15, సెప్టెంబర్ 2021, బుధవారం

54. మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ మహామాయా, మహాసత్త్వా, మహాశక్తిః, మహారతిః

 

మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ 
మహామాయా, మహాసత్త్వా, మహా
శక్తిః, మహారతిః ॥ 54 ॥

212. మహారూపా

మహత్తరమైన రూపము కల తల్లి ఆ లలితాపరమేశ్వరి. అన్ని రూపములూ ఆ అమ్మవే. 

ప్రకృతీ ఆమే, పురుషుడూ ఆమే. కాల స్వరూపుడైన మహాకాళుడూ ఆమె రూపమే. 

దశావతారాలూ ఆ జగదంబ అంశావతారములే. శివుని రూపములో వ్యక్తం అయ్యేదీ ఆ శివానీయే.  

ఆ తల్లి తనయొక్క త్రిగుణములనూ త్రిమూర్తుల రూపములో వ్యక్తము చేస్తోంది. 

పురుషసూక్తంలో వర్ణించిన విరాట్ పురుషుడు ఈ మాతే. 

శ్రీసూక్తంలో స్తుతించిన మహాలక్ష్మీ స్వరూపమూ ఈ తల్లే. 

అన్ని మహత్వరూపాలూ తనవే అయిన, ఆ మహారూప కు వందనం. 

ఓం శ్రీ మహారూపాయై నమః  


213. మహాపూజ్యా

పూజ్యులైన వారి చేత కూడా పూజింపబడే దేవత కనుక ఆ తల్లిని మహాపూజ్యా అన్నాము. 

వేదకాలం నుంచీ దేవతలు, ఋషులు అందరి చేతా పూజింపబడుతున్న తల్లి. 

పూజనీయులైన వారి నుంచి కూడా పూజలందుకుంటున్న ఆ తల్లి మహాపూజ్యా కదా. 

దేవతలే కాదు, అసురుల చేత కూడా పూజింపబడుతున్న పూజనీయ ఈ మహాపూజ్య. 

అన్ని రకముల రూపములలోనూ, సకల ధాతువుల చేతా పూజింపబడుతున్న తల్లి.  

మాన్యుల నుంచి సామాన్యుల వరకూ,  దేవతల నుంచి రాక్షసుల వరకూ 

అందరి చేతా పూజలందుకుంటున్న ఆ మహాపూజ్య కు వందనం. 

ఓం శ్రీ మహాపూజ్యాయై నమః 

  

214. మహాపాతక నాశినీ 

పాతకము అంటేనే మహా పాపము. 

మహా పాతకము అంటే ఇక అది యెంత పెద్ద పాపమో ఆలోచించండి. 

అమ్మను పాపనాశినీ అన్నాం. ఇప్పుడు మహాపాతకనాశినీ అంటున్నాం. 

ఆ తల్లిని సాంద్ర కరుణా అని ఎందుకు అన్నారో ఈ నామము వలన అర్ధము అవుతుంది. 

అమ్మ కరుణాసముద్ర. 

తన భక్తుల పాతకములను, మహాపాతకములను, తొలగించి వారిని శుద్ధులను చేస్తుంది. 

బ్రహ్మాండపురాణములో పంచదశీ మంత్రమును జపించిన వారికి పాతకములు తొలుగుతాయి 

అని చెప్పారు. చేసిన పాతకము తీవ్రతను బట్టీ జపము అధికముగా చేయవలసి ఉంటుంది. 

బ్రహ్మహత్య, వీరహత్య(ఉపాసకులు) వంటి మహాపాతకములను కూడా తొలగిస్తుంది జగదంబ. 

ప్రాయశ్చిత్త ప్రకరణములలో కూడా పంచదశీ మంత్రజపము వలన మహా పాతకములు కూడా 

నశిస్తాయి అని చెప్పారు. జపసంఖ్య పెంచి ఎంతటి మహా పాతకమునైనా నాశనము చేసుకోవచ్చు. 

తెలిసి చేసినా, తెలియక చేసినా పాతకము నిప్పు వంటిది. అది దహిస్తుంది. 

అమ్మ కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే దానికి నివారణ. తపించటమన్నా, దహించటమన్నా ఒక్కటే. 

అమ్మ జపములో తపిస్తే, ఆ పశ్చాత్తాపము వలన, పాతకములు నాశనము అవుతాయి. 

పశ్చాత్-తాపం అంటే, తరువాత కలిగిన తాపము. 

కనుక పాతకములు నశిస్తాయి కదా అని పాతకములు చేయకండి. 

అనంతరం అంటే పశ్చాత్ తాపము వలన దహింపబడితేనే, ఆ పాతకములు పోతాయి. 

భక్తుల పాతకములను జపముతో తొలగిస్తున్న ఆ కారుణ్యసముద్ర, 

ఆ మహాపాతక నాశిని కి వందనం. 

ఓం శ్రీ మహాపాతకనాశిన్యై నమః 


215. మహామాయా

మాయ అంటేనే అంతు చిక్కనిది, తెలియరానిది. మహామాయ అంటే, మాయలను మించిన

మాయ. అమ్మవారి మాయకు లోబడని వారు ఎవరూ లేరు. నారదాది మహర్షులు సైతం 

ఆ మాయకు లొంగిపోయిన వారే. ఆ తల్లి మాయలనే లీలలు అంటాం. 

బ్రహ్మాదులకైనా ఈ మాయ వల తప్పదు, ఇక అట్టి మహామాయ ముందు సామాన్య మానవులెంత. 

శిశువు గర్భములో వున్నప్పుడు పైన భౌతికంగా మాయ అనే పొర ఉన్నప్పటికీ కూడా, సంపూర్ణ

జ్ఞానముతో ఉంటాడు. బైటికి వచ్చి స్వంతంగా శ్వాస, ఆహారము తీసుకున్నప్పటి నుంచీ మాయ 

ప్రభావం మొదలవుతుంది. అది మొదలు జీవుడు మాయామోహంలో చిక్కుకుపోయి, 

నేను, నాది అనే మమత్వంలో పడిపోయి, అదే అసలైన జీవితం అనే మాయలో ఉంటాడు. 

ఎప్పుడైతే, ఇది అంతా ఆ అమ్మ లీల, మాయ, దయ అని గ్రహిస్తాడో, 

అప్పుడు ఆ మమత్వం అమ్మ వైపుకు మళ్లించి, అమ్మదారిని వెతుక్కుంటాడు. 

చీమ నుంచి బ్రహ్మ వరకూ అందరినీ తనమాయలో ముంచుతున్న, 

ఆ మహామాయ కు వందనం. 

ఓం శ్రీ మహామాయాయై నమః 


216. మహాసత్త్వా

అమ్మవారు శుద్ధసత్వ స్వరూపిణి. అందుకే అమ్మను మహాసత్వా అనే నామంతో కొలుస్తున్నాం. 

సత్వము అంటే, బలము, స్వభావము, ప్రాణము, సాత్వికగుణము, అనే అర్ధాలున్నాయి. 

అమ్మవారు సందర్భానుసారంగా త్రిగుణములూ ప్రదర్శించినప్పటికీ, అమ్మ స్వభావము 

సహజముగా సాత్వికము. సత్వ స్వరూపిణి కనుక ఆ తల్లి మహాసత్వా. 

అందరిలో వున్న ప్రాణము ఆ తల్లే, కనుక ప్రాణము ఎప్పుడూ సత్వరూపమే. 

బలము సత్వబలము అయితే, దానిని సక్రమంగా ఉపయోగించటం జరుగుతుంది. 

అదే రజోగుణ ప్రధానమైన బలము అయితే, దాన్ని హింసకు వాడటం జరుగుతుంది. 

తమోగుణ ప్రధాన బలమైతే, అది మూర్ఖత్వానికి దారి తీస్తుంది. 

కానీ సహజ బలము ఎప్పుడూ సత్వమే. జీవుడే మాయలో పడి, అంతఃకరణముల ప్రభావంతో,

ఆ బలాన్ని వివిధరకాలుగా ఉపయోగిస్తూ ఉంటాడు. ప్రతి జీవుడిలో వున్న సత్వగుణం ఆ అమ్మదే. 

అమ్మ బలము ఎప్పుడూ సత్వప్రధానమే. అసురులను నిర్జించేటప్పుడు ఆ బలాన్ని వాడినా, 

అది వారిని ఉద్ధరించడానికే అని తెలియాలి.  

సత్వ గుణ స్వరూపమయిన, ఆ మహాసత్త్వ కు వందనం. 

ఓం శ్రీ మహాసత్వాయై నమః 


217. మహాశక్తిః

అమ్మ గొప్ప శక్తి కలది, ఆ అమ్మ సామర్ధ్యమునకు సాటి లేదు. తన శక్తి తోనే సర్వమూ 

నడిపిస్తోంది. ఆ అమ్మ శక్తి, ఆమెకు దగ్గరగా వున్నవారికి ప్రత్యక్షంగా అనుభవం లోకి వస్తుంది. 

అమ్మ జ్యోతిశ్చక్రము పరిధి చాలా పెద్దది అని చెప్పుకున్నాం. అమ్మ కరుణ సోకిన వారందరూ 

ఆ పరిధి లోనే వుంటారు. వారికి అమ్మ శక్తి తెలుస్తూ ఉంటుంది. 

దుష్టులను ఆ తల్లి దరి చేరనివ్వదు అనుకున్నాం కదా, వారికి అమ్మ శక్తి ప్రభావం తెలియదు. 

పార్వతీదేవి శక్తి అనే ఆయుధాన్ని కుమారస్వామికి ఇచ్చింది. ఆ శూలం పొడవుగా వాడి మొన 

కలిగి, ఒకే కొనతో, పైన వెడల్పుగా ఉంటుంది. దానితోనే కుమారస్వామి తారకాసుర సంహారం 

చేశాడు. ఈ శూలం శివుడి త్రిశూలం కాదు. శక్తి అనే పేరు గల శూలం. 

ఆ శూలానికే జ్ఞానం అనే మరియొక పేరు కూడా వుంది.  

తల్లి పుత్రుడికి ఇవ్వవలసిన అసలైన ఆయుధం ఇదే. 

అమ్మగా కుమారుడికి జ్ఞానాన్ని ఆయుధంగా ఇచ్చింది. 

అది కూడా పొడవుగా వాడిగా మొనదేలి వున్న ఆయుధం. 

జ్ఞానం అనేది సూటిగా, వివరంగా ఉండాలి అని ఆ తల్లి చెప్తోంది. 

అవసరం వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్నే ఆయుధంగా వాడాలి, అనేదే అమ్మ సందేశం.  

తాను గొప్ప శక్తియై, అందరికీ శక్తినిస్తున్న, ఆ మహాశక్తి కి వందనం. 

ఓం శ్రీ మహాశక్త్యై నమః 


218. మహారతిః

రతి అంటే ప్రీతి, అనురాగము అని భావం. భక్తులకు, ఉపాసకులకు, యోగులకు, 

ఆ తల్లి అంటే మహాప్రీతి, ఇష్టం. అందుకే ఆమె మహారతి. 

ఆ తల్లికి కూడా తన భక్తులన్నా, ఉపాసకులన్నా, యోగులన్నా ఎంతో ఇష్టం. 

వారిపట్ల అమ్మ అనురాగం కురిపిస్తుంది కనుక, ఆమె మహారతి. 

కామేశ్వరుడంటే ఆ కామేశ్వరికి మహా ప్రీతి. తపస్వి అయిన ఈశ్వరుడిని, 

తన అనన్యమైన ప్రీతితో కామేశ్వరుడిని చేసి, 

ఆ సాధనాక్రమంలో తాను కామేశ్వరియై, సృష్టికార్యమును జరిపిస్తోందికనుక ఆమె మహారతి. 

కామేశ్వరునిపై వున్న ప్రీతితో తాను కామేశ్వరిగా మారిన, ఆ మహారతి కి వందనం. 

ఓం శ్రీ మహారత్యై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


2 కామెంట్‌లు: