30, సెప్టెంబర్ 2021, గురువారం

69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ అంబికా, అనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా

పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ 
అంబికా, అనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥

291. పురుషార్థప్రదా

పురుషార్థాలు నాలుగు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగింటిలో కామార్థములను

ధర్మమార్గము ద్వారా పొందాలి. మొదటి మూడూ సిద్ధించిన తరువాతే నాలుగవది యైన మోక్షము 

కలుగుతుంది. జీవుడు కామార్థములను ధర్మపరంగా, తృప్తికరంగా పొందినపుడే మోక్షమునకు 

దారి సుగమం అవుతుంది. ఈ నాలుగు పురుషార్థాలనూ ఇచ్చేవాడిని రుద్రుడు అంటారు. 

రుద్రుడికి ఈ పురుషార్థములనిచ్చే శక్తి త్రిపురసుందరి. 

త్రిపురసుందరి అనుగ్రహము లేనిదే ఈ పురుషార్థములు ప్రసాదింపబడవు. 

కనుక త్రిపురసుందరీ ఆరాధన పురుషుడికి(జీవుడికి) తప్పనిసరి. 

ఏదో ఒక రూపములో, ఈ ఆరాధన చేయనివారికి ఈ పురుషార్థములేవీ ప్రాప్తించవు. 

భగవంతుడు భగవద్గీతలో కూడా ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని, 

ఈ నలుగురికి కూడా ఎవరు కోరినది వారికి ఇస్తానని చెప్పాడు. 

ఈ నాలుగు విధముల పురుషార్థములను భక్తులకు ఇచ్చు దేవి కనుక 

ఈ శక్తిని పురుషార్థప్రదా అంటున్నాం. ఆ పురుషార్థప్రద కు  వందనం. 

ఓం శ్రీ పురుషార్థప్రదాయై నమః  


292. పూర్ణా

పూర్ణా అంటే పరిపూర్ణమైన స్వరూపము అని భావం. ఎంతో విస్తృతమైనది అని అర్ధం. 

పూర్ణా అంటే శుక్ల చతుర్దశీ రాత్రి. ఆనాటి రాత్రి చంద్రుని కళ పరిపూర్ణం. 

పూర్ణా అంటే పంచదశీ తిథీ స్వరూపురాలు. అందుకే ఆ దినాన్ని పూర్ణిమ, పౌర్ణమి అంటాం. 

పూర్ణా అంటే కాలడిలో పారే పూర్ణా నది. ఈ నదే శంకరాచార్యుని ప్రార్థన మేరకు 

ఆతని తల్లి ఆర్యాంబ సౌకర్యార్ధం తన నదీ మార్గాన్ని మార్చింది. 

పూర్ణా అంటే పరిపూర్ణురాలు. ఈశ ఉపనిషత్ లో చెపుతారు. భగవంతుడు పరిపూర్ణం. 

సృష్టి పరిపూర్ణం. ఆ పూర్ణుడైన శక్తి నుంచి పూర్ణమైన జగత్తు ప్రభవించింది అని. 

అయినా భగవంతుడి పరిపూర్ణత్వమూ తగ్గలేదు, సృష్టి పరిపూర్ణత్వానికీ లోపము లేదు. 

పూర్ణము నుంచి పూర్ణమే ఉద్భవించినా, ఆ శక్తీ, ఈ సృష్టీ రెండూ వేటికవే పరిపూర్ణమే. 

వెలుగుతున్న దీపం ఎన్నో దీపాలను వెలిగిస్తుంది. 

అయినా అన్ని దీపాలూ కాంతినిస్తూ వెలుగుతూనే ఉంటాయి. 

అదేవిధంగా పూర్ణము అయిన అమ్మ శక్తి నుంచి, పూర్ణము అయిన జగత్తు వచ్చింది. 

పూర్ణులైన పురుషులు వచ్చారు.

ప్రళయకాలంలో అన్నీ అమ్మలో లయించిన తరువాత, తిరిగి పూర్ణులను అమ్మ సృష్టిస్తుంది. 

కనపడేదే పూర్ణము, కనపడనిది శూన్యము కాదు. 

కనపడని శక్తిని కూడా దర్శించినప్పుడే ఆ దర్శనం పూర్ణం. 

పూర్ణ అనే నామానికి ఇన్ని రకాల అర్ధాలున్నాయి. 

ఆ పరిపూర్ణస్వరూప యైన, పూర్ణ కు వందనం. 

ఓం శ్రీ పూర్ణాయై నమః  


293. భోగినీ

భోగినీ అంటే భోగమును, సుఖమును పొందినది, ఇచ్చునది అని అర్ధం. 

సుఖభోగాలని జంట పదాలుగా వాడుతూ ఉంటాం. అమ్మ అనుగ్రహం వున్నవారికి మాత్రమే 

ఇవి దక్కుతాయి. చాలామందికి ఈ విషయం తెలియక, నాకు ఈ సుఖభోగాలు ఎందుకు దొరకటం 

లేదు అని దుఃఖపడుతూ వుంటారు. సమాధానం ఒకటే, ఇంకా సాధన పూర్ణం కాలేదు. 

భోగము యోగముగా పరివర్తనం చెందితే అది అమ్మ అనుగ్రహము. 

అదే భోగము రోగముగా మారితే, అప్పుడు అమ్మ అనుగ్రహము చాలదు అని భావం. 

శ్రద్ధా, దీక్షలతో, ఆర్తితో, ఆ దేవిని తృప్తి పరచిన ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని, 

ఈ నలుగురూ కూడా, ఆ అమ్మ అనుగ్రహం పొందగలుగుతున్నారు. 

తన అనుగ్రహముచే జీవుడికి సుఖభోగాలను అందిస్తున్న, ఆ భోగిని కి వందనం. 

ఓం శ్రీ భోగిన్యై నమః  


294. భువనేశ్వరీ 

పదునాలుగు భువనాలకూ అధినాయకురాలు కనుక ఈ నామం వచ్చింది. 

ఈ భువనముల సృష్టీ, స్థితీ, లయమూ అన్నీ ఈ భువనేశ్వరీ దేవి ఆధీనము లోనే ఉంటాయి. 

ఈ దేవత భువనేశ్వరీ మంత్ర స్వరూపురాలు. దశమహావిద్యలలో ఒకటి ఈ భువనేశ్వరీ తత్వం. 

భువనానందనాథుడు ఆరాధించిన దేవి కనుక భువనేశ్వరీ అంటున్నాం. 

బ్రహ్మాది దేవతలను దివ్యౌఘము, దేవర్షులను సిద్దౌఘము, భూలోక ఋషులను మానవౌఘము 

అంటాం. భువనానందనాథుడు మానవౌఘములో ఒక గురువు. 

ఈ ఓఘత్రయం ఎప్పుడూ ఆ శ్రీమాత సభలో వుంటూ ఆ శ్రీదేవిని సేవిస్తూ ఉంటుంది.  

భువనములన్నియూ తనలోనే గల, ఆ భువనేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ భువనేశ్వర్యై నమః 

  

295. అంబికా

అంబికా అంటే అమ్మ. అందరికీ అమ్మ. అంబ అన్నా, అంబికా అన్నా, అమ్మా అన్నా ఒకే భావం. 

సకల జగాలకూ, జీవులకూ జగన్మాత. ఇచ్చా, జ్ఞాన, క్రియా శక్తి స్వరూపిణి. 

మార్కండేయ పురాణంలో అంబికను గురించి చెప్తూ, విశ్వేశ్వరీ, జగద్ధాత్రీ, స్థితిసంహారకారిణీ, 

నిద్రా, భగవతీ అన్నారు. అంబిక నిద్రా స్వరూపిణి, సామాన్య జీవులలో అంతర్లీనంగా 

యోగమాయగా ఉంటూ, జీవుడు నారాయణునితో కలసినప్పుడు యోగనిద్రగా మారుతుంది. 

ప్రాణులందరి ఆయుర్దాయములో అర్ధభాగము ఈ నిద్రాదేవి స్వరూపమే. 

ఒక్క నారాయణుడికి తప్ప ఈ నిద్రాదేవి ఆవహించినప్పుడు అందరికీ జ్ఞానం లయిస్తుంది. 

అంబిక రాత్రి స్వరూపిణి. రాత్రివేళలో మహాదేవిగా ఉంటూ, పగటిపూట మహేశ్వరుడిగా 

ఉంటుంది. భారతీ, పృథ్వీ, రుద్రాణీ కూడా ఈ జగదంబికయే. 

ప్రతిజీవి లోనూ వున్న మాతృభావన ఈ అంబికా స్వరూపమే. 

సకల సృష్టికీ జగన్మాత అయిన, ఆ అంబిక కు వందనం. 

ఓం శ్రీ అంబికాయై నమః 


296. అనాది నిధనా

ఆ త్రిపురసుందరికి ఆది మరియు అంతము నిధనమైనవి, అంటే నశించినవి అని అర్ధం. 

ఆది, అంతము రెండూ లేని మహా శక్తి ఈ అనాదినిధనా. ఆ తల్లికి జననమరణములు లేవు. 

మొత్తము మరణ సాధనములు ఎనభై.  తాను మాత్రమూ ఈ మరణసాధనములకు వేటికీ 

కట్టుబడదు. తన భక్తులకు ఈ అడ్డంకులు తొలగించే తల్లి అని కూడా భావము. 

జీవుడు సంపూర్ణ ప్రజ్ఞతో ఉండటమే జీవము. ఏ ఒక్క శక్తి సరిగ్గా పని చేయకపోయినా, 

అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనసు వంటి

అన్నీ కూడా మరణసాధనములే. అన్నీ పని చేస్తేనే ఏ మరణమూ లేనట్టు. 

ఏ విభాగము పనిచేయకపోతే, ఆ విభాగము మరణించినట్టు లెక్క. 

ఆ శ్రీమాతకు ఈ మరణసాధనములన్నీ అధీనములు. 

ఆ తల్లికి ఈ ఆది, అంతములు నశించాయి, కనుకే ఆ తల్లిని అనాదినిధనా అంటున్నాం. 

ఎప్పటికీ జననమరణాలు లేని, ఆ అనాది నిధన కు వందనం. 

ఓం శ్రీ అనాదినిధనాయై నమః 


297. హరిబ్రహ్మేంద్ర సేవితా

దేవతల చేత సేవింపబడేది శ్రీలలిత. హరి, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ 

ఆ శ్రీపురం లోనే ఉంటూ ఆ రాజరాజేశ్వరిని ధ్యానిస్తున్నారు, ఉపాసిస్తున్నారు. 

త్రిమూర్తులు, దిక్పాలకులు, ఆదిత్యులు, మొదలైన దేవతాగణాలన్నీ, ఆ శ్రీమాత ఇచ్ఛ వలన 

ప్రకటింపబడినవారే. సామాన్యులైన జీవులు ఏ దేవతలను ఆశ్రయిస్తూ కొలుస్తున్నారో, 

ఆ దేవతలు స్వయంగా ఆ అఖండ దివ్య తేజోమూర్తి అయిన, లలితాదేవిని ధ్యానిస్తున్నారు. 

కనుక ఆ శ్రీమాతను ఆరాధిస్తే దేవతాగణాలను అన్నింటినీ ఆరాధించినట్లే. 

అందరికీ ఆరాధనామూర్తులైన ఆ హరి, బ్రహ్మ, ఇంద్రాదులచే సేవింపబడుతున్న, 

ఆ హరిబ్రహ్మేంద్ర సేవిత కు వందనం. 

ఓం శ్రీ హరిబ్రహ్మేంద్రసేవితాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

29, సెప్టెంబర్ 2021, బుధవారం

68. శ్రుతి సీమంత సిందూరీకృత పాదాబ్జధూళికా సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా

శ్రుతి సీమంత సిందూరీకృత పాదాబ్జధూళికా 
సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా ॥ 68 ॥

289. శ్రుతి సీమంత సిందూరీ కృత పాదాబ్జ ధూళికా 

శ్రుతులంటే వేదాలు. ఈ వేదాలు, వేదాంతములైన ఉపనిషత్తులు అమ్మ ముందు తలవంచాయి. 

సీమంతము అంటే పాపట. ఈ శ్రుతులన్నీ, స్త్రీ రూపములుగా పాపట్లో సిందూరాన్ని అద్దుకుని,  

అమ్మ కన్నా గొప్ప శక్తి లేదని తలచి, తల వంచి ఆ జననికి  పాదనమస్కారం చేస్తున్నాయి. 

అప్పుడు ఈ పాపట దిద్దుకున్న సిందూరం, అమ్మ పాదాలకు లత్తుకలా అంటుకుంది. 

శ్రుతుల సీమంత సిందూరం, ఆ శ్రీలలిత పాదపద్మాలకు లత్తుక వలె అంటుకుని అమ్మ 

పాదధూళి అయ్యింది. అందువల్ల వేదములు, ఉపనిషత్తులు వంటి మహద్గ్రంధాలు కూడా 

అమ్మవారి కాలిధూళితో సమానము అయినాయి. అమ్మ శక్తి  వేదములు, ఉపనిషత్తులు కూడా 

వర్ణించలేనంత గొప్పది. శ్రుతులచే పాదనమస్కారం చేయించుకుంటున్న, 

ఆ మహామహిమాన్విత, ఆ శ్రుతి సీమంత సిందూరీకృత పాదాబ్జధూళిక కు వందనం. 

ఓం శ్రీ శ్రుతి సీమంత సిందూరీ కృత పాదాబ్జ ధూళికాయై నమః  


290. సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా 

శుక్తి సంపుటము అంటే, ముత్యపు చిప్ప. వాటి సందోహము అంటే, అటువంటి ముత్యపుచిప్పల

గుంపు. ముత్యపు చిప్పలో అద్భుతమైన, అపూర్వమైన, అమూల్యమైన ముత్యాలు ఉంటాయి. 

ఈ నామంలో, సకల ఆగమాల సముదాయమునూ ముత్యపు చిప్పలతో పోలుస్తున్నారు.

ఆ సంపుటిలో నున్న అమూల్యమైన ముత్యములే, అమ్మవారు ముక్కున పెట్టుకునే ముక్కెరకు 

వేళ్ళాడే ముత్యాలు. అన్ని వేదముల, ఆగమముల సారము అమ్మ ముక్కుపోగుకు సరి అని 

ఈ నామం చెపుతోంది. అరుంధతి చాలా సూక్ష్మ నక్షత్రం. దానిని చూడటం కష్టం. 

అందుకని దానికన్నా ఎంతో పెద్దదైన సప్తఋషి మండలాన్నీ, దానిలో వున్న వశిష్ట నక్షత్రాన్నీ 

చూపిస్తూ, అదిగో, ఆ పక్కనే కనిపించే బుల్లి నక్షత్రమే అరుంధతి అని చెప్తూ వుంటారు. 

అదే విధంగా ఎంతో గొప్పదైన అమ్మ మహత్తును చూపటానికి ముత్యపు చిప్పల్లోని మంచి 

ముత్యమును చూపుతూ, అంత మేలిమి ముత్యము కూడా అమ్మ ముక్కెరకు వేళ్ళాడుతున్న 

ముత్యము అని చెపుతున్నారు.

ఇంక అమ్మ నిజరూప మహాత్మ్యాలను ఏమని వర్ణించగలము. 

వేదాల్లోని సారమే అమ్మ ముక్కెరకు వేలాడే ముత్యమంతగా ప్రకాశిస్తున్న,  

ఆ సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక కు వందనం. 

ఓం శ్రీ సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికాయై నమః  


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

28, సెప్టెంబర్ 2021, మంగళవారం

67. ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా

ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ 
నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥

285. ఆబ్రహ్మ కీటజననీ

ఈ నామంలో బ్రహ్మ నుంచి చీమ దాకా అందరికీ తానే జనని అని చెప్తోంది. 

త్రిమూర్తులనూ, త్రిమాతలనూ, ఈ సమస్త భువన భాండాలనూ సృజించింది ఆ జగన్మాతే. 

ఆవిధంగా బ్రహ్మకు తాను తల్లి. చీమనూ, దోమనూ, చెట్టునూ, పుట్టనూ సృష్టించింది కూడా 
 
ఈ జగదంబే. అమ్మలకన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, ముగురయ్యల మూలపుటమ్మ 

కూడా ఈ జగన్మాతే. ఈ  మాత చాల పెద్దమ్మ. సురారులమ్మ.  

వివరంగా చెప్పుకోవాలంటే, జీవులన్నిటిలో పెద్దవాడు హిరణ్యగర్భుడైన బ్రహ్మ. 

అందరికంటే చిన్నవాడు స్తంబుడు. సాలెపురుగు నేసిన దారాలని తిని బతికే, కంటికి కనిపించని 

అతి సూక్ష్మజీవి. అమ్మ ఈ స్తంబుడినీ, ఆ హిరణ్యగర్భుడినీ కూడా పుట్టించింది. 

అందుకే ఆ అమ్మను ఈ నామంలో ఆబ్రహ్మకీటజననీ అంటున్నాం. 

పిపీలికాది జీవులనుంచీ, హిరణ్యగర్భుడైన బ్రహ్మ వరకూ అందరికీ ప్రాణం పోసి, 

జన్మ ఇచ్చిన, ఆ ఆబ్రహ్మ కీటజనని కి వందనం. 

ఓం శ్రీ ఆబ్రహ్మకీటజనన్యై నమః  


286. వర్ణాశ్రమ విధాయినీ

నాలుగు వర్ణములు, నాలుగు ఆశ్రమములు అని వేదం ఆధారముగా విభజన చేసిన తల్లి

అని ఈ నామానికి అర్ధం. తాను నిర్ణయించిన విధి విధానములను వివరించుటకై

వేదములను రచించింది. వేదాలు అపౌరుషేయాలు అంటే అర్ధం ఇదే. 

ఆ వేదంలో కర్మల గురించి తెలిపే భాగాన్ని కర్మకాండ లోనూ, బ్రహ్మమును గురించి తెలిపేది

బ్రహ్మకాండ లోనూ వున్నది. వేదంలో చెప్పిన కర్మలు చేసే అధికారం దేవతలకు కానీ

పశువులకు కానీ లేదు. ఒక్క మనుష్యుడికే ఆ కర్మలు విధింపబడ్డాయి. 

ఆ కర్మలు చేసే, చేయగలిగే, స్వభావమును బట్టీ మనుష్యులను నాలుగు వర్ణములుగా 

విభజించింది ఆ జగజ్జనని, వేదమాత. 

ఆ విధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములుగా విభజించింది. 

మనిషి జీవితదశలను బట్టీ ఆశ్రమములను కూడా నాలుగుగా ఏర్పరచింది.

అవే బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్న్యాసము అనే నాలుగు ఆశ్రమాలు.

బాల్య, కౌమార, యవ్వన దశల్లో బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్ధావస్థలో 
గృహస్థ ఆశ్రమం,

వృద్ధాప్యంలో వానప్రస్థ ఆశ్రమం, తుదకు నాలుగవదైన సన్న్యాస ఆశ్రమం 
ఉంటాయి.

ఇది మనుషులందరూ పాటింపవలసిన వేదవిధి. 

ఆ లలితాపరమేశ్వరి ఈ విధంగా వర్ణములనూ, ఆశ్రమములనూ నిర్మించింది.

శంకరాచార్యుడంటాడు, "బాల్యావస్థే క్రీడాసక్తః, తరుణావస్థే తరుణీసక్తః,  వృద్ధావస్థే 
చింతాసక్తః,

పరమే బ్రహ్మణి కోపి న సక్తః." ఇక బ్రహ్మమును గురించి ఎప్పుడు ఆసక్తి 
చూపిస్తావూ అని.  

మనుష్యులకు వేదధర్మమైన కర్మకాండనూ, బ్రహ్మకాండనూ ఆచరించడానికి గాను

వర్ణములనూ, ఆశ్రమములనూ విధించిన, ఆ వర్ణాశ్రమ విధాయిని కి వందనం.

ఓం శ్రీ వర్ణాశ్రమవిధాయిన్యై నమః  


287. నిజాజ్ఞారూపనిగమా

అమ్మవారు స్వయముగా ఇచ్చిన ఆజ్ఞలే వేదములైనవి అన్న విశేషానికి తార్కాణంగా, 

తన ఆజ్ఞలే వేదరూపాలుగా వున్నది మాహేశ్వరి అని ఈ నామం చెప్తోంది. 

అమ్మ నిజాజ్ఞలే వేదములుగా మారాయి. వేదములలో వున్న అన్ని అంశములు అమ్మ ఆజ్ఞలే. 

కనుక వేదము అంటే, అమ్మ చెప్పిన ఆజ్ఞలు, విధానములు, విహితములు, నిబంధనలు. 

ఆ ఆజ్ఞలే శైవ తంత్రము, కామికాతంత్రము మొదలైనవి. అదే విధముగా వేదములు తంత్రములు 

అన్నీ ఆ పరమేశ్వరి ముఖము నుంచి వచ్చినవే అని శ్రీ దేవీభాగవతం చెప్తోంది. 

తన ఆజ్ఞలే వేదరూపములయిన, ఆ నిజాజ్ఞారూపనిగమ కు వందనం. 

ఓం శ్రీ నిజాజ్ఞారూపనిగమాయై నమః  


288. పుణ్యాపుణ్య ఫలప్రదా

ఆ జగత్సాక్షి అయిన అమ్మ, తన సహహస్రాక్షులతో అందరినీ గమనిస్తూ ఉంటుంది. 

పుణ్య కర్మ చేసిన వానికి ఆ పుణ్య ఫలం, పాపకర్మ చేసిన వానికి ఆ పాప ఫలం ఇస్తూ ఉంటుంది. 

అమ్మ కంటి నుంచి ఏ కర్మా తప్పించుకోలేదు. అమ్మ చేయి నుంచి ఏ ఫలితమూ తప్పుకోలేదు. 

"నా భుక్తం క్షీయతే కర్మ, కల్పకోటి శతైరపి, అవశ్యమనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం" 

అన్నారు. అంటే, చేసిన కర్మ మంచిదైనా, చెడ్డదైనా ఆ ఫలితాన్ని అనుభవిస్తేనే తీరుతుంది.  

లేకపోతే, వందకోట్ల కల్పాలు గడచినా ఆ కర్మ క్షీణించదు, అని అర్ధం. 

మనిషి చేసిన కర్మను బట్టీ, అది మంచిదైతే పుణ్యఫలం, చెడ్డదైతే పాపఫలము 

కచ్చితంగా లెక్క కట్టి మరీ ఇస్తుంది ఆ రాజరాజేశ్వరి. 

గుళ్ళు కట్టేవాళ్లకు పుణ్యఫలం వస్తే, గుళ్ళు కూల్చేవాడికి పాపఫలం వస్తుంది. 

సాయం చేసేవాడికి పుణ్యఫలం వస్తే, గాయం చేసేవాడికి పాపఫలం వస్తుంది. దేని లెక్క దానిదే. 

ఏ ఒక్క కర్మా పొల్లు పోదు. ప్రతి కర్మ ఫలితమూ తీసుకోవలసినదే. 

జీవుడు చేసిన పాప పుణ్యాలకి తగిన ఫలితమును ఇచ్చే, ఆ పుణ్యాపుణ్య ఫలప్రద కు వందనం. 

ఓం శ్రీ పుణ్యాపుణ్యఫలప్రదాయై నమః 

  

------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

27, సెప్టెంబర్ 2021, సోమవారం

66. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్

ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥

281. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః 

ఉన్మేషము అంటే కనురెప్పలు తెరవడం, నిమిషము అంటే కనురెప్పలు మూయడం. 

అమ్మవారు కనురెప్ప తెరిస్తే ఉత్పన్నము, అంటే సృష్టి జరిగితే,  

కనురెప్ప మూస్తే, విపన్నము, అంటే లయము జరుగుతుంది. 

సృష్టి, లయములు అమ్మకు రెప్పపాటు పని. దేవతలు అనిమిషులు, 

కానీ, ప్రాణికోటి కర్మలను బట్టీ అమ్మ రెప్పలు మూస్తూ, తెరుస్తూ ఉంటుంది. 

ఆ మధ్యకాలములో స్థితి కార్యమును చూస్తూ ఉంటుంది అమ్మ. ఆ రెప్పలు మూతబడిన  

క్షణములో భువనాలన్నీ వరుసగా విపత్తులకు లోనై లయము అయిపోతాయి. 

ఆ రెప్పలు మళ్ళీ తెరచుకోంగానే క్షణములో తిరిగి ఆ భువనాలన్నీ పునఃసృష్టి పొందుతాయి.

అంతా ఆ అమ్మ ఇచ్ఛాశక్తి వలననే, ఈ సృష్టి, లయము జరిగిపోతూ ఉంటాయి. 

ఈ భువన భాండమంతా అమ్మ కనులు తెరిస్తే శివము, కనులు మూస్తే శవము. 

కనురెప్పపాటులో భువనాలని ఉత్పన్నము చేస్తూ, విపన్నములు కలిగిస్తున్న, 

ఆ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి కి వందనం. 

ఓం శ్రీ ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళ్యై నమః  


ఒక చిన్నపురాణ కథ: 

ఒకసారి అమ్మవారు సరదాకి వెనుక నుంచి వచ్చి శివుని కన్నులు క్షణకాలం మూసిందట. 

శివుడు చటుక్కున లేచి, 'ఎంత పని చేసావు పార్వతీ, నేను కన్నులు మూసుకుంటే, 

ఈ జగత్తే నాశనమైపోతుంది. నీ వల్ల క్షణకాలం పాటు ఈ జగత్తంతా బాధకు లోనైంది. 

నీకు శిక్ష తప్పదు. నన్ను వదిలి వెళ్ళిపో', అన్నాడు. అప్పుడు పార్వతి ఎంతో దుఃఖించి 

శాపం తీరే మార్గం చెప్పమంటుంది. వెళ్లి తపసు చేయి, తిరిగి పుట్టు. నాకోసం చూడు. 

అప్పుడు మళ్ళీ పెళ్లాడదాం అని చెప్తాడు శివుడు. అప్పుడు నేను నిన్ను ఎలా గుర్తు పట్టగలను, 

అని పార్వతి దీనంగా అడుగుతుంది. శివుడు, 'అప్పుడు నీకు మూడు స్తనములు ఉంటాయి. 

నన్ను చూసినప్పుడు నీ మూడవ స్తనము మాయమవుతుంది, అదే గుర్తు' అంటాడు. 

అప్పుడు పార్వతి మీనాక్షిగా మూడు స్తనాలతో పుడుతుంది. శివుని గురించి తపస్సు చేస్తుంది. 

సుందరేశ్వరుడు కనిపించాక మీనాక్షి మూడవ స్తనం అదృశ్యమవుతుంది. వారిరువురికీ విష్ణువు 

ఒక అన్నగా పెళ్లి జరిపిస్తాడు. ఒక్కక్షణం ఆట కోసం శివుని కన్నులు మూసినందుకు పార్వతికి 

అంత శిక్ష పడింది. ఆ ఆదిదంపతులు కనులు మూస్తే, అంతా విపత్తే. విలయమే. 

  

282. సహస్రశీర్షవదనా

వేదంలోని పురుషసూక్తములో "సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్" అని వుంది. 

సహస్రమంటే అనంతములని ఇక్కడ భావము. సహస్ర శీర్ష వదనా అంటే, అనంతములైన 

శిరస్సులు, అనంతమైన ముఖములు కలదానా అని భావం. ఈ నామానికి స్త్రీ పురుష భేదం లేదు. 

ఇది అనంతములైన శిరసులు, ముఖములు కల ఆ మహత్వత్వమైన శక్తిని కీర్తిస్తోంది. 

సృష్టి అన్ని వైపులనూ అనంతమైన శిరసులు, ముఖములతో అవలోకనం చేస్తున్న, 

ఆ సహస్రశీర్షవదన కు వందనం. 

ఓం శ్రీ సహస్రశీర్షవదనాయై నమః  


283. సహస్రాక్షీ

సహస్రాక్షీ అంటే అనంతమైన కన్నులు కలదానా అని భావం. 

ఆ తల్లికి వెయ్యి కళ్ళు, కోటికళ్లు, అనంత సంఖ్యలో కళ్ళు ఉన్నవని భావం. 

ఈ పదునాలుగు లోకాలను, భువనాలనూ చల్లగా చూడాలంటే అన్ని కళ్ళు కావద్దూ. 

మరి అందరి పాపపుణ్యాలనూ గమనించి, లెక్కించి, 

వారి వారికి తగిన కర్మఫలములను ఇవ్వాలి కదా.  

అందరి పుణ్యకర్మలనీ, పాపకర్మలనీ గమనిస్తున్న, ఆ సహస్రాక్షి కి వందనం. 

ఓం శ్రీ సహస్రాక్ష్యై నమః  


284. సహస్రపాత్ 

సహస్రపాత్, అంటే అనంతములైన పాదములు కలదానా అని భావం. 

అమ్మవారికి శిరసులు, ముఖములు, కన్నులే కాక పాదములు కూడా అనంతములుగా వున్నాయి. 

ఈ రెండు నామముల నుంచీ అమ్మవారి కామరాజకూటము, శక్తి కూటముల బీజాక్షరములైన 

హ స క హ ల హ్రీమ్, స క ల హ్రీమ్ వస్తాయి. 

అమ్మ తన అనంతమైన పాదములతో విశ్వవ్యాప్తమయి వున్నది. ఆ సహస్రపాత్తు కు వందనం. 

ఓం శ్రీ సహస్రపదే నమః 


ఒక్క మాట: 

ఎక్కడైతే ఎక్కువమంది జనం గుమిగూడతారో అక్కడ అనంతములైన శిరసులు,

కళ్ళు, పాదాలు ఉంటాయి. ఆ మహా జన సందోహములో ఆ విరాణ్మూర్తి లలితాపరమేశ్వరి 

శక్తి రూపంలో ఉంటుంది. సాధన ద్వారా, ఆ శక్తిరూపాన్ని దర్శించే ప్రయత్నం చేయాలి.

ఓం శ్రీ సహస్రశీర్షవదనా సహస్రాక్షీ  సహస్రపదే నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

26, సెప్టెంబర్ 2021, ఆదివారం

65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ

భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ 
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥

275. భానుమండల మధ్యస్థా

సంధ్యాసమయములో శ్రీదేవిని గాయత్రీ రూపములో ధ్యానిస్తున్నాము.
 
గాయత్రిని భానుమండలములో ధ్యానము చేస్తున్నాము. 

సూర్యమండలం మధ్యమున గాయత్రి ఉన్నది. 

సూర్యమండలములో మధ్యభాగాన పరమశివుడు వున్నాడని కూర్మ పురాణమూ, శృతులూ కూడా 

చెప్తున్నాయి. పరమశివునితో పాటే పార్వతి. భానుమండలమంటే అనాహతచక్రము. 

అనాహతచక్ర మధ్యంలో, అంటే హృదయమధ్యంలో వున్నది శ్రీదేవి. 

భర్గోదేవతలకు శ్రీదేవి ఆధారము. ఆ భర్గోదేవతల వలననే ఆదిత్య మండలాలు వచ్చాయి. 

అటువంటి పన్నెండు ఆదిత్య మండలాల నుంచి ఒక సవితృ మండలం ఏర్పడింది.  

ఈ పన్నెండు ఆదిత్యమండలాలకు సవిత కేంద్రం, ఈ ద్వాదశ ఆదిత్యమండలాలకూ ఆధారం. 

ఈ సవితృ మండలాల నుంచి సూర్యమండలం వచ్చింది. 

ఇవి అన్నీ గుంపులు గుంపులుగా పుడుతూ ఉంటాయి. 

వాటి మధ్యలోని వెలుగే శ్రీదేవి. ఈ మండలాలన్నింటి మధ్యలో వున్న కాంతి పుంజమే శ్రీదేవి. 

ఆ శ్రీదేవి వెలుగులోనే భర్గోమండలాలు, ఆదిత్య మండలాలు, సవితృ మండలాలు, 

సూర్యమండలాలు అన్నీ ప్రకాశిస్తున్నాయి. 

ఆవిధంగా భానుమండలము మధ్యలో ప్రకాశిస్తూ తన కాంతితో భర్గో, ఆదిత్య, సవితృ, భాను 

మండలాలనూ ప్రకాశింపచేస్తున్న,  ఆ భానుమండల మధ్యస్థ కు  వందనం. 

ఓం శ్రీ భానుమండలమధ్యస్థాయై నమః  


276. భైరవీ

భైరవుడంటే పరమశివుడు. భైరవ పత్ని కనుక ఈ మాత భైరవి. 

భైరవీ మంత్ర స్వరూపురాలు. పన్నెండేళ్ల కన్యకను భైరవీ అంటారు. 

ఈ శక్తి సాత్వికముగా వున్నప్పుడు త్రిపుర సుందరిగాను, 

రజస్తమో గుణాలు పొందినప్పుడు త్రిపుర భైరవి గాను ఉంటుంది. 

ప్రపంచములోని స్త్రీలందరిలో ఈ భైరవీ శక్తి యొక్క విభూతి తేజోరూపములో ఉంటుంది. 

కనుక ప్రపంచములోని స్త్రీలందరూ భైరవీ స్వరూపులే. 

భీరు శబ్దము నుంచి భైరవ శబ్దం వచ్చింది. భీరుత్వము పోగొట్టేది భైరవి. 

ప్రతి స్త్రీ లోనూ విభూతి వలే ఉంటూ, భీరుత్వము పోగొట్టే,  భైరవి కి వందనం. 

ఓం శ్రీ భైరవ్యై నమః  


277. భగమాలినీ 

ఈ భగమాలినీ దేవత తిథి నిత్యా దేవతలలో ఒక దేవత. 

ఈ దేవత మంత్రంలో భగ శబ్దము చాలాసార్లు వస్తుంది. 

ఆ భగ అనే బీజాక్షరాలతో కూర్చిన మంత్రమాలను ధరించి వున్నది, 

కనుక, ఈ దేవతకు భగమాలినీ అనే నామం వచ్చింది. ఆరు రకముల ఐశ్వర్యములను కల దేవి. 

భ అంటే కాంతి, ప్రకాశము. గ అంటే గతిశక్తి, వ్యాపన శక్తి. భగ అంటే వెలుగును ప్రసారం చేసే శక్తి. 

బిందు రూపంలో వున్న అమ్మ, వెలుగుల్ని ప్రసరించడానికి త్రికోణ ఆకారము లోకి మారుతుంది. 

అదే స్త్రీచిహ్నము, యోనిరూపము. 

పురుష చిహ్న త్రికోణములు శివవిభూతులు, స్త్రీచిహ్న త్రికోణములు దేవీ విభూతులు. 

ఈ రెండూ కలిస్తే శివ శక్తి సమ్మేళనం. శ్రీచక్రములోని త్రికోణములవే. 

అమ్మని త్రికోణ రూపంలో అర్చిస్తే, శుభప్రదం. 

చేసే ప్రతి కార్యములోను, త్రిభుజములను, త్రికోణములను దర్శించి, ధ్యానిస్తే మంగళకరం. 

కాంతి, శక్తి ప్రసరణము చేస్తూ భగమాలను ధరించిన, ఆ భగమాలిని కి వందనం. 

ఓం శ్రీ భగమాలిన్యై నమః  


278. పద్మాసనా

శ్రీమాతను బ్రహ్మరూపా అన్నాం. బ్రహ్మ పద్మాసనంలో ఉంటాడు. 

అమ్మవారు కూడా బ్రహ్మ కనుక, పద్మాసనా అయ్యింది. పద్మము అనేది నవనిధులలో ఒకటి. 

ఆ శ్రీదేవి, పద్మనిధి యందు కూర్చుని, అర్హులైన భక్తులకు ఐశ్వర్యములు ఇస్తుంది. 

పద్మాసురుడనే రాక్షసుడిని ఓడించి పద్మాసన స్థిత అయ్యింది. 

అమ్మ కూర్చున్న పద్మానికి, ప్రకృతే రేకలు, వికారములు కేసరములు, జ్ఞానమే కాడ. 

జ్ఞానమనే కాడపై ఆధారపడిన పద్మమనే ప్రకృతిపై, వికారమైన కేసరములను తొలగించి 

ఆశీనురాలయినది శ్రీదేవి. ఈ దేవి అనుగ్రహం ఉంటే సమస్త సుఖభోగములూ, అన్యోన్య 

దాంపత్యము లభిస్తాయి. ఈ దేవి కోపిస్తే, ఏ ఇంటా సుఖశాంతులుండవు. 

ఈ నామంతో దేవిని జపిస్తే సుఖము, శాంతి కలుగుతాయి. 

పద్మాసనంపై కూర్చుని, భక్తులకు సుఖము, శాంతి, ఐశ్వర్యము, దాంపత్య సుఖము 

ప్రసాదిస్తున్న, ఆ పద్మాసన కు వందనం. 

ఓం శ్రీ పద్మాసనాయై నమః 

  

279. భగవతీ

భగవతి అంటే భగము కలిగినది. 

పైన చెప్పుకున్న అన్ని భగ అర్ధములూ ఈ నామంలో కూడా వర్తిస్తాయి. 

కాళికాపురాణం ప్రకారం ఆరు రకాల ఐశ్వర్యం కలిగినది. 

ఈ దేవతకు ఉత్పత్తి, ప్రళయముల జ్ఞానముంది. భూతముల రాకపోకల జ్ఞానమున్నది. 

జ్ఞానము, అజ్ఞానము అనే  తత్వజ్ఞానమున్నది. 

ఈ శక్తులుండుట చేత ఈ దేవి భగవతీ అని కీర్తించబడుతోంది. 

ఉత్పత్తి, ప్రళయం, భూతముల రాకపోకలు, విద్యా, అవిద్యా విషయములలో సంపూర్ణ జ్ఞానముతో 

ప్రకాశిస్తున్న, ఆ భగవతి కి వందనం. 

ఓం శ్రీ భగవత్యై నమః 


280. పద్మనాభ సహోదరీ

పద్మనాభుడంటే, నారాయణుడు. ఆతని సోదరి నారాయణి. దేవీ భాగవతం ప్రకారము,

సృష్ట్యాదిలో ఈ బ్రహ్మాండంలో మూడు పిండాండములు ఉద్భవించాయి. 

ఒక పిండాండము నుంచి నారాయణ, నారాయణి, రెండవ పిండాండము నుంచి బ్రహ్మ, లక్ష్మి, 

మూడవ పిండాండము నుంచి శివ, సరస్వతులు ఉదయించారు. 

ఆ విధముగా నారాయణుడు, నారాయణి సహోదరులు. 

భగవతీ, పద్మనాభసహోదరీ అనే ఈ నామాల్లో నుంచి బీజాక్షర కూర్పు చేస్తే, 

వాగ్భవకూట రూపమైన "క ఏ ఈ ల హ్రీమ్" అవుతుంది. 

ఈ నామాలు అమ్మవారి వాగ్భవకూటాన్ని సూచిస్తాయి. 

విష్ణు సహోదరి అయిన, ఆ పద్మనాభ సహోదరి కి వందనం. 

ఓం శ్రీ పద్మనాభసహోదర్యై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

25, సెప్టెంబర్ 2021, శనివారం

64. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీ, ఈశ్వరీ సదాశివా, అనుగ్రహదా, పంచకృత్య పరాయణా

  

సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీ, ఈశ్వరీ
సదాశివా, అనుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥

268. సంహారిణీ

సృష్టి, స్థితులతో పాటు లయ కార్యమును కూడా నిర్వహించు శక్తి కనుక, ఈ నామములో 

ఆ దుర్గను సంహారిణీ అంటున్నాం. 

సంహారం చేయాలంటే తమోగుణం కావాలి. 

జీవుడిని ఉద్ధరించటం కోసం, కనికరముతో సంహారకార్యమును కూడా చేస్తున్న మహాశక్తి, 

ఈ జగదీశ్వరి. ఈ విధముగా ఏకకాలంలో సృష్టి, స్థితి, లయములను నిర్వహిస్తోంది ఆ జగదంబ. 

సకల జీవులనూ శక్తితో సంహరిస్తున్న, ఆ సంహారిణి కి వందనం. 

ఓం శ్రీ సంహారిణ్యై నమః  


269. రుద్రరూపా

సంహారం చేయాలంటే తమోగుణం కావాలనుకున్నాం కదా, ఆ తమోగుణ ప్రధానుడే రుద్రుడు. 

తమోగుణ ప్రధానుడైన రుద్రుని పత్నిగా రుద్రాణి ఈ సంహార కార్యం చేపట్టింది. 

జాతస్య మరణం ధృవం అని భగవద్గీత చెప్పింది. పుట్టిన ప్రతిజీవికీ మరణము తప్పదు. 

ప్రతి సృష్టికీ విలయమూ తప్పదు. ఈ సంహార కార్యం చేస్తున్నప్పుడు రుద్రాణి రుద్రరూపంలో 

ఉంటుంది. అందుకే ఆ అంబను ఈ నామంలో రుద్రరూపా అంటున్నాం. 

తాను చేసిన సమస్త సృష్టినీ తానే లయము చేస్తున్న, ఆ రుద్రరూప కు వందనం.  

ఓం శ్రీ రుద్రరూపాయై నమః  


270. తిరోధానకరీ

తిరోధానము అంటే అంతర్ధానము చేయటం, మటుమాయం చేయటం, పటాపంచలు చేయటం 

అని అర్ధం. సమస్త ప్రాణికోటినీ లయము చేస్తూ, మటుమాయం చేసే శక్తే ఈ తిరోధానకరీ.

ఈ శక్తినే తిరస్కరిణీ శక్తి అంటాం. సృష్టి నంతా మహాప్రళయంలో తిరోధానం చేస్తుంది. 

సృష్టి అంతా చిన్న చిన్న అణువులుగా మారిపోతుంది. ప్రళయంలో సృష్టి సమస్తమూ హననమై,

అమ్మలో లయించిపోతుంది. ఈ సమస్త సృష్టీ తిరిగి ఆ జగన్మాత గర్భంలో మణిగి పోతుంది. 

ఎప్పటికప్పుడు ప్రాణికోటి పుడుతూ ఉంటుంది, మనుగడ సాగిస్తూ ఉంటుంది, 

చస్తూ ఉంటుంది, మరునిముషంలో మటుమాయమవుతూ ఉంటుంది. 

అలా మాయం చేస్తోంది కనుకే, ఆ జగదీశ్వరికి ఈ నామం వచ్చింది. 

సంహారం తరువాత సృష్టినంతా అంతర్ధానం చేస్తున్న, ఆ తిరోధానకరి కి వందనం. 

ఓం శ్రీ తిరోధానకర్యై నమః  


271. ఈశ్వరీ

ఈశ్వరుడు శుద్ధసత్వ స్వరూపుడు. ఆ ఈశ్వరుని స్త్రీ అంశే ఈశ్వరి. హననం చేసే శక్తే ఈశ్వరి. 

తిరోధానము చేసేటప్పుడు ఈ శక్తి బయటకు వస్తుంది. మాయం చేసే శక్తి ఆ మహామాయది. 

అందరూ చివరకు త్రిమూర్తులు కూడా ఈ మాయకు లొంగవలసిన వారే. 

అందరినీ మాయలో ముంచే శక్తి, మాయం చేసి తిరోధానం చేసే శక్తి 

శుద్ధజ్ఞాన స్వరూపురాలయిన ఈశ్వరికి మాత్రమే ఉంటుంది. 

ఈశ్వరీ రూపంలో సృష్టిని మటుమాయం చేస్తున్న, ఆ ఈశ్వరి కి వందనం. 

ఓం శ్రీ ఈశ్వర్యై నమః 

  

272. సదాశివా

సదాశివుడు, ఎల్లప్పుడూ సత్వగుణ ప్రధానుడు. సదాశివుని పత్నిగా ఆ పార్వతీదేవి కూడా

సదాశివునితో అభేదము పొంది, శుద్ధ సత్వ స్వరూపముతో ఎల్లప్పుడూ ప్రకటితమవుతూ

ఉంటుంది. ఉపాసకులు ఈ సదాశివాను ఉపాసిస్తే, సత్వగుణం కలుగుతుంది. 

రజస్తమోగుణాల ఉధృతం తగ్గుతుంది. సత్వగుణోపేతుడుగా యోగి, శివుడికి దగ్గరవుతాడు. 

భక్తులకు కృపతో సత్వజ్ఞానాన్ని అందిస్తున్న, ఆ సదాశివా కు వందనం. 

ఓం శ్రీ సదాశివాయై నమః 


273. అనుగ్రహదా

అమ్మ అనుగ్రహదాయిని కనుక ఈ నామం వచ్చింది. 

తాను చేసిన సృష్టినంతా లయము చేసిన తరువాత, ఆ జగన్మాతకు అనుగ్రహం కలుగుతుంది. 

దానివలన, తిరిగి సృష్టి ఆరంభిస్తుంది. 

భగవద్గీతలో జాతస్యహి ధ్రువోర్ముత్యుః, ధ్రువమ్ జన్మ మృతస్యచ అని చెప్పారు. 

కనుక పుట్టినవన్నీ గిట్టవలసినదే, గిట్టినవన్నీ పుట్టవలసిందే. 

సమస్త సృష్టీ తిరిగి అమ్మ అనుగ్రహం వలన, అమ్మ చేతిలో ప్రాణం పోసుకుంటుంది. 

తిరిగి అన్ని గ్రహములు, భువనములు, లోకములు, లోకస్థులూ, లోకేశులూ, స్థావరములూ, 

జంగమములూ అన్నీ ప్రాణం పోసుకుంటాయి. అమ్మ మళ్ళీ భువనప్రసూత అయిపోతుంది.  

మళ్ళీ సృష్టి చక్రం ప్రారంభం అవుతుంది. సృష్టి, ఆ తరువాత స్థితీ, ఆ పై సంహారం, తిరోధానం, 

తుదకు అనుగ్రహంతో పునఃసృష్టి. ఇదే అమ్మ అనుగ్రహ చక్రం.  

ఈ జననమరణ చక్రం నిరంతరాయంగా సాగిపోతూనే ఉంటుంది. 

జగత్తుపై అనుగ్రహంతో సృష్టిని తిరిగి ఆరంభించిన, ఆ అనుగ్రహద కు వందనం. 

ఓం శ్రీ అనుగ్రహదాయై నమః 


274. పంచకృత్య పరాయణా

ఈ సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము అనే అయిదు కార్యములనూ 

పంచకృత్యములు అంటాము. జగన్మాత ఈ పంచకృత్యాలనూ చేయాలనే అభీష్టంతో ఉంటుంది. 

పరాయణ అంటే అభీష్టము, కోరిక. 

నిరంతర పరాయణగా అమ్మ ఈ పంచకృత్యాలనూ, ఒకదాని తరువాత మరియొకటి చేస్తూనే 

ఉంటుంది. ఈ అయిదు కృత్యాలనీ చేసే శక్తి వున్న ఆ జగన్మాతనే పంచకృత్యపరాయణా 

అనే నామంతో కీర్తిస్తున్నాం. 

సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము అనే పంచకృత్యాలనూ నిర్వహించాలనే 

అభీష్టముతో వున్న, ఆ పంచకృత్య పరాయణ కు వందనం. 

ఓం శ్రీ పంచకృత్యపరాయణాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

63. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ

సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా 
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥

260. సుప్తా

సుప్తావస్థ అంటే నిద్రావస్థే. జీవుడు నిద్రపోయినప్పుడు, ఆతడి లోపల వుండి నిద్రను 

కలుగచేయు శక్తే సుప్త. జీవుడికి నిద్ర అవసరము. 

నిద్రలో స్థూల దేహము సేద దీరుతుంది, కారణశరీరము మేల్కొంటుంది. 

హాయిగా నిద్ర పోయాను, ఒళ్ళు తెలియలేదు, నాకేమీ తెలియలేదు అంటూ ఉంటాం. 

అంటే నిద్రలో ఏమీ తెలియదనే అజ్ఞానం వస్తోంది. 

ఒళ్ళు తెలియలేదు అంటే, నేను అనే అహం మరుగున పడిపోతోంది. 

'నేను' అనే స్థితి పోయి సుఖంగా నిద్ర పోతున్నాడు జీవుడు. నిద్రలో అహం లయిస్తోంది. 

నిద్రలో ఏమీ తెలియలేదు అంటే, జీవుడిని నిద్రలో అజ్ఞానం అనే మాయ కమ్మేస్తోంది. 

సుప్తావస్థలో కారణశరీరం లేచి స్థూల శరీరం విశ్రమిస్తోంది. దేహానికి సుఖం కలుగుతోంది. 

సుప్తావస్థలో వున్న జీవుడికి ప్రాజ్ఞుడని పేరు. 

సుప్తావస్థ ద్వారా జీవుడిని మాయలో పెడుతున్న, ఆ సుప్త కు  వందనం. 

ఓం శ్రీ సుప్తాయై నమః  


261. ప్రాజ్ఞాత్మికా

జీవుడిలో ప్రజ్ఞారూపముగా వున్నశక్తే ప్రాజ్ఞాత్మిక. 

నిద్ర పోయి లేచిన జీవుడు ప్రజ్ఞలో, ప్రజ్ఞతో మేలుకొంటున్నాడు. 

ఆ మెలకువ, విజ్ఞత రెండూ ఈ ప్రాజ్ఞాత్మిక వల్లనే ఏర్పడుతున్నాయి. 

నిద్రావస్థ లోని అజ్ఞానము నశించి మెలకువ రాగానే ప్రాజ్ఞుడౌతున్నాడు. 

నేను అనే అహం తిరిగి లేస్తుంది. జీవుడి పాండిత్యము, సమర్ధత, జ్ఞానము, 

అన్నీ ప్రజ్ఞ రూపములో బయటకు తెస్తుంది ఈ శక్తి. 

ప్రజ్ఞ రూపములో జీవుడిలో మేల్కొంటున్న, ఆ ప్రాజ్ఞాత్మిక కు వందనం. 

ఓం శ్రీ ప్రాజ్ఞాత్మికాయై నమః  


262. తుర్యా

ఇది తురీయ స్థితిని సూచిస్తుంది. అంటే ఇది నాలుగవ అవస్థ. 

స్వప్న, జాగ్రత్, సుషుప్త అవస్థలు కాక, నాలుగవ అవస్థని తురీయావస్థ అంటాం. 

ఇది శుద్ధ జ్ఞాన స్థితి. దీన్నే బ్రహ్మం అని కూడా అంటాం. 

ఈ అవస్థలో జీవుడు సహస్రారాన్ని చేరి, ఆనంద స్థితిలో ఉంటాడు. 

పై మూడు స్వప్న, జాగ్రత్, సుషుప్త అవస్థలలో జీవుడు కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు.

కానీ తురీయములో అంతఃకరణముల ప్రభావముండదు, కనుక సత్ చిత్ ఆనందములో 

ఉంటాడు. యోగులకి మాత్రమే సాధ్యమయ్యే స్థితి తురీయము. 

ఈ స్థితిని పొందిన యోగికి కర్మఫలములు ఏవీ అంటవు. 

అన్నింటికీ అతీతముగా శుద్ధజ్ఞానమును పొంది ఆత్మలో రమిస్తూ ఉంటాడు. 

సన్యాసాశ్రమములో వున్నవారిని కూడా తురీయాశ్రమంలో వున్నారంటారు. 

యోగులకు తురీయ స్థితిని కలుగచేసే శక్తే తురీయా. తురీయ కు వందనం. 

ఓం శ్రీ తుర్యాయై నమః  


263. సర్వావస్థా వివర్జితా

ఈ చెప్పిన అవస్థలన్నీ, స్వప్న జాగ్రత్, సుషుప్త, తురీయాలు జీవులకే. 

ఈ నాలుగూ కాక అయిదవ అవస్థ కూడా మరియొకటి వున్నది, అది తురీయాతీత అవస్థ. 

ఇటువంటి ఎన్నో అవస్థలనన్నీ కలుపుకుని సర్వావస్థా అని ఈ నామంలో అన్నారు. 

తురీయాతీత స్థితిని పొందిన యోగికి శరీరము ఒక సాధనమే కానీ బంధనము కాదు. 

ఆ తురీయాతీత స్థితిని పొందినవారు, ఏదో ఒక కార్యార్థము కొరకు మాత్రమే తిరిగి శరీరం 

తీసుకుంటారు.  

అట్టి యోగులు శివపూజే వ్రతముగా, శివ ప్రవచనమే జపముగా, ఉపదేశమే దానముగా జీవిస్తారు. 

వారిని గుర్తించడానికి వ్రత, జప, దానమనే ఈ మూడు లక్షణములే ఆధారము. 

సాధకులకు అట్టి తురీయాతీత స్థితిలో ఉన్న యోగుల సేవ శివ సేవతో సమానము. 

ఈ అవస్థలన్నీ కూడా అమ్మ త్యజించింది. ఆ జగదాంబకు ఏ అవస్థలూ లేవు. 

అయినా ఆ అమ్మ అన్ని అవస్థలలో తాను ఉంటూ, జీవుడికి ఆయా అవస్థల 

అనుభూతులు కలుగచేస్తూ ఉంటుంది. 

స్వప్న, జాగ్రత్, సుషుప్త అవస్థలలో జీవుడితో కర్మ ఫలములను అనుభవింపచేస్తూ, 

తురీయములో ఆనందాన్నీ, తురీయాతీతంలో శివస్వరూపాన్నీ ఇస్తుంది ఆ జగదాంబ. 

ఈ అవస్థా పంచకమునే కాక, సమస్త అవస్థలనూ త్యజించిన, ఆ సర్వావస్థా వివర్జిత కు వందనం. 

ఓం శ్రీ సర్వావస్థావివర్జితాయై నమః 

  

264. సృష్టికర్త్రీ

ఈ చరాచర జగత్తును సృష్టి చేసే శక్తి కనుక, ఆ జగన్మాతను ఈ నామంలో సృష్టికర్త్రీ అన్నారు. 

ఈ శక్తికే మరియొక పేరు జగత్సూత, జగత్ప్రసూత. సూతమంటే పురిటి మైల. 

నిత్యమూ సృష్టి కార్యంలో నిమగ్నమయ్యే తల్లి కనుక ఈ పేరు ఏర్పడింది. 

కనకధారా స్తోత్రంలో ఆ శ్రీదేవిని శంకరాచార్యుడు, భువన ప్రసూత్యై అంటాడు. 

అమ్మ ఈ భువనములను నిత్యమూ ప్రసవిస్తూనే వుంది. 

జగన్నిర్మాణ కార్యములో వున్న, ఆ సృష్టికర్త్రి కి వందనం. 

ఓం శ్రీ సృష్ఠికర్త్ర్యై నమః 

265. బ్రహ్మరూపా

సృష్టి చేయగల శక్తి ఉన్నవాడినే బ్రహ్మ అంటారు. 

ఆ జగన్మాత సృష్టికర్త్రి కనుక ఆ తల్లి స్వయముగా బ్రహ్మ స్వరూప. 

అందుకే ఈ నామంలో బ్రహ్మ రూపా అంటున్నాం. సృష్టి శక్తియే బ్రహ్మ. 

సృష్టి చేస్తున్నపుడు బ్రహ్మ రూపంలో ఉంటున్న, ఆ బ్రహ్మరూప కు వందనం. 

ఓం శ్రీ బ్రహ్మరూపాయై నమః 

266. గోప్త్రీ

గోపనము అంటే రక్షణము. గోప్త్రీ అంటే గోపనము చేయు తల్లి అని అర్ధం. 

సృష్టి చేశాక, తాను చేసిన సృష్టికి రక్షణ కార్యంలో ఉంటుంది ఆ జగదంబ. 

జగత్సృష్టి, జగద్రక్షణ రెండూ ఆ జగదీశ్వరి లక్షణములు. 

రక్షించువాడు, స్థితికారకుడు విష్ణువు. నారాయణ, నారాయణి ఇరువురూ ఈ స్థితి కార్యములో 

వున్నవారే. సృష్టిని పోషించే, కాపాడే, రక్షించే తల్లి కనుక గోప్త్రీ అనే నామం అమ్మకు వచ్చింది. 

సమస్త సృష్టినీ గోపనము చేస్తూ, కాస్తున్న, ఆ గోప్త్రి కి వందనం. 

ఓం శ్రీ  గోప్త్ర్యై నమః   

267. గోవిందరూపిణీ

గోవిందుడు అంటే రక్షించేవాడు. 

అందుకే వేంకటేశ్వరుడిని రక్షించు ఈశ్వరా అంటూ, గోవిందా అంటాం. 

గోవిందా నామం రావడం వెనుక ఓ కథ వుంది. 

ఒకసారి ఇంద్రుడికి గోగణాల మీద ఆగ్రహం కలిగి, శిలా వర్షం కురిపించాడు. 

అప్పుడు బాలకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలిపై ఎత్తి, ఆ గోవులకూ,

గోపాలురకూ ఆ పర్వతం కింద రక్షణ కల్పించాడు.

అప్పటినుంచీ విష్ణువు గోవిందా అనే నామం ధరించాడు. 

కనుక గోవిందుడంటే రక్షించేవాడు అనే అర్ధం వచ్చింది. 

ఆ జగన్మాత రక్షించేటప్పుడు గోవింద రూపంలో ఉంటుంది. 

అందుకే ఈ నామంలో ఆ శ్రీ మాతను గోవింద రూపిణీ అంటున్నాం. 

గోవింద రూపములో భక్తులను రక్షిస్తున్న, ఆ గోవిందరూపిణి కి వందనం. 

ఓం శ్రీ గోవిందరూపిణ్యై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650