
ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా ॥ 62 ॥
254. ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా
ఓం శ్రీ ధ్యానధ్యాతృధ్యేయరూపాయై నమః
255. ధర్మాధర్మ వివర్జితా
ధర్మాధర్మవివర్జితా, అనే నామంలో, ఆ శ్రీమాత, ధర్మమూ, అధర్మమూ రెండూ వదిలేసానని
చెప్తోంది. ధర్మ అధర్మ వివర్జితా. రాగద్వేషములు, మమతా మోహములు ఏవిధంగా వదిలేసిందో,
అదే విధంగా ఆ తల్లికి ధర్మమూ, అధర్మము అనే భేదము లేదు.
ధర్మమంటే విహితకర్మలు, వేదశాస్త్రము చేయమని చెప్పిన కర్మలు.
దీనివల్ల జీవుడికి మేలు జరుగుతుంది. పుణ్యబలము పెరుగుతుంది.
అధర్మమంటే నిషిద్ధకర్మలు, వేదశాస్త్రము వద్దని చెప్పిన కర్మలు.
దీనివల్ల జీవుడికి కీడు జరుగుతుంది. పాపబలము పెరుగుతుంది.
అన్ని కర్మలూ ఆ శ్రీమాతకు ఒకటే. ఆ తల్లికి పాపపుణ్యాలేవీ అంటవు కదా.
అమ్మ తేడా చూపదు కానీ, ఫలితాన్ని మాత్రం ఇస్తుంది.
ఆ ఫలితమే జీవుడికి జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది.
ఆకలిగొన్న పాము కప్పను తింటున్నప్పుడు ఏది ధర్మమూ, ఏది అధర్మము అన్న ప్రశ్న రాదు.
కర్తా తానే, కర్మా తానే, కార్యమూ తానే అయిన ఆ శ్రీమాతకు అన్నీ ఒక్కటే.
ఇది ధర్మమూ, అది అధర్మము అన్న తేడా లేదు.
ధర్మమునూ, అధర్మమునూ రెండూ త్యజించిన, ఆ ధర్మాధర్మ వివర్జిత కు వందనం.
ఓం శ్రీ ధర్మాధర్మవివర్జితాయై నమః
256. విశ్వరూపా
విశ్వమే తానైన ఆ జగదీశ్వరికి ఈ నామము సరియైనది. ఈ జగత్తు నంతా ఆవిష్కరించినది
ఆ జగదీశ్వరియే. విశ్వమంతా తానే నిండి, విశ్వములో వున్న సమస్త స్థావర జంగమముల
లోనూ ప్రతిఫలిస్తోంది. ఆమె కాని విశ్వమెక్కడా, అన్న ప్రశ్న వేసుకుంటే, సమాధానమే ఉండదు.
విశ్వమంతా ఆవరించుకుని వున్న పంచభూతాలు ఆ జగన్మాత సృష్టే.
విశ్వమంతా విస్తరించుకుని వున్న పంచ తన్మాత్రలూ ఆ మహాదేవే.
తానే విశ్వమై, విశ్వమే తానైన, మహా విరాట్ స్వరూపిణి ఆ జగదీశ్వరి. ప్రళయకాలంలో కూడా
ఈ సమస్త విశ్వమూ, ప్రకృతీ అంతా ఆ మహాకాళి లోనే లయమై పోయి, భద్రంగా ఉంటాయి.
విశ్వమంతా షోడశ కళలతో నిండి పోయి వుంది. ఆ త్రిపురసుందరే షోడశి, ఆమే విశ్వరూప.
శుక్ల చతుర్ధీ రాత్రికి విశ్వరూపా అని పేరు. కృష్ణ పంచమీ పగటికీ విశ్వరూపా అని పేరు.
కనుక ఆ తల్లి అహోరాత్రములలోనూ వున్నది. అందుకే ఆ జగదీశ్వరిని విశ్వరూపా అంటున్నాం.
అన్నీ తానే అయిన ఆ విరాణ్మూర్తికి, ఆ విశ్వరూప కు వందనం.
ఓం శ్రీ విశ్వరూపాయై నమః
ఓం శ్రీ జాగరిణ్యై నమః
258. స్వపంతీ
స్వపంతీ అంటే, స్వప్నావస్థలో జీవుడితో వున్న దేవత అని అర్ధం.
జీవుడు నిద్రలో స్వప్నము పొందుతాడు. ఆ స్వప్నమును కలిగించేది ఈ మాతే.
అన్ని దృశ్యములూ కనిపిస్తూనే ఉంటాయి. జీవుడు ఆ సన్నివేశములో కూడా ఉంటాడు.
కానీ దేనిమీదా పట్టు ఉండదు, ఏ దృశ్యమూ మిగలదు. జీవుడు మాత్రమూ తాను
ఆ అవస్థలో చూసినవి, అనుభూతి చెందినవి నిజమనే భ్రమలో ఉంటాడు.
నిద్ర నుంచి మేలుకున్నాక కానీ, అది స్వప్నమని, తాను అనుభవించింది అంతా భ్రాంతి
అనీ తెలియదు. ఈ స్వప్నములు పొందు జీవుడికి తైజసుడని పేరు.
జీవుడు స్వప్నములో తేజ స్వరూపములో ఉంటాడు. ఈ స్వప్నములు కలిగించేదీ అమ్మే,
తిరిగి దాన్నుండి మేల్కొల్పేదీ అమ్మే. స్వప్నములలో కొన్ని కర్మలు తీరిపోతూ ఉంటాయి.
కర్మఫలితములను తీర్చేసే స్వప్నానుభూతులనిచ్చు, ఆ స్వపంతి కి వందనం.
ఓం శ్రీ స్వపంత్న్యై నమః
259. తైజసాత్మికా
స్వప్నమును పొందే జీవుడికి తైజసుడని పేరు. స్వప్నములు కలగటానికి కారణము ఆ లలితాదేవి.
తైజసుడిలో తేజో రూపములో వుండి స్వప్నములు అనుభవించేలా చేసే తల్లి తైజసాత్మిక.
ఈ తైజసుల సమష్టి స్వరూపుడే హిరణ్యగర్భుడు. జీవుడులోని ఈ తేజస్సే నిద్రలో స్వప్నములు
రావడానికి కారణం. ఈ తేజస్సే మేల్కొన్నప్పుడు ప్రజ్ఞగా మారుతుంది.
అమ్మ యొక్క ఆ తేజో స్వరూపమే హిరణ్యగర్భస్వరూపం.
జీవుడిలో తేజోరూపములో వున్న, ఆ తైజసాత్మిక కు వందనం.
ఓం శ్రీ తైజసాత్మికాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
, వివరణ చాలా బాగా ఉంది స్వప్నంలో కూడా కొన్ని కర్మలు అమ్మ తీరేలా చేస్తుంది అని కొత్త విషయం తెలియడంతో చాలా ఆనందంగా కూడా ఉంది చాలా చాలా ధన్యవాదములు ఆంటీ
రిప్లయితొలగించండిఅవును, అమ్మ స్వప్నాల ద్వారా కూడా జీవుడు అనుభవించవలసిన కొన్ని కర్మలను అనుభవింపచేస్తుంది. ఆ కర్మను తిరిగి అనుభవించనవసరం లేదు. జీవుడు ఆ స్వప్న సమయంలో తాను ఆ అనుభూతులన్నీ స్వయంగా అనుభవిస్తునట్లు అనుకుంటూ ఉంటాడు కదా. కొన్ని కర్మలను ఈ రకంగా తప్పిస్తూ ఉంటుంది ఆ తల్లి. ఏ కర్మను స్వప్నం ద్వారా అనుభవింపచేయాలీ, ఏకర్మను ఈ జన్మలోనే అనుభవింపచేయాలీ, ఏకర్మను తరువాత జన్మలకు బదిలీ చేయాలీ అనేది అమ్మ నిర్ణయం.
రిప్లయితొలగించండి