కామ్యా, కామకలారూపా, కదంబ కుసుమప్రియా
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥
321. కామ్యా
ఓం శ్రీ కామ్యాయై నమః
322. కామకలారూపా
ఈ నామానికి కామకళారూపా అనే నామాంతరం కూడా వుంది.
ఈ రూపానికే కామాఖ్యా అని పేరు. ఈ తల్లి పంచదశీ స్వరూపురాలు.
కలాపము అంటే వడ్డాణము అని అర్ధం.
ఈ నామానికి వడ్డాణము ధరించిన రతీ స్వరూపురాలు అని అర్ధం.
కలాపము అంటే నెమలిపురి అని కూడా అర్ధం. కామకళలో నెమలి వంటిది అని భావం.
శివపార్వతుల ఏకరూపాన్నే కామకల అంటారు.
సృష్టిలో ప్రకృతి, పురుషుడు ఇద్దరూ ఎప్పుడూ ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతూనే వుంటారు.
ప్రకృతి చంద్రుడైతే, పురుషుడు సూర్యుడు.
సూర్యుని నుంచి కళలను తీసుకుని చంద్రుని రూపంలో భూమిని పోషిస్తూ ఉంటుంది ప్రకృతి.
ప్రకృతికి పురుషుడు కామ్య అయితే, పురుషుడికి ప్రకృతి కామ్య.
ఈ ఇద్దరి అనుసంధానమే కామకలారూపము. శివునితో చేరిన పార్వతి రూపమే ఇది.
శివునితో కామములను కోరి వచ్చినది కనుక ఈ రూపాన్నే కామాఖ్యా అంటాము.
శివపార్వతుల సంగమ రూపమైన, ఆ కామకలారూప కు వందనం.
ఓం శ్రీ కామకలారూపాయై నమః
323. కదంబ కుసుమప్రియా
కదంబకుసుమాలంటే ఆ లలితామాతకు ఎంతో ఇష్టం.
కదంబకుసుమప్రియ కనుక, ఆ తల్లి కదంబవనవాసిని అయింది.
కదంబపుష్పం సువాసనలు ప్రసరిస్తూ, గోళాకారంలో చేతి నిండుగా ఉంటుంది.
కదంబపుష్పాలు ముందు పసుపు రంగులో వుండి, వికసిస్తున్న కొద్దీ ఎరుపు అంటే
సిందూరవర్ణం లోకి మారతాయి. ఆ శ్రీలలితకు ఈ రంగులు ఇష్టం.
అందుకే ఆ తల్లి పసుపు, కుంకుమలతో, సిందూరముతో అర్చిస్తే ప్రసన్నురాలవుతుంది.
ఈ పువ్వుల వంటి పువ్వులు ఎక్కడా లేవు. సువాసనతో కూడిన సుందరమైన పుష్పం ఇది.
కదంబపుష్పాలు ప్రత్యేకమైన గోళాకారంతో, పసుపు, కాషాయ వర్ణంతో వుంటూ,
కేసరములు తెల్లగా పైన చుట్టూ చేరి రక్షణ కల్పిస్తూ ఉంటే, బంతి వలె మృదువుగా ఉంటాయి.
కదంబపువ్వుల పట్ల ప్రీతి కలిగిన, ఆ కదంబకుసుమప్రియ కు వందనం.
ఓం శ్రీ కదంబకుసుమప్రియాయై నమః
ఓం శ్రీ కల్యాణ్యై నమః
325. జగతీకందా
జగతీకందా అంటే, జగత్తుకు మూలమైన సృష్టి శక్తి అని అర్ధం.
కంద అంటే దుంప, అంటే మూలము. ఈ కంద దుంప నుంచే మొక్క వస్తుంది.
ఆ దుంపే బీజము, ఫలము కూడా. దుంపను, కంద ముక్కను, భూమిలో పాతితే, దాని నుంచి
మొలక వచ్చి, మొక్క భూమి పైన పెరిగితే, దుంప మాత్రం భూమిలోనే పెరుగుతుంది.
ఇతర శాకముల వలె, కందగడ్డ పెరుగుదల పైకి కనిపించదు. భూమిలోనే వృద్ధి చెందుతుంది.
తిరిగి ఆ కంద గడ్డ ముక్కలు బీజముల వలె కూడా ఉపయోగపడతాయి.
కంద అంటేనే వంశము వృద్ధి చేసేది అని ఒక నమ్మకం.
అందుకే కొత్త పెళ్లికూతురు తొలిసారి మగనింట కాలుపెట్టేటప్పుడు, నడుముకి కట్టే సారె
మూటలో, ఒక కంద గడ్డ పిలకను వేసి పంపిస్తారు.
ఆ కంద దుంప పెరిగినట్టు, ఆ వంశం వృద్ధి చెందాలని దీవించి పంపిస్తారు.
భూమిలో కంద వలె, తల్లి కడుపులో శిశువు పైకి కనపడకుండా పెరుగుతుంది.
ఈ నామంలో అమ్మను జగతీకందా అని చెప్పటంలో, అమ్మ ఈ సమస్త జగత్తుకూ
కందమూలము వంటిది అని చెప్తున్నారు. ఆ జగన్మాత నుంచే కదా సృష్టి ప్రారంభం అయింది.
ఈ జగత్తుని ఎప్పుడూ నిత్య నూతనంగా సృష్టిస్తున్న, ఆ జగతీకంద కు వందనం.
ఓం శ్రీ జగతీకందాయై నమః
326. కరుణారస సాగరా
పూర్తిగా కరుణా రసంతో ఏర్పడిన సముద్రము వంటిది కరుణారససాగరా.
ఈ తల్లి కృప వలన, సమస్త సృష్టికీ కావలసినది అందుతోంది. దయాస్వరూపిణి ఈ శ్రీమాత.
అమ్మ దయకు ఎల్లలు లేవు. ఆ కరుణ వలన, మూర్ఖుడైన కాళిదాసుకు పాండిత్యం అబ్బింది.
ఈ జగన్మాత నామ జపం వలన సుదర్శనుడికి రాజ్యం లభించటమే కాకుండా,
కాశీరాజ పుత్రి శశికళ (చంద్రకళ) తో కళ్యాణం జరిగింది.
ఈ నామంలో అమ్మ కరుణను సాగరమంత విశాలమైనది అని చెప్పుకుంటున్నాం.
సగరపుత్రులు తవ్వినదే సాగరము. వారి ఉద్ధరణకై ఆకాశం నుంచి దిగివచ్చింది గంగ.
భగీరథుని ద్వారా దిగివచ్చిన గంగ, భాగీరథియై, సగర పుత్రులను పాతాళము నుంచి
ఉద్ధరించి, ఊర్ధ్వలోకములకు చేర్చింది. గంగా స్నానం పాపహరణం.
గంగ రూపంలో పైనుంచి దిగివచ్చి సగరపుత్రుల పాపాలు తుడిచింది ఈ శ్రీమాతే.
ఆ గంగలన్నీ చేరి సాగరము విసృతి పెరిగింది. అమ్మ కరుణ సాగరమంత గొప్పది.
భక్తులపై అపార సాగరమంత కరుణ చూపిస్తున్న, ఆ కరుణారససాగర కు వందనం.
ఓం శ్రీ కరుణారససాగరాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Chaalaa baagunnaayi
రిప్లయితొలగించండి