31, అక్టోబర్ 2021, ఆదివారం

100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా

  

అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా 
దంష్ట్రోజ్వలా, అక్షమాలాదిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥

485. అనాహతాబ్జ నిలయా

అనాహతాబ్జ నిలయా అంటే అనాహత చక్రములో వున్న అబ్జము, కమలంలో కూర్చున్న 

లలితా పరమేశ్వరీ దేవి అని అర్ధం. అనాహత చక్రానికి పన్నెండు దళములు. 

ఆ పన్నెండు దళముల పద్మము మధ్యనున్న కర్ణికలో ఆసీనురాలైన తల్లి అనాహతాబ్జ నిలయా. 


అనాహత చక్రానిది మహర్లోకం, వాయు తత్వం, ఆకుపచ్చ రంగు, స్పర్శ ప్రధానం. 

అనాహత చక్రానిది హృదయస్థానం. హృదయంలో కొలువై వున్న అమ్మ అనాహతాబ్జ నిలయా. 

రానున్న రెండు శ్లోకాలలో ఈ అనాహతాబ్జ నిలయ విశేషణముల గురించి చెప్పుకుందాం. 

హృదయస్థానములో పద్మములో కొలువై వున్న, ఆ అనాహతాబ్జ నిలయ కు వందనం. 

ఓం శ్రీ అనాహతాబ్జ నిలయాయై నమః  


486. శ్యామాభా

శ్యామాభా అంటే శ్యామల వర్ణము కలది అని అర్ధం. శ్యామల వర్ణపు కాంతితో వున్నది అమ్మ. 

ఈ శ్యామల వర్ణాన్నే వాడుక భాషలో చామన చాయ అంటాం. 

శ్యామా అంటే చామనచాయలో, ఆభా అంటే ప్రకాశిస్తున్న దేవత శ్యామాభా. 

పదహారు సంవత్సరముల బాలికను శ్యామల అంటాం. 

ఇదే శ్యామల వర్ణంలో వుండే శ్రీకృష్ణుడిని కూడా శ్యామ్ అంటాం. 

ఈ నామంలో అనాహతాబ్జ నిలయ యొక్క శరీరపు చాయ, చామనచాయ అని చెప్పుకుంటున్నాం. 

చామనచాయ లో మెరుస్తున్న, ఆ శ్యామాభ కు వందనం.  

ఓం శ్రీ శ్యామాభాయై నమః  


487. వదనద్వయా 

ఈ అనాహతాబ్జ నిలయకు రెండు వదనములు. అనగా రెండు తలలు. 

వాయుతత్వము అని చెప్పుకున్నాం కదా. ఆ వాయుతత్వము లోనే ఆకాశ తత్వము 

కూడా ఇమిడి ఉంటుంది. అందుకే  ఈ దేవికి రెండు తలలు. 

శబ్దము, స్పర్శ రెండు తన్మాత్రలూ ఉత్తేజితమయి ఉంటాయి. 

రెండు తత్వములతో, రెండు తలతో ప్రకాశిస్తున్న, ఆ వదనద్వయ కు వందనం. 

ఓం శ్రీ వదనద్వయాయై నమః  


488. దంష్ట్రోజ్వలా

ఉజ్వలమైన కోరలతో, అనగా దంతములతో ప్రకాశించే దేవత దంష్ట్రోజ్వలా. 

శరీరము చాయ చామనచాయ. దంతములు మాత్రం చక్కని తెలుపుతో మెరిసే కోరలు. 

ఈ కోరలు వరాహము కోరల వంటివి. ఆ కోరలతోనే భూమిని ఉద్ధరించింది వరాహము. 

వరాహ సమాన తెల్లని కోరలతో ఉజ్వలంగా వున్న, ఆ దంష్ట్రోజ్వల కు వందనం. 

ఓం శ్రీ దంష్ట్రోజ్వలాయై నమః 


489. అక్షమాలాదిధరా

అక్షమాల గురించి ముందే చెప్పుకున్నాం. అ నుంచి క్ష వరకు కల అక్షరముల మాల అక్షమాల. 

ఈ అనాహతాబ్జ నిలయ చేతిలో అక్షమాలను ధరించి ఉంటుంది. అక్షమాల లో కొలికి పూస క్ష.  

బండి ఇరుసుకు కూడా అక్షం అని పేరు. కనుక అక్షమాల అంటే చక్రము అని కూడా అర్ధం.  

చేతిలో చక్రము ధరించి వున్న దేవత అనాహతాబ్జ నిలయ. 

మిగిలిన చేతులలో శూలము, కపాలం, డమరుకం ధరించి ఉంటుంది. 

చేతిలో అక్షమాలను ధరించి వున్న, ఆ అక్షమాలాదిధర కు వందనం. 

ఓం శ్రీ అక్షమాలాదిధరాయై నమః 


490. రుధిర సంస్థితా

రక్తము నందున్న దేవత అని అర్ధం. రక్తమంటే ప్రీతి. 

విశుద్ధిచక్ర నిలయ చర్మములో ఉంటే, అనాహతాబ్జనిలయ రక్తములో ఉంటుంది. 

రక్తములో ఉంటూ జీవుల శరీరమంతా ప్రవహిస్తున్నది ఈ రుధిర సంస్థిత. 

రక్త దోషములుంటే, లేదా రక్తము తక్కువగావుంటే ఈ నామ జపం చేస్తే స్వస్థత కలుగుతుంది. 

రక్తములో ఉంటూ, రక్తదోషాలను నివారించే, ఆ రుధిర సంస్థిత కు వందనం. 

ఓం శ్రీ రుధిర సంస్థితాయై నమః   


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

30, అక్టోబర్ 2021, శనివారం

99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ

  

పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ 
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥

480. పాయసాన్నప్రియా

ఈ నామంలో విశుద్ధి చక్రనిలయకు ఇష్టమైన పదార్ధం ఏమిటో చెప్పకుందాం. 

పాయసాన్నప్రియా అనే నామం, అమ్మవారికి పాయసాన్నమంటే ఇష్టమని చెప్తున్నది. 

పయః అంటే పాలు. పాలు, బియ్యం, బెల్లం వేసి వండిన పాయసాన్నమంటే కంఠకూపంలో 

వున్న, విశుద్ధి చక్రనిలయకు ఎంతో ఇష్టం. అమ్మను తృప్తి పరచటం భక్తులకు ఇష్టం. 

అందరికీ అంతే కదా, గొంతులో నుంచి మధురమైన పాయసం లోపలకు దిగుతుంటే హాయిగా

అనిపించదూ. మన కంఠకూపంలో వున్న ఆ విశుద్ధి చక్రనిలయకు కూడా పాయసాన్నమే ఇష్టం.  

పాలు, బెల్లం వేసి వండిన తియ్యని పాయసాన్నాన్ని ప్రియంగా స్వీకరిస్తున్న, 

ఆ పాయసాన్నప్రియ కు వందనం. 

ఓం శ్రీ పాయసాన్నప్రియాయై నమః  


481. త్వక్స్థా

విశుద్ధి చక్రనిలయ తన నాలుగు చేతులలో ఒక దానిలో చర్మాన్ని ధరించి వున్నదని

చెప్పుకున్నాం కదా. అదే ఈ నామానికి అర్ధం. త్వగింద్రియం అంటే చర్మము. 

త్వక్ అంటే చర్మములో, స్థా అంటే ఉండునది. త్వక్స్థా అంటే చర్మములో ఉండునది. 

ప్రతి జీవి చర్మములో వుండే ధాతువు ఆ లలితాపరమేశ్వరియే. 

అమ్మ మనల్ని చర్మం రూపంలో మొత్తం కప్పేసి ఉందని ఊహిస్తుంటే, అద్భుతంగా లేదూ. 

చర్మ సంబంధమైన ఏ సమస్య వచ్చినా, చర్మంపై మచ్చలు వచ్చినా, కాలినా, మరి ఏ ఇతర 

సమస్య వచ్చినా, ఈ నామం జపిస్తే, స్వస్థత కలుగుతుంది. 

చర్మ రూపంలో ప్రతి జీవినీ పూర్తిగా ఆవరించి ఉన్న, ఆ త్వక్స్థ కు వందనం.  

ఓం శ్రీ త్వక్స్థాయై  నమః  


482. పశులోకభయంకరీ 

పశుపతి అంటే శివుడు. పశువులన్నింటికీ అధిపతి. 

పశువులంటే దేవుడు వేరు, నేను వేరు అనుకునే అజ్ఞానులు. 

అద్వైతము అర్ధము చేసుకోని అవిద్యాపరులు. అద్వైతం 'అహం బ్రహ్మాస్మి' అని చెప్పింది. 

ఆ భావన అర్ధం చేసుకోని వాడు పశువు. అట్టి పశువులుండే లోకానికి భయంకరి, శ్రీలలిత. 

అందుకే ఈ నామంలో ఆ విశుద్ధి చక్రనిలయను పశులోక భయంకరీ అంటున్నాం.  

అద్వైతమును నమ్మని వారి పాలిట భయంకరిగా వున్న, ఆ పశులోకభయంకరి కి వందనం. 

ఓం శ్రీ పశులోకభయంకర్యై నమః  


483. అమృతాదిమహాశక్తిసంవృతా 

అమృతా మొదలగు పదహారు శక్తులచే సంవృతమైనది అని భావం. 

విశుద్ధిచక్ర పద్మానికి పదహారు దళములు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. 

ఈ అమృతాది పదహారు శక్తులూ ఒక్కక్క శక్తి, ఒక్కొక్క దళములో వుంటాయి. 

ఈ శక్తులు పద్మ కర్ణికలో కూర్చుని వున్న, ఆ విశుద్ధి చక్రనిలయను పరివేష్టించి ఉంటాయి. 

ఆ పదహారు శక్తులు, అమృతా, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషఃకేసి, ఊర్ధ్వ, ఋద్ధిత, 

ౠకార, కార, షా, ఏకపదా, ఐశ్వర్యా, ఓంకార, ఔషధీ, అంబికా, అఃక్షరా.  

ఇవి మాతృకావర్ణమాలలో వున్న అచ్చు అక్షరములను సూచిస్తాయి. 

ఆ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఏ, ఐ, ఓ, ఔ, అం, అః.    

పరా వాక్కు కంఠానికి చేరి ఇక్కడ అచ్చులతో కలసి వైఖరీరూపంలో బయటకు వస్తుంది. 

పదహారు అచ్చులచే పరివేష్టింపబడిన, ఆ అమృతాదిమహాశక్తిసంవృత కు వందనం. 

ఓం శ్రీ అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః 

  

484. డాకినీశ్వరీ 

 విశుద్దిచక్రాధీశ్వరీకి డాకినీ అని పేరు. పైన చెప్పుకున్న లక్షణములన్నీ కలిగిన దేవత డాకినీ.  

విశుద్దిచక్రనిలయా, ఆరక్తవర్ణా, త్రిలోచనా, ఖట్వాంగాదిప్రహరణా, వదనైకసమన్వితా,

పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోకభయంకరీ, అమృతాదిమహాశక్తిసంవృతా, 

అనే ఈ తొమ్మిది విశేషణములనూ కలిగిన దేవత డాకినీశ్వరీ. 

డాకినీశ్వరీ శక్తి, విశుద్ధి చక్ర పద్మంలో ఉంటూ, పాటలీవర్ణ చాయలో మెరుస్తూ, 

మూడు నేత్రాలతో, ఖట్వాంగాది ఆయుధములను చేత ధరించి, ఏక వదనముతో ప్రకాశిస్తూ, 

చర్మధాతువు నందు ఉంటూ, పశులోకాల పాలిట భయంకరియై, చుట్టూ అమృత మొదలగు 

పదహారు అచ్చు అక్షరముల దేవతా శక్తులతో వుండి, పాయసాన్నముపై ప్రీతి కలది అని 

విశుద్ధి చక్రాధిష్టాన దేవత గురించి చెప్పుకుంటున్నాం.  

తొమ్మిది విశేషణముల విశేష్య స్వరూపురాలు, ఆ డాకినీశ్వరి కి వందనం. 

ఓం శ్రీ డాకినీశ్వర్యై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

29, అక్టోబర్ 2021, శుక్రవారం

98. విశుద్ధి చక్రనిలయా, ఆరక్తవర్ణా, త్రిలోచనా ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా

 

విశుద్ధి చక్రనిలయా, ఆరక్తవర్ణా, త్రిలోచనా 
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా ॥ 98 ॥

475. విశుద్ధిచక్రనిలయా

విశుద్ధి చక్రనిలయా అంటే కంఠ కూపమందున్న విశుద్ధి చక్ర మధ్యములో ఉండునది అని అర్ధం. 

ఈ రెండు శ్లోకములలో ఆ విశుద్ధి చక్రనిలయ గురించి వివరంగా చెప్పకుందాం. 

కంఠ కూపంలో ఒక చక్రమున్నది. దానినే విశుద్ధి చక్రము అంటాం. 

విశుద్ధిచక్రానిది జనలోకం, ఆకాశతత్వం. నీలి రంగు. శబ్ద ప్రధానం. 

ఆ చక్రమధ్యంలో ఒక పద్మము వున్నది. ఆ పద్మమునకు పదహారు దళములు. 

ఆ పద్మ మధ్యంలో ఉన్న కర్ణిక, తామర బొడ్డుపై, ఆసీనురాలై అమ్మ కూర్చుని వున్నది. 

ఆ పరమేశ్వరీ శక్తియే విశుద్ధిచక్రనిలయ. ఈ చక్రానికి  అధిదేవత జీవుడు

కంఠకూపమందున్న పద్మములో ఆసీనురాలై వున్న, ఆ విశుద్ధిచక్రనిలయ కు వందనం. 

ఓం శ్రీ విశుద్ధిచక్రనిలయాయై నమః  


476. ఆరక్తవర్ణా

ఆరక్తవర్ణా అంటే కొద్దిగా తెలుపు కలసిన ఎరుపు రంగు అని అర్ధం. అటువంటి వర్ణాన్ని 

పాటలీ వర్ణము అంటారు. తెలుపు, ఎరుపు కలసిన పాటలీ వర్ణము, అంటే గులాబీ రంగు. 

ఈ నామంలో విశుద్ధి చక్ర నిలయ యొక్క వర్ణము పాటలీ వర్ణమని చెప్తున్నారు.  

పాటలీవర్ణములో ఆ లలితాదేవి పద్మములో ప్రశాంతంగా కూర్చుని మెరిసిపోతున్నది.  

ఈ నామంలో అమ్మవారి దేహచ్ఛాయ గురించి తెలుసుకున్నాం. 

పాటలీవర్ణంలో అందముగా వెలిగిపోతున్న దేహచ్ఛాయలో వున్న, ఆ ఆరక్తవర్ణ కు వందనం.  

ఓం శ్రీ ఆరక్తవర్ణాయై నమః  


477. త్రిలోచనా

ఈ నామంలో ఆ విశుద్ధిచక్రనిలయకు మూడుకన్నులున్నవని చెప్పుకుంటున్నాం. 

అమ్మ త్రయీమయి కదా. ముచ్చటైన మూడుకన్నులతో ఈ సృష్టిని అంతా చూస్తూ, 

అన్ని కార్యాలూ పర్యవేక్షిస్తోంది. ఆ మూడు కన్నులే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. 

ఏమి చూడాలన్నా కాంతి కావాలి కదా. అమ్మ మూడు కన్నులూ మూడు కాంతి స్రోతస్సులు. 

కన్నులకు ఆ కాంతి ప్రవాహాన్ని ఇచ్చింది శ్రీలలితాపరమేశ్వరియే. 

అసలైన కాంతి జనకమైన ఆ కాంతిమతి, తన కిరణాలను సూర్య, చంద్ర, అగ్నుల ద్వారా 

ప్రసరిస్తోంది. ఆ మూడు కన్నులూ ఋగ్యజుర్సామ వేదాలకు ప్రతీక.  

ప్రతి జీవికీ కూడా మూడు కన్నులు ఉంటాయి, ఆ కన్నులను వాడటం తెలుసుకోవాలి, అంతే . 

మూడు కన్నులతో ఈ సృష్టి కంతటికీ కాంతిని ప్రసారం చేస్తున్న, ఆ త్రిలోచన కు వందనం. 

ఓం శ్రీ త్రిలోచనాయై నమః  


478. ఖట్వాంగాదిప్రహరణా 

ట్వాంగము అంటే మంచం కోడు. శివుని ఆయుధాలలో ఒకటి. 

ట్వాంగము వెన్నెముక మీద ఉంచిన కపాలము వలె ఉంటుంది. 

అదే ఆయుధముగా ఆ శ్రీ లలిత ఒక చేతిలో పట్టుకుని వున్నది. 

మిగిలిన మూడు చేతులలో, ఖడ్గము, త్రిశూలము, చర్మము పట్టుకుని ఉంటుంది. 

ప్రతి మానవునిలో ఈ ఖట్వాంగము ఉన్నది. ఆ ట్వాంగమును నడిపించేది అమ్మే. 

ట్వాంగమును చేతిలో ఆయుధము వలె ధరించిన, ఆ ఖట్వాంగాదిప్రహరణ కి వందనం. 

ఓం శ్రీ ఖట్వాంగాదిప్రహరణాయై నమః 

  

479. వదనైకసమన్వితా

వదనైక సమన్వితా అంటే, ఏక వదనంతో వున్నది అని అర్ధం. 

విశుద్ధిచక్రనిలయ కు ఒకే ముఖము. ఆ అందమైన ముఖంతో, అమితమైన తేజస్సుతో 

వున్న లలితాదేవిని  గురించి ఈ నామంలో చెప్పుకుంటున్నాం. 

ప్రతివారి ముఖంలోనూ తేజో రూపములో వున్నది ఆ వదనైకసమన్విత యైన శ్రీ లలిత. 

అందంగా అమరివున్న ఒక్క ముఖమును కలిగివున్న, ఆ వదనైకసమన్విత కు వందనం. 

ఓం శ్రీ వదనైకసమన్వితాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

28, అక్టోబర్ 2021, గురువారం

97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోవస్థా వివర్జితా సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ

 

వజ్రేశ్వరీ, వామదేవీ, వయోవస్థా వివర్జితా 
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥

468. వజ్రేశ్వరీ 

షష్టీ తిథి నిత్యాదేవి పేరు మహావజ్రేశ్వరి. జాలంధర పీఠాధిష్టాన దేవత వజ్రేశ్వరి. 

మణిద్వీపములో వున్న శ్రీపురంలో అనేక రత్నమయ ప్రాకారాలున్నాయి. 

వాటిల్లో పదకొండవది వైడూర్యములచే నిర్మింపబడిన వైడూర్యమయ ప్రాకారము. 

పన్నెండవ ప్రాకారము పూర్తిగా వజ్రములతో నిర్మింపబడింది. వజ్రమయము. 

ఈ రెండు ప్రాకారముల మధ్యా వజ్ర అనే నది వుంది. ఈ వజ్రను దాటటం ఒక సిద్ధి. 

ఆంజనేయుడికి కల సిద్ధులలో వజ్రసిద్ధి కూడా ఒకటి. ఆతని దేహమే ఒక వజ్ర కవచం. 

అందుకే ఆంజనేయుడికి వజ్రాంగ బలీ,  బజరంగ బలీ అనే నామం వచ్చింది. 

ఆ వజ్రానదిలో రాజహంసలు తిరుగాడుతూ ఉంటాయి. వజ్రేశ్వరి ఆ వజ్రానదికి అధీశ్వరి. 

ఆ నది ఒడ్డునే వజ్రాభరణములను ధరించి వజ్రేశీ నామముతో వున్న దేవియే వజ్రేశ్వరి. 

ఈ దేవియే ఇంద్రునికి వజ్రాయుధము ఇచ్చింది అని బ్రహ్మాండపురాణంలో వున్నది. 

నేటికీ హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా వాలీలో వున్న దేవత పేరు వజ్రేశ్వరీ. 

యాభైఒక్క శక్తిపీఠాల్లో ఇదీ ఒకటి. అక్కడ సతీదేవి ఎడమ వక్షోజము పడినదని చెప్తారు. 

జలంధరుని సంహరించిన ప్రదేశము కనుక, ఈ ప్రాంతానికి జాలంధరపీఠము అని కూడా పేరు.  

జాలంధర పీఠాధి దేవత, వజ్రమయ ప్రాకారాధీశ్వరి, ఆ వజ్రేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ వజ్రేశ్వర్యై నమః  


469. వామదేవీ 

వామదేవుడని శివుడికి పేరు. ఆ వామదేవుడి పత్నిగా అమ్మవారికి వామదేవీ అనే నామం వచ్చింది. 

శివ పంచానన స్తోత్రంలో శివుడికి సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అనే 

అయిదు పేర్లు ఉన్నాయని చెప్పారు. వాటిలో వామదేవుడు జలతత్వంతో, ఉత్తరముఖంలో 

ఉంటూ స్థితి కార్యమును చేస్తూ ఉంటాడు. ఆ వామదేవుని పత్ని వామదేవీ. 

పరమశివుని వామ భాగంలో ప్రకాశించే దేవి వామదేవీ. వామదేవి అంటే అందమైనది అని అర్ధం.

వామదేవుడంటే అందరి చేతా నమస్కరింపదగినవాడు అని అర్ధం. 

కర్మఫలములను ఇచ్చునది వామదేవి. వామాచారంలో చేసే పూజలను స్వీకరించు దేవి. 

కాళికా పురాణంలో వామాచారపరులకు కూడా వామ శబ్దం వర్తిస్తుందని చెప్పారు. 

వామాచారము నందు ఆసక్తి కలవారు వాములు. 

దేవీపురాణంలో "విరుద్ధమైన దానిని, విపరీతమైన దానిని వామాచారము" అని చెప్పారు. 

వామాచారులచే పూజలందుకొని, వారికి సుఖములు ఇచ్చు, ఆ వామదేవి కి వందనం.  

ఓం శ్రీ వామదేవ్యై నమః  


470. వయోవస్థావివర్జితా

వయోవస్థలు అంటే బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య అవస్థలు. 

శ్రీ మాత సర్వకాల సర్వావస్థ లందు వుండు జగన్మాత కనుక, ఆ తల్లి సనాతని. 

శ్రీలలిత నిత్యాషోడశికారూపా, కనుక, ఎప్పుడూ పదహారేళ్ళ ప్రాయంలో వుంటుంది. 

శుద్ధ జ్ఞాన స్వరూపము కనుక, అమ్మ ఎప్పుడూ చైతన్య స్వరూపమే

ప్రళయకాలము లోనూ వుండు నిత్యముక్త కనుక, అమ్మ ప్రజ్ఞ ఎప్పుడూ తగ్గదు. 

ప్రజ్ఞతో ప్రకాశించు మహా చైతన్యము కనుక, ఆ తల్లి వయోవస్థావివర్జితా. 

సదా పదహారేళ్ళ ప్రాయముతో తేజరిల్లే, ఆ వయోవస్థావివర్జిత కు వందనం. 

ఓం శ్రీ వయోవస్థావివర్జితాయై నమః  


471. సిద్ధేశ్వరీ

సిద్ధులకు ఈశ్వరి కనుక, అమ్మవారిని సిద్ధేశ్వరీ అని ఈ నామంలో అంటున్నాం. 

గోరఖ్ నాథ్ అని పిలువబడే గోరక్షనాథుని వంటి సిద్ధులకు ఆరాధ్యదేవత, కనుక సిద్ధేశ్వరీ. 

గోసేవ చేసేవారిచే పూజింపబడే దేవత సిద్ధేశ్వరీ. మంత్ర సిద్ధిని కలిగించేది సిద్ధేశ్వరీ. 

కాశీలో సిద్ధేశ్వరీ అనే దేవత వున్నది. సిద్ధులకు అధీశ్వరి సిద్ధేశ్వరీ. 

శ్రీచక్ర ప్రథమావరణంలో వున్న అణిమాది అష్టసిద్ధులకు అధీశ్వరి ఈ మాతే. 

సరియైన నియమాలు పాటిస్తూ మంత్రమో, తంత్రమో చేస్తే, ఫలిస్తుంది కనుక సిద్ధి వస్తుంది.

సిద్ధి ముందు ఫలించినట్టు కనిపించినా, అవసరమైనప్పుడు పనికి రాక పోవడం కూడా 

కొందరి పట్ల జరుగుతుంది. కానీ యోగము లేకపోతే సిద్ధి పొందినప్పటికీ ఆ సిద్ధి ఉపయోగపడదు. 

అసురులకు, దుష్టులకు దొరికిన సిద్ధులన్నీ అటువంటివే. 

అబద్ధము చెప్పి విద్య పొందినందు వలన కర్ణుడు వంటి దానశీలికి కూడా మంత్రము 

సమయానికి పని చెయ్యలేదు. అర్జునునికి కూడా మంత్రాలన్నీ శ్రీకృష్ణుడు పక్కన 

ఉన్నంత వరకే పనిచేసాయి. మంత్రాలన్నీ నారాయణుడి అధీనం కదా. 

తమిళనాడులో వున్న కుర్తాలంలో సిద్ధేశ్వరీ పీఠం వుంది. ఆ పీఠాధీశ్వరి సిద్ధేశ్వరీ. 

సిద్ధులన్నీ సాధించిన, సిద్ధులకు మాత్రమే ఆ పీఠాన్ని అధిష్టించే అర్హత ఉంటుంది. 

సిద్ధుల చేత ఉపాసింపబడే దేవత, ఆ సిద్ధేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ సిద్ధేశ్వర్యై నమః 

  

472. సిద్ధవిద్యా

సిద్ధిని కలిగించే మంత్రరూపిణి. సిద్ధిని ఇచ్చే విద్యా స్వరూపిణి, శ్రీవిద్యా స్వరూపిణి, ఆ శ్రీ మాత. 

అందుకే ఈ నామంలో ఆ లలితాపరమేశ్వరిని సిద్ధవిద్యా అంటున్నాం. 

నిత్యా మంత్రాలన్నీ సిద్ధ మంత్రాలే. సిద్ధిని కలిగించు మంత్రాలకు సిద్ధవిద్యలని పేరు. 

పంచదశీ విద్య కూడా సిద్ధవిద్యయే. కనుక పంచదశీ మంత్రము కూడా సిద్ధమంత్రమే. 

ఏదైనా మంత్రం ఉపాసన చేయవచ్చునా లేదా అనేది సిద్దారి చక్ర శోధన చేసి తెలుసుకుంటారు.

ఫలితాన్ని బట్టీ వారికి ఆ మంత్రం మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, తటస్థమా అని చెప్తారు.  

పంచదశీ మంత్రం సిద్ధవిద్య కనుక, ఆ మంత్రం తీసుకునే ముందు సిద్దారి చక్ర శోధన 

చేయవలసిన అవసరం లేదు. కానీ ఏమంత్రమైనా తప్పనిసరిగా గురుముఖతః తీసుకోవాలి. 

అప్పుడే అది మంత్రమౌతుంది. లేకపోతే కొన్ని అక్షరముల సముదాయమౌతుంది. 

మంత్ర దీక్ష తీసుకుని ఉపాసన చేయాలనుకునే ఉత్సాహపరులు ఈ విషయం గ్రహించాలి.  

నేడు చాలామంది రహస్యమైన లలితా సహస్రనామ పారాయణము చేస్తున్నారంటే, 

వారు పూర్వ జన్మలలో ఆ దీక్ష పొంది ఉంటారని అర్ధం చేసుకోవాలి. 

సిద్ధిని ఇచ్చే విద్యాధిదేవత అయిన, ఆ సిద్ధవిద్య కు వందనం. 

ఓం శ్రీ సిద్ధవిద్యాయై నమః 


473. సిద్ధమాతా 

సిద్ధులకు తల్లి. తల్లి వలె సిద్ధులను సంరక్షించునది అని అర్ధం. 

మంత్ర సిద్ధి పొందిన వారిని, కాపాడే మంత్రాధిదేవత శ్రీ లలిత. 

పుట్టుక నుంచే సిద్ధులైన వారు బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనత్సుజాత,

సనత్కుమారులు. వీరు బాల్యము నుండియే సిద్ధులు. కనుక వయోవస్థావివర్జితులు. 

నిత్యమూ బాలుర వలెనే వుంటారు. ఆనంద స్వరూపులు. బ్రహ్మానందాన్ని పొందిన సిద్ధులు.  

వీరే వైకుంఠ ద్వార పాలకులైన జయవిజయులకు జన్మలెత్తమని  శాపం పెట్టింది. 

సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా అనే ఈ మూడు నామాలలో ఆ లలితాపరమేశ్వరిని 

అష్టసిద్ధులకే కాక అన్ని సిద్ధులకూ ఈశ్వరి, సిద్ధవిద్య లన్నింటికీ అధిదేవత, 

ఉపాసన చేసే సిద్ధులందరికీ మాత అని కీర్తిస్తున్నాం. 

సిద్ధి పొందినవారికి, సిద్ధిని పొందగోరి ఉపాసన చేసేవారికీ  కూడా ఉపాస్యదేవత అయిన,

ఆ సిద్ధమాత కు వందనం. 

ఓం శ్రీ సిద్ధమాత్రే నమః 


474. యశస్వినీ 

యశస్సు అంటే కీర్తి. లలితాదేవిని ఈ నామంలో గొప్ప కీర్తి కలది అని ప్రస్తుతిస్తున్నాం. 

వేదములో భగవన్నామమే గొప్ప యశస్సు అని చెప్పారు. నామాన్ని చెప్పటమే కీర్తి అయితే, 

ఆ తల్లి యశస్వినీ కదా. మూర్ఖుడైన కాళిదాసుకు అమ్మ నామం చెప్పటం వలననే కదా, 

విద్యా సిద్ధి కలిగి, భోజుని ఆస్థానంలో స్థానం పొంది, నవరత్నాలలో ఒకడై, గొప్ప యశస్సు

సంపాదించాడు. కాళిదాసు అయ్యాడు.  

తెనాలి నుంచి వచ్చిన రామకృష్ణుడు, ఆ అమ్మ కృప వలననే కదా, ఆంధ్ర భోజుడని

పిలువబడే, శ్రీ కృష్ణ దేవరాయల వంటి గొప్ప రాజు వద్ద ఆశ్రయం పొంది,

అష్ట దిగ్గజాలలో ఒకడై, భువనవిజయంలో గొప్ప పేరు పొందాడు. 

ఆ సిద్ధేశ్వరి కరుణిస్తే, ఆ శుద్ధవిద్య సిద్ధిస్తే, ఆ సిద్ధమాత ఆశీర్వదిస్తే, యశస్వి అవటం తథ్యం. 

తనను ఉపాసించే వారికి కీర్తి ప్రతిష్టలు ప్రసాదిస్తున్న, ఆ యశస్విని కి వందనం. 

ఓం శ్రీ యశస్విన్యై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

27, అక్టోబర్ 2021, బుధవారం

96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ

 

సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా 
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥

459. సుముఖీ 

సుముఖీ అంటే అందమైన చక్కని ముఖము కలది అని అర్ధం. 

సుముఖీ అంటే, ఆ ముఖం అందంగా ఉండాలి. తేజస్సుతో వెలగాలి. 

కోటి సూర్యుల వర్ఛస్సుతో ప్రభలు వెదజల్లాలి. మహారాజ్ఞి కనుక రాజసం భాసించాలి.  

జ్ఞాన ప్రకాశం ప్రస్ఫుటంగా కనపడాలి. ప్రసన్నంగా ఉండాలి. కారుణ్యంతో నిండాలి. 

ప్రజ్ఞతో మెరవాలి. ఆకర్షణీయంగా ఉండాలి. అమ్మ కనుక మాతృత్వం ప్రతిఫలించాలి. 

దైత్యదమనీ కనుక అసురులకు భయం కలిగించాలి. శిష్టులకు ధైర్యం కలిగించాలి. 

నుదురు అష్టమి చంద్రుడిలా ఉండాలి. కన్నులు మీనాల వలె ఉండాలి. 

కనుబొమ్మలు మన్మధ చాపంలా ఉండాలి. ఆ మధ్యలో కస్తూరీ తిలకం చక్కగా దిద్దబడి ఉండాలి. 

చెవులకున్న తాటంకాలు సూర్యచంద్రుల్లా ధగద్ధగాయమానంగా వెలిగిపోతూ ఉండాలి. 

కురులు సువాసనతో పరిమళించాలి. నాసిక సంపెంగ వలె సూటిగా ఉండాలి. 

చెక్కిళ్ళు దర్పణాలు వలె మెరుస్తూ ఉండాలి. పెదవులు దొండపండ్ల వలే ఎర్రగా ఉండాలి. 

శుద్ధ జ్ఞాన విద్యను అందించే ద్విజపంక్తి అమరి ఉండాలి. నములుతున్న 

కర్పూర తాంబూలపు సుగంధం గుబాళించాలి, భక్తులు ఆ తాంబూలపు ప్రసాదాన్ని కోరాలి. 

ఎవ్వరితో పోల్చలేని అపురూపమైన, అనుపమానమైన చుబుకం ఠీవిగా కనబడాలి. 

ఇన్ని లక్షణాలున్న లలితా త్రిపురసుందరి సుముఖీ అని కీర్తించబడుతోంది.  

ఇన్ని విశేషాలతో ప్రకాశించే  చక్కని ముఖం కలిగిన, ఆ సుముఖీ కి వందనం. 

ఓం శ్రీ సుముఖ్యై నమః  


460. నళినీ

నళినీ అంటే పద్మాల సమూహము, తామరకొలను. అమ్మ నిజంగా పద్మాల సమూహమే కదా. 

కన్నులు పద్మముల వంటివి. కమలాక్షి, నళినాక్షి, పద్మాక్షి, అంబుజాక్షి ఆ త్రిపురసుందరి. 

చేతులు కమలాల వంటివి. ఆ కరకమలాలతోనే కదా భక్తులకు వరములు, అభయము యిస్తోంది.

చరణములు కమలముల వంటివి. ఆ చరణ కమలాలను కదా ఉపాసకులు సదా ధ్యానిస్తున్నది. 

అసలు అమ్మ ముఖమే పద్మము. ఆ ముఖారవిందమును చూసి ముగ్ధులయ్యే కదా,  

ఆ దేవీ ముఖాన్నే నిరంతరం తలుస్తూ, భక్తబృందం సేవిస్తున్నది. 

ఆ లలితాదేవి ఒక పద్మముల రాశి వలె, అందరికీ ఆనందాన్నీ, అభయాన్నీ ఇస్తున్నది. 

అశ్వహృదయం, అక్షహృదయం తెలిసిన నల చక్రవర్తి చేత సేవింపబడినది, కనుక నలినీ. 

ముచ్చటైన తామరకొలను వంటి, ఆ నళిని కి వందనం.  

ఓం శ్రీ నళిన్యై నమః  


461. సుభ్రూః

సు అంటే చక్కని, భ్రూ అంటే కనుబొమ్మలు కలిగిన దేవత అని అర్ధం. 

అందమైన తీర్చిదిద్దిన కనుబొమ్మలు కలది శ్రీలలితాదేవి అని చెప్పుకుంటున్నాం. 

శంకరభగవత్పాదులు సౌందర్యలహరిలో ఈ కనుబొమ్మలను మన్మధుని ఇక్షుకోదండంతో 

పోల్చాడు. ముందే చెప్పుకున్నాం, అష్టమీ చంద్రుడు లాగా అమ్మవారి లలాటం ఉన్నదని.   

అమ్మవారి కనుబొమ్మలు మన్మధుని ఇంటి వాకిలి తోరణం వలె ఉన్నవని.  

ఆ భృకుటి పై కస్తూరీ తిలకం, అమ్మకు చిన్న దిష్టి చుక్క వలె భాసిస్తూ ఉన్నదని. 

ఆ కనుబొమ్మల కింద వున్న కళ్లు, మహాప్రవాహంలో అటు ఇటు చకచకా పారిపోయే చేపల్లా 

ఉన్నవని. ధ్యానమును భృకుటి కేంద్రముగా చేస్తే, మంచి ఫలితం ఉంటుంది. 

భృకుటిని చూస్తూనే జీవుడి ప్రజ్ఞ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. 

భృకుటిని ఎప్పటికప్పుడు గంధము, కుంకుమ, విభూతి వంటి వాటితో అలంకరించాలి. 

మన ఇంటి వాకిలి తోరణాన్ని ఎంత అందంగా అలంకరిస్తామో, భృకుటిని కూడా 

అంత చక్కగా అలంకరించాలి. భృకుటిపై వ్యక్తమయే జ్ఞానకాంతితో ఉపాసకుని స్థితి తెలుస్తుంది.  

అంతటి అందమైన అపురూపమైన కనుబొమ్మలు కల, ఆ సుభ్రూ కు వందనం. 

ఓం శ్రీ సుభ్రువే నమః  


462. శోభనా

శోభనా అంటే అందమైనది. శోభాయమానంగా ఉండునది, కాంతితో శోభస్కరంగా ఉండునది. 

లలితాపరమేశ్వరి సహజ సిద్ధమైన సౌందర్యముతో మనోజ్ఞంగా ప్రకాశిస్తూ ఉంటుంది. 

సుఖములు, సౌకర్యములు, సంపదలు, సేవకులు, సంతానము, సౌందర్యము, స్నేహితులతో 

సుసంపన్నంగా ఉండేవారి శోభ బహు గొప్పది. ఎన్ని వున్నా అసలైన శోభ సంతృప్తే.

వైభవమును కలిగివుండటం శోభ. భోగాన్ని అనుభవించటం కూడా శోభే. 

శ్రీదేవిని శోభనా రూపంలో, శోభనా నామంతో పూజిస్తే సకల శుభాలూ, శోభలూ ఒనగూడుతాయి. 

మహిషాసురుని వధించటం కోసం దేవతలందరూ ఒకచోట చేరి, ఆ పరమేశ్వరికి తమందరి

తేజస్సూ, శక్తీ, ఆయుధాలూ సమర్పించారు. ఆ సకలదేవతాశక్తికి శోభన అని పేరు.  

సకల దేవతా తేజస్సుతో వెలిగిపోతున్న, ఆర్యాణి, మహిషాసురమర్ధిని, ఆ శోభన కు వందనం. 

ఓం శ్రీ శోభనాయై నమః 

  

463. సురనాయికా

సురనాయికా అంటే దేవతలకు నాయకత్వము వహించేది అని అర్ధం. 

సురాపానం చేసిన వారు సురులు. వారు అమృతం తాగినందు వలన అమరులు. 

వారిపై అసురులు దాడి చేసినపుడు, దేవతా సంరక్షణార్థం తాను నాయికయై, నడుం బిగించి 

అసురులతో తలపడేది సురనాయికా అనబడే మహాశక్తి, లలితా పరమేశ్వరి. 

దేవతలను సృష్టించిన మహాదేవి సురనాయిక. అసురులను కూడా అమ్మే సృష్టించింది. 

అయినప్పటికీ దుష్టు పనులు చేసే అసురులను అడ్డుకొని, సురులను రక్షించునది కనుక. 

అమ్మవారికి సురనాయికా అనే నామం సార్ధకమైంది. 

ఎప్పుడు దేవతలకు కష్టం వచ్చినా, వారి పక్షాన నిలిచి, వారిని సంరక్షించే దుర్గాదేవి. 

శిష్టులైన దేవతల పక్షాన నాయికగా నిలిచి ధర్మ ప్రతిష్ఠాపన చేసే, ఆ సురనాయిక కు వందనం. 

ఓం శ్రీ సురనాయికాయై నమః 


464. కాలకంఠీ 

కలకంఠీ అని భావిస్తే, మధురమైన గళం గలది, అని అర్ధం. 

లలితాదేవి మధురమైన కంఠం విని, సరస్వతి సిగ్గుపడి తన కచ్ఛపీ వీణపై ముసుగు కప్పి,

గానం ఆపివేసింది అని ఆదిశంకరాచార్యుడు సౌందర్యలహరిలో చెప్తాడు. అమ్మవారు కలకంఠి. 

కాలకంఠీ అని భావిస్తే, నల్లని కంఠము కలది. కాలకంఠుడంటే హరుడు. ఆతని పత్ని కాలకంఠీ. 

లింగపురాణంలో దారుకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి పరమశివుడే  నల్లని 

కంఠము కల కాళికను, సృష్టించాడని వున్నది. ఆ దేవతే కాలకంఠీ. 

దేవీ పురాణంలో కాలంజర తీర్థంలో వున్న దేవతలు కాలకంఠుడు, కాలకంఠి అని చెప్పబడింది. 

విషము త్రాగిన కాలకంఠుని అర్ధ భాగమైన, ఆ కాలకంఠి కి వందనం. 

ఓం శ్రీ కాలకంఠ్యై నమః 


465. కాంతిమతీ 

కాంతిమతీ అంటే బృహత్ కాంతితో వెలుగొందునది అని అర్ధం. 

పరమేశ్వరి అంటే కాంతి కలిగినది, కాంతి పెంచునది, కాంతి పంచునది.  

కాంతి స్వరూపిణి అయిన జగదాంబ చంద్రార్కవైశ్వానరతారకాగ్రహములకు కూడా కాంతిని

ఇస్తుంది. ప్రతి జీవిలోనూ వున్న కళాకాంతీ ఆ జగజ్జననివే. 

చంద్రునికి కళలున్నాయని అనుకుంటున్నాం కానీ, ఆ కళలు భూమి వరకే పరిమితం. 

అసలు చంద్రునికి కళలే లేవు. భూమి, సూర్యుడు, చంద్రుడు పరస్పరంగా వున్న కోణాలను 

అనుసరించి చంద్రకళలు మారుతూ ఉంటాయి. అందుకే గ్రహణాలూ వస్తాయి. 

అమ్మ ఎప్పుడు ఎవరికి ఎంత కాంతిని ఇవ్వాలో చూచుకొని, అంత కాంతిని అందిస్తూ ఉంటుంది.

'చంద్రమా మనసో జాతః' అంటాం. మనస్సుని బట్టే, ముఖంలో కళ. 

అందుకే వాటిని కళాకళలు అంటాం. కాంతిని బట్టీ కళ. ఆ కళా, కాంతి అమ్మ ప్రసాదం. 

సృష్టి అంతటికీ ఏకైక కాంతి జనకమైన, ఆ కాంతిమతి కి వందనం. 

ఓం శ్రీ కాంతిమత్యై నమః 


466.  క్షోభిణీ 

క్షోభిణీ అంటే సంచలనము, వ్యాకులము, కదలిక, కలత కలిగించేది అని అర్ధం. 

సృష్టి చేయాలనే క్షోభ కలిగి అమ్మ తన నుంచి అనేకానేక దేవీ స్వరూపాలను సృష్టి చేసింది. 

విష్ణు పురాణంలో హరి, ప్రకృతి, పురుషుల యందు ప్రవేశించి వారికి క్షోభ, కదలికను కలిగించి 

సృష్టికార్యమునకు ఉద్యుక్తులను చేసాడని చెప్పారు. 

వరాహపురాణంలో, "వైష్ణవి మనసు క్షోభించి, కలత పడి, చాలాకాలం తపస్సులో  

ఉండిపోయింది. అప్పుడు ఆ క్షోభ నుంచి ఎందరో సుందరమైన, చక్కని లక్షణములు 

కల దేవతా స్త్రీలు ఉద్భవించారు" అని వుంది. 

సతీ వియోగం వల్ల కలిగిన క్షోభ, కలతతో పరమశివుడు హిమాలయాలను చేరి తపస్సు 

మొదలుపెట్టాడు. పార్వతికి క్షోభ, దుఃఖం కలిగి, తపస్సులో వున్న శివుడికి క్షోభ, సంచలనం 

కలిగించి, పరిణయమాడింది. వారిద్దరికీ కలిగిన క్షోభ, కదలిక వలన ఈ సమస్త సృష్టీ 

ప్రాణం పోసుకుంది. లోకాలోకాలు, స్థావర జంగమాలూ ఏర్పడ్డాయి. 

తనకు కలిగిన మనఃక్షోభ వలన, కామేశునితో కలసి సృష్టికార్యము చేపట్టిన, ఆ  క్షోభిణి కి వందనం. 

ఓం శ్రీ క్షోభిణ్యై నమః


467. సూక్ష్మరూపిణీ 

సూక్ష్మమైనది సూక్ష్మరూపిణీ. తెలియలేనంత, తెలియరానంత సూక్షమైనది ఆ పరమేశ్వరీ

తత్వము. ఆత్మ తత్వము పరమ సూక్ష్మమైనది అని శృతులలో కూడా చెప్పబడింది. 

ఆత్మ "అణువులలో అణువు, మహములలో మహము, జీవునిలో గోప్యము" అని కఠోపనిషత్ లో 

చెప్పారు. అదీ ఆత్మ తత్వం. అదే అమ్మ తత్వం. 

సీత వ్యక్తిత్వాన్ని గురించి చెప్తూ, "అణోరణీయాం, మహతో మహీయాం", అంటాడు వాల్మీకి. 

శ్రీదేవి సూక్షము అనే హోమ స్వరూపురాలు అని కూడా అర్ధం. మూలాధారం నందు వెలిగే 

అగ్నితో పన్నెండు విధములుగా చేసే హోమానికి సూక్ష్మము అని పేరు. 

అమ్మవారికి వున్న అనేక శరీరాలలో ఒకటి సూక్ష్మశరీరము అని కూడా చెప్పుకున్నాం. 

తేలికగా, ఏ ఉపాసకునికీ దొరకనంత, సూక్ష్మమైన రూపము కల, ఆ  సూక్ష్మరూపిణి కి వందనం. 

ఓం శ్రీ సూక్ష్మరూపిణ్యై నమః


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650