమయమైన గర్భము కలది అని ఈ నామార్ధం. 

ఆ జగన్మాత తన బంగారు కడుపులో మనలను మోస్తోంది. అమ్మ గర్భము హిరణ్యగర్భము. 

అమ్మ హిరణ్య వర్ణముతో శోభిస్తూ ఉంటుంది. 

సువర్ణము నుండి పుట్టినది అని, హిరణ్యము గర్భము నందు కలది అని వాయుపురాణంలో 

వుంది. సువర్ణములైన చక్కని మాతృకావర్ణములను గర్భమందు కలది అని మరియొక అర్ధం. 

మాతృకావర్ణములకు హిరణ్య శోభను అద్దినది అని భావం. 

ఈ స్వర్ణగర్భ యొక్క గర్భమందు సువర్ణాక్షరములైన మంత్రరాజములు వున్నవి అని ఒక అర్ధం.  

బంగారు తల్లి యైన, ఆ స్వర్ణగర్భ కు వందనం.  

ఓం శ్రీ స్వర్ణగర్భాయై నమః  

639. అవరదా 

వరులు అంటే శ్రేష్ఠులు, ఎన్నుకోబడ్డవారు. అవరులు అంటే శ్రేష్ఠులు కానివారు.

అట్టి శ్రేష్ఠులు కాని, అవరులను దండించునది అని అర్ధం. 

అనార్యులు అయిన దైత్యులను ఖండించునది శ్రీమాత అని ఇంకొక అర్ధం. 

రద అంటే దంతాలు. అవరదా అంటే చక్కని కాంతివంతమైన దంతములు కలది అని అర్ధం. 

దంతాలు అంకురాలలో వస్తాయి. ఆ దంతాలు విద్యాంకురాలని, 'శుద్ధ విద్యాంకురాకార 

ద్విజపంక్తి ద్వయోజ్వలా' అనే నామంలో చెప్పుకున్నాం. 

శుద్ధవిద్యను అందిస్తుంది కనుక, అమ్మ దంతములు కాంతివంతముగా ప్రకాశిస్తున్నాయి.  

ప్రకాశవంతముగా మెరుస్తున్న దంతములు కల, ఆ అవరద కు వందనం. 

ఓం శ్రీ అవరదాయై నమః  


640. వాగధీశ్వరీ

వాక్కునకు అధీశ్వరి కనుక అమ్మను ఈ నామంలో వాగధీశ్వరీ అంటున్నాం. 

త్రిదశేశ్వరీ నామంలో అమ్మను వాగీశ్వరీ అన్నాం. వాగ్బీజ దేవత అని చెప్పుకున్నాం. 

ఈ శ్రీ లలితా దివ్య రహస్య సహస్ర నామ స్తోత్రాన్ని రచించినవారు వాగ్దేవతలు. 

వారు వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరీ, కౌళినీ. 

వీరంతా సరస్వతీ స్వరూపాలు. ఈ ఎనిమిది మంది వాగ్దేవతలు అమ్మవారి 

ఆదేశం మేరకు ఈ దివ్యరహస్యనామస్తోత్రాన్ని రచించి అమ్మ సభలో తొలిసారిగా గానం చేశారు. 

అమ్మ ఈ స్తోత్రానికి సంతోషించి, అర్హులైనవారికి ఈ స్తోత్రాన్ని అందించమని, ఆ వాగ్దేవతలను 

కోరింది. ఆ వాగ్దేవతలకు ఈశ్వరి కనుక అమ్మకు వాగధీశ్వరీ అనే నామం వచ్చింది. 

వాక్కులకు అధీశ్వరి అయిన, ఆ వాగధీశ్వరి కి వందనం. 

ఓం శ్రీ వాగధీశ్వర్యై నమః   

641. ధ్యానగమ్యా

ధ్యానము చేత మాత్రమే అందునది, తెలుసుకోదగినది శ్రీలలితాపరమేశ్వరి. 
అవ్యక్తమగు పరమాత్మను తెలుసుకోవాలంటే ధ్యానమే మార్గము. 
పతంజలి మహర్షి చెప్పిన యోగశాస్త్రములోని అష్టాంగములు, 
యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. 
వీటిలో ఏడవది ధ్యానము. ధ్యానయోగముచే తమ గుణములలో నిగూఢముగా దాగివున్న 
ఆత్మశక్తి అయిన ఆ దేవీతత్వాన్ని కనుగొనగలము. ధ్యానమునకు అందునది శ్రీదేవి.   
ధ్యానము వలన లభ్యమయ్యే, ఆ ధ్యానగమ్య కు వందనం. 
ఓం శ్రీ ధ్యానగమ్యాయై నమః 


642. అపరిచ్ఛేద్యా

పరిచ్ఛేద్యా అంటే నిర్వచింపగలిగినది. అపరిచ్ఛేద్యా అంటే నిర్వచింపలేనిది. 

ఏ పరిమాణముతో గానీ, ఏ కొలమానముతో గానీ ఇదీ అని వర్ణింపలేనిది, 

ఇంత అని కొలవలేనిది కనుక అమ్మను ఈ నామంలో అపరిచ్ఛేద్యా అంటున్నాం.  

ఇంతవరకూ ఎన్నో నామాలలో, అమ్మవారి శక్తిని కానీ, రూపాన్ని కానీ సంపూర్తిగా

ఎవరూ చూడలేరు, ఎవరికి ఎంత వ్యక్తమయితే అంతే తెలుసుకోగలరు అని చెప్పుకున్నాం. 

ఈ నామంలో అమ్మ ఏ భావముకూ అందనిది, ఏ కొలతకూ దొరకనిది, వున్నది అని కానీ, 

లేదు అని కానీ  చెప్పలేనిది, అవ్యక్తమైనది, పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకుంటున్నాం. 

బ్రహ్మము ఎల్లప్పుడూ సత్యము, జ్ఞానము, అనంతము. వీటిని నిర్ధారించి ఇంత అని చెప్పలేము 

కదా. అందువలన అమ్మను ఈ నామంలో పరిచ్ఛేద్యా అంటున్నాం.  

ఏ కొలమానానికీ, ఏ నిర్వచనానికీ అంతు చిక్కని, ఆ అపరిచ్ఛేద్య కు వందనం. 

ఓం శ్రీ అపరిచ్ఛేద్యాయై నమః 

643. జ్ఞానదా

జ్ఞానమును ఇచ్చునది జ్ఞానదా. అమ్మ శుద్ధజ్ఞానస్వరూపం, జ్ఞానభాండాగారం కనుక, 

అమ్మ మాత్రమే జ్ఞానాన్ని ఇవ్వగలదు. ఎవరైనా తమ దగ్గర వున్నదే కదా ఇవ్వగలరు.  

జ్ఞానము రెండు రకాలు. ఒకటి ఇహలోక జ్ఞానమైతే, రెండవది పరలోక జ్ఞానము. 

అమ్మ తన కరుణతో ఇహలోక జ్ఞానాన్ని నశింపచేసి, పరలోక జ్ఞానాన్ని అందిస్తుంది. 

జ్ఞానదా అంటే జ్ఞానమును ఖండించునది అని కూడా అర్ధము. 

ఏ జ్ఞానాన్ని ఖండించాలి, ఏ జ్ఞానాన్ని ఇవ్వాలి అనే విషయం అమ్మకు మాత్రమే తెలుసు. 

ఇహలోక జ్ఞానం జీవుడిని కొంతవరకు మాత్రమే ఉద్ధరిస్తుంది. అది అశాశ్వతము. 

పరలోక జ్ఞానము శాశ్వతము. జ్ఞానికి కైవల్యం అంటే మోక్షం లభిస్తుందని  

కైవల్యపదదాయినీ నామంలో చెప్పుకున్నాం. 

తలవకారోపనిషత్ లో, ఇంద్రాదులకు పార్వతీదేవి మోక్షాన్నిచ్చినది అని వుంది. 

స్కాందపురాణంలో, శక్తి అనుగ్రహము వలననే ప్రాణులకు సంసారనాశకమగు 

శ్రేష్ఠజ్ఞానము కలుగుతుంది అని వుంది. 

సూతసంహితలో, అంబికానుగ్రహం వలన నిత్య, సత్యమైన ఆనందము, 

అనంతమైన జ్ఞానము కలుగుతాయి అని వుంది. 

ఉపాసకులకు మోక్షము, జ్ఞానమును ఇచ్చే, ఆ జ్ఞానద కు వందనం. 

ఓం శ్రీ జ్ఞానదాయై నమః 


644. జ్ఞానవిగ్రహా

జ్ఞానమే శరీరముగా కలది అని ఈ నామార్ధం. జ్ఞానము చేతనే వ్యక్తమవుచున్నది కనుక అమ్మ 

జ్ఞానవిగ్రహా అని పిలువబడుతోంది. అమ్మ ప్రకృతి స్వరూపం. ప్రకృతి అంటే జగత్తే కదా, 

కనుక అమ్మ జగత్స్వరూపిణి, జగత్తంటే జ్ఞానము కనుక, అమ్మ జ్ఞానమూర్తి.  

విష్ణుపురాణంలో, "ఈ జగత్తంతా జ్ఞానమయము, జ్ఞానమే బంధాలను కలిగిస్తుంది, 

జ్ఞానమే పరబ్రహ్మ. విద్యా, అవిద్యా రెండూ కూడా జ్ఞానమే." అని 

పరాశరుడు మైత్రేయుడితో చెప్పినట్టు ఉన్నది. 

అధికమగు జ్ఞానమును కలిగించునది ఆ లలితాపరమేశ్వరి అని మరొక అర్ధం. 

మూర్తివంతమైన జ్ఞానమే విగ్రహముగా కల, ఆ జ్ఞానవిగ్రహ కు వందనం. 

ఓం శ్రీ జ్ఞానవిగ్రహాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

    

2 కామెంట్‌లు: