31, డిసెంబర్ 2021, శుక్రవారం

161. కార్యకారణనిర్ముక్తా, కామకేళీతరంగితా కనత్కనకతాటంకా, లీలావిగ్రహధారిణీ

 

కార్యకారణనిర్ముక్తా, కామకేళీతరంగితా ।
కనత్కనకతాటంకా, లీలావిగ్రహధారిణీ ॥ 161 ॥

862. కార్యకారణనిర్ముక్తా

కార్యము, కారణము రెండూ లేనిది, రెండూ విడిచినది అని ఈ నామానికి అర్ధం. 

శ్రీలలితకు కార్యమూ, కారణమూ రెండూ కూడా ఉండవు. అన్నీ స్వభావ సిద్ధంగా, సహజంగా 

జరిగిపోతూ వుంటాయి. కార్యములు అంటే, మహత్తత్త్వము మొదలైనవి. వీటన్నింటి కంటే 

ఉత్కృష్టమైనది శ్రీలలిత. కనుక అమ్మకు కార్యములను ఆపాదించలేము. 

కారణము స్వయంగా మూలప్రకృతియే. లలితాదేవి మూలప్రకృతి కన్నా అతీతమైన చైతన్యము. 

కనుక కారణమునకు అమ్మ కట్టుబడదు.  

వేదములో, "పరమాత్మకు కార్యమూ, కారణమూ రెండూ లేవు" అని చెప్పారు. 

కనుక కార్యమూ, కారణమూ రెండింటికీ కట్టుబడనిది, ఆ రెండింటి చేతా విడువబడినది శ్రీలలిత.  

అందుకే ఈ నామంలో అమ్మను కార్యకారణనిర్ముక్తా అంటున్నాం. 

కార్యమూ, కారణమూ రెండింటికీ కట్టుబడని, ఆ కార్యకారణనిర్ముక్త కు వందనం. 

ఓం శ్రీ కార్యకారణనిర్ముక్తాయై నమః  


863. కామకేళీతరంగితా

కామకేళీతరంగితా అంటే కామునితో కేళిలో ఓలలాడునది అని అర్ధం. 

కామేశ్వరి, కామేశ్వరుడు ఇద్దరూ కలసి చేసే కామకేళియే పంచకృత్యాలు. 

సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము, ఈ పంచకృత్యాలనూ కామేశ్వరునితో కూడి 

ఉల్లాసంగా, ఒక క్రీడ వలె, ప్రీతిగా నడుపుతూ, హాయిగా ఆనందించునది మహాకామేశ్వరి. 

అందుకే అమ్మను ఈ నామంలో కామకేళీ తరంగితా అంటున్నాం. 

కామేశ్వరునితో విలాసంగా, కేళీతరంగాలలో ఓలలాడే, ఆ కామకేళీతరంగిత కు వందనం.  

ఓం శ్రీ కామకేళీతరంగితాయై నమః  


864.  కనత్కనకతాటంకా

కనత్ అంటే ప్రకాశించటం. కనక తాటంకా అంటే బంగారు చెవి కమ్మలు. 

ప్రకృష్టంగా ప్రకాశిస్తున్న, బంగరు కర్ణ భూషణాలు ధరించిన దానా అని ఈ నామార్ధం. 

తాటంకాలు అంటే తాటి ఆకులతో చేసిన ఆభరణాలు. ఒకప్పుడు సులభంగా దొరికిన చెట్ల 

ఆకులతో ఆభరణాలు చేసుకుని అవే ధరించేవారు. తరువాతి కాలంలో పసిడి, రజతము వంటి 

శ్రేష్ఠ లోహాలతో చేసిన నగలు ధరిస్తున్నా, ఆనాటి తాటంకము వంటి కొన్ని పాత పేర్లు అలాగే 

నిలిచిపోయాయి. అంతే కానీ అమ్మ తాటియాకులతో చేసిన కమ్మలు ధరించిందని అర్ధం కాదు. 

అమ్మ తాటంకాలు ఎంత మహత్తైనవంటే, స్వయంగా సూర్య చంద్రులే చంటిపిల్లల వలె అమ్మ  

చెవులకెక్కి కూర్చున్నారు. సృష్టిలో అమ్మ తరువాత అంతగా ప్రకాశించేది సూర్య చంద్రులే కదా. 

ఇక ఆ చెవి కమ్మల ప్రకాశం గురించి ఎంత చెప్పుకుంటే వర్ణించగలం. 

అసలే సూర్యుడు, చంద్రుడు, ఆపైన సువర్ణముతో చేసిన కనక తాటంకాలు, కనత్, అంటే 

కన్నులు మిరుమిట్లు గొల్పేలా మెరుస్తున్నాయి. ఆ కనక తాటంకాలు ధరించిన అమ్మను గురించి 

ఈ నామంలో చెప్పుకుంటున్నాం. 

మహత్తరంగా మెరుస్తున్న, బంగారు చెవికమ్మలు ధరించిన, ఆ కనత్కనకతాటంకా కు వందనం. 

ఓం శ్రీ కనత్కనకతాటంకాయై నమః  


865. లీలావిగ్రహధారిణీ

లీలగా, అవలీలగా, కేళిగా, విలాసంగా అనేక అవతారములను ధరిస్తున్నది లీలావిగ్రహధారిణీ. 

ముందే చెప్పుకున్నాం, సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ రూపంలో, స్థితిని సంరక్షిస్తున్నపుడు 

గోవిందుడు వలె, సంహారము చేసే సమయంలో రుద్రుడు వలె, తిరోధానము చెయ్యటానికి  

ఈశ్వరుని రూపంలో, అనుగ్రహము చూపించేటప్పుడు సదాశివునిగా, అమ్మ పంచకృత్యాలను 

చేస్తూనే వుంది. ఒకసారి మోహిని వలె, వేరొకసారి కాళీ వలె రూపము ధరిస్తుంది. 

విద్యా రూపమూ ఆ తల్లే, అందుకే దశమహావిద్యలూ ఆ లలితాపరాభట్టారికయే. 

అవసరమైతే అణువూ తానే, మహత్తూ తానే. లలితామహాశక్తి అనాయాసంగా, క్షణకాలంలో 

ఒక క్రీడగా, సర్వరూపములలో వ్యక్తమవుతుంది. అందుకే ఈ నామం వచ్చింది.  

యోగవాశిష్ఠంలో పద్ముడనే రాజు భార్య పేరు లీలాదేవి అని వుంది. ఆ లీలాదేవి స్వరూపమే 

శ్రీమాత అని కూడా ఒక అర్ధం. 

లీలగా అనేక అవతారములు ధరించు, ఆ లీలావిగ్రహధారిణి కి వందనం. 

ఓం శ్రీ లీలావిగ్రహధారిణ్యై నమః 

  




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

       

30, డిసెంబర్ 2021, గురువారం

160. గంభీరా, గగనాంతఃస్థా, గర్వితా, గానలోలుపా కల్పనారహితా, కాష్ఠా, అకాంతా, కాంతార్ధ విగ్రహా

 

గంభీరా, గగనాంతఃస్థా, గర్వితా, గానలోలుపా 
కల్పనారహితా, కాష్ఠా, అకాంతా, కాంతార్ధవిగ్రహా ॥ 160 ॥

854. గంభీరా

గంభీరము అంటే నిఘంటువులో లోతైనది, అంతము లేనిది, హ్రదము అని అర్ధాలున్నాయి. 

అమ్మను ఈ నామంలో అంతము లేని లోతైన గంభీర ప్రవృత్తి కలది అని చెప్పుకుంటున్నాం. 

శివ సూత్రాలలో 'మహాహ్రదము, అనుసంధానము, మంత్రవీర్యము, అనుభవము' అనే నాలుగు 

పదాలు అమ్మను గురించి చెప్పారు. 

మహాహ్రదమంటే విమర్శరూపమైన పరాశక్తి. ఆ శక్తితో ఐక్యమే అనుసంధానం. మంత్రవీర్యము 

అంటే, పూర్ణహంత అనుభవము. 

విమర్శరూప పరాశక్తితో ఐక్యం అయితే, పూర్ణహంతానుభవం కలుగుతుంది అని ఈ నామార్ధం. 
 
కనుక ఈ నామంలో అమ్మను మహాహ్రదస్వరూపురాలుగా చెప్పుకుంటున్నాం. 

శివసూత్రములలోనే, ఇచ్ఛాశక్తియై జీవులందరి యందు నిర్మలంగా, గంభీరంగా ఉంటుంది అని 

వుంది. గం, భీ, రా అంటే గం-గణపతికి, భీ-భీతిని పోగొట్టునది అని కూడా అర్ధం వుంది.  

లోతైన,  నిర్మలమైన, గంభీరమైన, మహాహ్రదస్వరూపమైన, ఆ గంభీరా కు వందనం. 

ఓం శ్రీ  గంభీరాయై నమః  


855. గగనాంతఃస్థా

లలితాపరాభట్టారిక గగన మధ్యంలో వున్నది అని ఈ నామానికి అర్ధం. 

అనాహత చక్రం వద్ద గల దహరాకాశము మధ్యలో ఉన్నది. పరాకాశము మధ్యలో వున్నదీ శ్రీమాతే. 

పంచభూతాలలోని ఆకాశభూతము మధ్యలో ఉన్నది కనుక, అమ్మను పంచ మహాభూత బీజ 

స్వరూపురాలుగా కూడా కొలుస్తున్నాం. ఈ ఆకాశభూతము ప్రళయకాలంలో నశించిపోతుంది.

అయినప్పటికీ ఆ పరమేశ్వరి మాత్రం స్థిరంగా ఉంటుంది. 

భూతాకాశమైనా, దహరాకాశమైనా, పరాకాశమైనా, అన్ని ఆకాశాలకూ మధ్యలో ఉంటుంది శ్రీదేవి.  

య, ర, ల, వ అక్షరములని అంతస్థములు అంటాం. హ అనేది ఆకాశబీజం. 

ఈ "హ య ర ల వ" అనే గగన, అంతస్థముల మధ్యలో ఉండునది శ్రీమాత అని భావం . 

అంటే ఈ "హ య ర ల వ" అనే పంచభూత బీజాక్షరముల స్వరూపురాలు అని భావం. 

దహరాకాశము, పరాకాశము అనే గగనాల మధ్యలో వుండే, ఆ గగనాంతఃస్థ కు వందనం.  

ఓం శ్రీ గగనాంతఃస్థాయై నమః  


856. గర్వితా 

స్వాధిష్ఠానాంబుజగతా అయిన జగన్మాత సౌందర్యాతిశయము, స్వాభిమానము చేత 

అతిగర్వితయై వున్నది అని చెప్పుకున్నాం. 

శ్రీదేవి సకల సంపదలూ కలిగి గర్వాతిశయంతో వున్నది.  

విశ్వనిర్మాణం పరాహంతగా చక్కగా నిర్వహిస్తున్నాననే గర్వంతో వుంది. 

ఒక ఇల్లాలు తన చిన్న ఇంటిని చక్కదిద్దుకుంటేనే ఎంతో దర్పాన్ని ప్రదర్శిస్తుంది. 

అటువంటిది శ్రీమాత ఈ విశ్వాన్నే చక్కదిద్దుతోంది. 

తానొక్కర్తే మొత్తం భారాన్ని వహిస్తున్నానన్న అతిశయాన్ని కలిగివుంది. 

జగత్తులన్నీ తన అధీనంలో ఉన్నాయన్న గర్వంతో వున్నది. 

అందుకే అమ్మను ఈ నామంలో  గర్వితా అంటున్నాం. 

జగన్నిర్వహణను అద్భుతంగా జరుపుతున్న,  గర్విత కు వందనం. 

ఓం శ్రీ  గర్వితాయై నమః  


857. గానలోలుపా

గానమందు ఆసక్తి వున్నది కనుక, అమ్మను ఈ నామంలో గానలోలుపా అంటున్నాం. 

సాధారణంగా వాయిద్యాలు నాలుగు రకాలు. అవి వీణ, వాయులీనము వంటి తంత్రీ వాయిద్యాలు, 

ఢమరు, మద్దెల, ఢక్క వంటి చర్మ వాయిద్యాలు, వేణువు, సన్నాయి వంటి వాయు వాయిద్యాలు,
  
తాళము, కంజీర వంటి కంచు వాయిద్యాలు. ఈ నాలుగు రకములైన వాయిద్యాలతో కూడిన 

గానాన్ని ఇష్టపడుతుంది శ్రీలలిత. అమ్మ సామగానప్రియ. గాత్రము, వాయిద్యములతో కూడిన 

సామగానాన్ని ఆశగా, ఆనందంగా వింటుంది. గంధర్వ గానమంటే ఆసక్తి, ప్రీతి. 

అందుకే ఈ నామంలో ఆ శ్రీలలితను గానలోలుపా అంటున్నాం. 

వాద్యములతో కూడిన గానగోష్టిపై లోలత్వం చూపిస్తున్న,  గానలోలుప కు వందనం. 

ఓం శ్రీ గానలోలుపాయై నమః 

  

858. కల్పనారహితా

ఏ కల్పనలూ లేనిది కల్పనారహితా అనబడుతుంది. 

ఏ ప్రాపంచిక విషయవాసనాత్మక మయిన కల్పనలు లేనిది శ్రీమాత అని ఈ నామానికి అర్ధం. 

ప్రళయకాలంలో, సృష్టి, స్థితి కాలములలో కూడా, నరులకు హితము చేకూర్చుటకు, ఏ విషయ

వాసనా లేకుండా, వారిని తన యందు దాచుకుని సంరక్షిస్తుంది ఆ జగదీశ్వరి.   

అష్టావక్రగీతలో, " నేను అనంతమైన చైతన్య స్వరూపమును. జీవులన్నీ నా నుంచే 

ఉద్భవిస్తున్నాయి, నా లోనే తిరుగాడుతున్నాయి, నా లోనే కేళిస్తున్నాయి, రమిస్తున్నాయి, 

నశిస్తున్నాయి, నా లోనే తిరిగి ప్రవేశిస్తున్నాయి. ఈ కర్మలన్నీ స్వభావసహజంగా రుగుతూ 

వున్నాయి", అని వున్నది. 

కల్పిత ప్రాపంచిక వాసనల నుంచి జీవులను రక్షించు, ఆ కల్పనారహిత కు వందనం. 

ఓం శ్రీ కల్పనారహితాయై నమః 


859. కాష్ఠా

కాష్ఠ అంటే కాలానికి ఒక కొలమానం. కాష్ఠ అంటే పద్దెనిమిది నిమేషములు. 

పసుపు మొక్క యొక్క మాను స్వరూపురాలు కాష్ఠా. 

మైలారతంత్రంలో, కుమారస్వామి బొడ్డుతాడే, పసుపు మొక్క యొక్క కాండము అని, 

అందుకే ఆ పసుపు దారువు శివశక్త్మ్యాత్మకమనీ చెప్పారు. 

సూతసంహితలో, "ప్రతీతము, అప్రతీతము, సత్, అసత్ అన్నీ సదాశివుడే, వేదాంతము బోధించే 

తత్త్వమే కాష్ఠ", అని వుంది.  

శివుని అష్టమూర్తులలో, ఆకాశమూర్తి యైన భీముని భార్య దిక్స్వరూపురాలు, ఆమె పేరు కాష్ఠ.

కాలస్వరూపముగా జగత్తంతా వ్యాపించి వున్నది కాష్ఠ. 

పురుషసూక్తంలో అత్యతిష్ఠద్దశాంగుళం అంటాడు. అంటే కాలస్వరూపుడైన ఆ పరమాత్మను 

కొలవాలంటే, పదివేళ్ళూ చాలవు అని అర్ధం. అంతగా జగత్తంతా వ్యాపించి వున్న తత్త్వమే కాష్ఠా. 

శివశక్త్మ్యాత్మకమైన కాల స్వరూపురాలు, ఆ కాష్ఠా కు వందనం. 

ఓం శ్రీ కాష్ఠాయై నమః 


860. అకాంతా

అకము అంటే పాపము, దుఃఖము అని అర్ధాలు. అకమును అంతం చేసేది అకాంతా. 

తనను ఉపాసించేవారి పాపాలను, కష్టాలను నాశనం చేసేది ఆ పరమేశ్వరి అని అర్ధం. 

అమ్మ తనను సేవించే వారి పాపములను దగ్ధము చేస్తుంది. వారి దుఃఖములను తీరుస్తుంది. 

అకము తొలగించి న, అకము, నాకమును, అంటే స్వర్గమును ఇస్తుంది. 

అందుకే ఈ నామంలో ఆ లలితాదేవిని అకాంతా అంటున్నాం. 

భక్తుల పాపాలను, దుఃఖాలను అంతం చేసే, ఆ అకాంతా కు వందనం. 

ఓం శ్రీ అకాంతాయై నమః 


861. కాంతార్ధవిగ్రహా

కాంతుడు అంటే భర్త. కాంతుడిలో సగం అర్ధాంగి అయిన భార్య. విగ్రహమంటే శరీరం, స్వరూపం. 

కాంతార్ధవిగ్రహా అంటే, కాంతుని శరీరములో అర్ధభాగాన్ని ఆక్రమించింది అని అర్ధం. 

విష్ణువు లక్ష్మికి హృదయంలో స్థానం ఇచ్చాడు. బ్రహ్మ వాణిని నాలుకపై ఉంచుకున్నాడు. 

శివుడు తన శరీరంలో వామభాగం శివానీకి ఇచ్చాడు. 

శరీరంలో అర్ధ భాగమిచ్చినది పరమశివుడు. ఆ అర్ధభాగాన్ని పూరించింది పరమేశ్వరి. 

ఈ నామంలో అమ్మను, భర్త  అయిన పరమశివుని విగ్రహంలో సగం వున్న దేవి అని అంటున్నాం. 

ఆకాశమును తనలో ఇముడ్చుకున్న శక్తి అనే అర్ధం కూడా ఈ నామానికి వుంది. 

కాంతుని శరీరములో అర్ధ భాగంగా ప్రకాశిస్తున్న, ఆ కాంతార్ధవిగ్రహ కువందనం. 

ఓం శ్రీ కాంతార్ధ విగ్రహాయై నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

       

29, డిసెంబర్ 2021, బుధవారం

159. జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ సర్వోపనిష దుద్ఘుష్టా, శాంత్యతీత కళాత్మికా

 

జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ 
సర్వోపనిష దుద్ఘుష్టా, శాంత్యతీత కళాత్మికా ॥ 159 ॥


851. జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ 

జీవులందరికీ జన్మము, మృత్యువు, జర అనే అవస్థలు ఉంటాయి. 

పుట్టిన వాడికి మరణము తప్పదు. మరణించినవానికి పుట్టుక తప్పదు. మధ్యలో ముసలితనపు 

ఇబ్బందులూ తప్పవు. ఈ మూడింటి తాపము చేతా, జనులంతా సాధారణంగా బాధపడుతూ 

వుంటారు. ఈ జన్మ, మృత్యు, జరా త్రయము అనే బాధల నుండి జనులకు విశ్రాంతిని ఇచ్చేది 

జన్మ మృత్యు  జరా తప్త జన విశ్రాంతి దాయినీ అని కీర్తింపబడే లలితాపరమేశ్వరి. 

విశ్రాంతి అంటే, దుఃఖములన్నీ తొలగిన తరువాత కలిగే సుఖం. 

మర్త్యులైన జీవులకు చావు, పుట్టుక, ముదిమి, అనే దుఃఖాలను నశింపచేసి సుఖాన్నిచ్చే తల్లి అని 

ఈ నామానికి అర్ధం. దుఃఖం నశింపచేయటం అంటే, వారి వారి యోగ్యతానుసారం ఆ దుఃఖాలు 

తట్టుకునే శక్తిని ఇచ్చే కరుణామూర్తి పరమేశ్వరి అని భావం. 

జనన మరణ జరా దుఃఖాల నుంచి విశ్రాంతి నిచ్చే, ఆ జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి 

దాయిని కి వందనం. 

ఓం శ్రీ  జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయిన్యై నమః  


852. సర్వోపనిషదుద్ఘుష్టా

లలితాదేవి కీర్తి అన్ని ఉపనిషత్తులలోనూ ఉద్ఘోషించి చెప్పబడింది అని ఈ నామానికి అర్ధం. 

శ్రీమాత మహత్తత్త్వం సకల ఉపనిషత్తులలోనూ గొప్పగా, దృఢముగా, స్పష్టముగా చెప్పబడింది. 

ఎంత స్పష్టంగా చెప్పబడిందో, అంతే రహస్యంగా, గుప్తంగా, గూఢంగా చెప్పబడింది శ్రీవిద్య. 

ఉపనిషత్తు అంటేనే రహస్యము అని అర్ధం. అజ్ఞానమును పోగొట్టేది ఉపనిషత్తు.  

అన్ని ఉపనిషత్తులలోనూ జీవేశ్వర ఐక్యస్వరూపమైన అద్వైతతత్త్వం గురించి ఘోషణముగా 

చెప్పబడింది. అంటే చాటింపు వేసి మరీ చెప్పబడింది అద్వైత తత్త్వం. 

ఉపనిషత్తులలో ఘోషణముగా చెప్పిన, ఆ సర్వోపనిషదుద్ఘుష్ట కు వందనం.  

ఓం శ్రీ సర్వోపనిషదుద్ఘుష్టాయై నమః  


853.  శాంత్యతీతకలాత్మికా 

కళలలో ఆకాశము నందు వుండే కళకు శాంత్యతీతకళ అని పేరు. 

ఆ శాంత్యతీతకళనే ఆత్మగా కలిగిన పరమేశ్వరిని ఈ నామంలో శాంత్యతీతకళాత్మికా అంటున్నాం. 

శైవాగమంలో, "ద్వైతభావ నిర్వాణము వలన కలిగే జ్ఞానానందాన్ని కలిగించునది", అని వుంది. 

ఈ శాంత్యతీతకళాత్మికనే తత్ అన్నారు. శాంత్యతీతకళాత్మిక తత్ కన్నా వేరు కాదు అని కూడా 

చెప్పబడింది. 

ద్వైతాన్ని నిర్మూలించి, జ్ఞానాన్నిచ్చే, తత్ రూపమైన, ఆ  శాంత్యతీతకళాత్మిక కు వందనం. 

ఓం శ్రీ  శాంత్యతీతకలాత్మికాయై నమః  






------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

       

28, డిసెంబర్ 2021, మంగళవారం

158. ఛందస్సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరీ ఉదారకీర్తిః, ఉద్దామవైభవా, వర్ణరూపిణీ

 

ఛందస్సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరీ ।
ఉదారకీర్తిః, ఉద్దామవైభవా, వర్ణరూపిణీ ॥ 158 ॥

844. ఛందఃస్సారా

 
ఆ పరమేశ్వరి ఛందస్సు లోని సారవంతమైన భాగము అని ఛందస్సారా అనే నామానికి అర్ధం.

ఛందస్సు అంటే వేదము, పద్యలక్షణము, ఇచ్ఛ, స్వేచ్చావిహారి అనే అర్ధాలున్నాయి. 

సారము అంటే బలము, చేవ, మజ్జ, జలము, ధనము, న్యాయము అనే అర్ధాలున్నాయి. 

ఛందస్సారా అంటే వేదసారమైన ఉపనిషత్ స్వరూపము అని భావించాలి. 

ఆరు వేదాంగాలలో ఛందస్సు కూడా ఒకటి. 

ఛందోశాస్త్రాన్ని పింగళుడనే గణితశాత్రవేత్త తొలిసారిగా చెప్పాడు. 

పింగళుడి ప్రకారము, ఛందస్సులు మొత్తం ఇరవై ఆరు. ఆ ఛందస్సుల స్వరూపసారమే 

ఛందస్సారా. గాయత్రి, అనుష్టుప్, త్రిష్టుప్, బృహతీ, ప్రకృతీ మొదలైనవి ఛందస్సులు. 

ఆ ఛందస్సులన్నింటి లోకీ గాయత్రీ ఛందస్సు సారవంతమైనది. 

ఆ గాయత్రీ ఛందస్సులో మిక్కిలి సారవంతమైనది పంచదశి. 

ఈ విషయాన్ని భాస్కరరాయలవారు తన వరివస్యారహస్యం అనే గ్రంధంలో చెప్పారు. 

గాయత్రికి రెండు ముఖ్యమైన రూపాలున్నాయి. 

మొదటిది ప్రకటగాయత్రి, దీనిని అందరూ పఠిస్తారు, ఉపాసిస్తారు. మరొకటి గుప్తగాయత్రి. 

హంసగాయత్రి, ఇతర దేవతా గాయత్రీ మంత్రాలు కూడా వున్నాయి.  

గుప్తగాయత్రిని వేదము కూడా స్పష్టంగా చెప్పకుండా, సంకేతాలతో మాత్రమే చెప్పింది. 

అధర్వణవేదములోని, త్రిపురాసూక్తములో, పదునారవ ఋక్కులో, కేవలము సంజ్ఞలతో 

కాదివిద్యా రహస్యము చెప్పబడింది. అదే పంచదశీ మంత్రము. 

క అనే బీజాక్షరముతో మొదలయ్యే మంత్రస్వరూపం కాదివిద్యా. 

హ అనే  బీజాక్షరముతో మొదలయ్యే మంత్రస్వరూపం హాదివిద్యా. 

శ్రీలలిత శ్రీవిద్యను అనేక విధాలుగా బీజాక్షరాలను కూర్చి పేర్చి, వివిధ ఉపాసకులకు ఇచ్చింది. 

ఛందస్సు అంటే న్యాయ మార్గములో సంచరించే స్వేచ్చావిహారిణి అనే అర్ధం కూడా వుంది. 

పద్యలక్షణాన్ని సూచించటానికి కూడా ఛందస్సుని వాడతారు. 

ఛందస్సును ఇచ్చాశక్తి స్వరూపిణిగా వర్ణించటం కూడా ఆనవాయితీలో వున్నది. 

ధర్మాధర్మ విచక్షణ చేస్తున్నప్పుడు ఏదైనా సందేహం కలిగితే, మనసు యథేచ్ఛగా ఏ ధర్మం 

చెప్తుందో, అదే ధర్మం అనే భావం వాడుకలో వుంది. 

కానీ ఒక్కొక్కసారి ధర్మం అధర్మం అవుతుంది, అధర్మం ధర్మం అవుతుంది. 

ఉదాహరణకి సిద్ధులైన వారు చేసే అన్ని పనులూ సిద్ధులు కాని వారు చేయలేరు, చేయకూడదు. 

దత్తాత్రేయుడు సుధాపానం చేశాడని సాధారణ మానవులు చేస్తే దోషమవుతుంది కదా. 

వారు చేసే సుధాపానము వేరు, సామాన్యులు చేసే సుధాపానము వేరు. 

కనుక కొన్నిసార్లు ధర్మం అధర్మం అవుతుంది, అధర్మం ధర్మం అవుతుంది. 

పరమాత్మ చేసేది వేరు, సిద్ధులు చేసేది వేరు, సామాన్యులు చేసేది వేరు. 

అటువంటి ధర్మాధర్మవిచక్షణ చేసే ఇచ్ఛాశక్తి  స్వరూపిణి ఛందస్సారా. 

ఆ ధర్మ అధర్మ ద్వంద్వమైన కామకళా రూపమే ఛందస్సారా. 

గుప్తముగా వున్న శ్రీవిద్యయే ఛందస్సారా అయిన పంచదశి. 

ఉపనిషత్సార రూపమైన, ఆ ఛందఃస్సారా కు వందనం. 

ఓం శ్రీ  ఛందఃసారాయై నమః  


845. శాస్త్రసారా

శాసించేది శాస్త్రము. ఏవి విహితములో, ఏవి నిషేధములో నిర్ణయించేది శాస్త్రం.  

కనుక శాస్త్రమంటే వేదము. ఆ శాస్త్రముల సారమే శాస్త్రసారా అని చెప్పబడే లలితా పరాభట్టారిక. 

ముఖ్యముగా శాస్త్రములు నాలుగు, వ్యాకరణము, తర్కము, మీమాంస, ధర్మము. 

కానీ శాస్త్రాల సంఖ్యను ఒక్కొక్కరు ఒక్కో విధముగా నాలుగనీ, ఆరనీ, ఇరవై ఏడనీ, 

అరవై నాలుగనీ రకరకాలుగా చెప్పారు. ఆ శాస్త్రాలన్నిటి సారమే శాస్త్రసారా అనబడుతోంది. 

అన్ని శాస్త్రాలూ అమ్మ చేత చెప్పబడినవే. ఆ శాస్త్రముల లోని శాసనముల సారమే పరమేశ్వరి. 

ఆ పరమేశ్వరి మనుష్యుల ప్రవృత్తి, నివృత్తులను వేదం ద్వారా నిర్దేశిస్తోంది. 

ఆవిధంగా వేదం ద్వారా జీవులకు నిర్దేశనము చేస్తున్న, ఆ శాస్త్రసారా కు వందనం.  

ఓం శ్రీ శాస్త్రసారాయై నమః  


846.  మంత్రసారా 

దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనం తు దైవతం అని శాస్త్రవాక్యం. 

జగత్తులన్నీ దైవం అధీనంలో ఉంటే, ఆ దైవం మంత్రం అధీనంలో ఉంటాడు అని అర్ధం. 

మంత్రమంటే శాస్త్రం, శాస్త్రమంటే వేదం, కనుక మంత్రమంటే వేదం. 

మంత్రాలన్నీ వేదాల నుంచే వచ్చాయి. తంత్రములన్నింటిలో మంత్రముల గురించి చెప్పారు.  

మంత్రం రహస్యం కూడా. గురు ముఖతః స్వీకరించవలసినదే. బీజాక్షరాల కూర్పే మంత్రం. 

మంత్రద్రష్టలైన ఋషులు, మంత్రాలను దర్శించి, వాటిని ఉపాసన చేసి, సిద్ధింపచేసుకుని, 

తమ శిష్య పరంపర ద్వారా ఆ మంత్రాలను ఉపాసకులకు అందించారు. 

మంత్రం అంటే, మననాత్ త్రాయతే ఇతి మంత్రః, మననము చేస్తూ ఉంటే రక్షించేది మంత్రము. 

మంత్రము అంటే సాక్షాత్ మంత్రదేవతా స్వరూపమే. మంత్రసారమే ఆ మంత్ర దేవతస్వరూపం.    

బాలా మంత్రమంటే బాలా రూపమే, బగళా మంత్రమంటే, బగళా రూపమే. 

దేవతలకే కాకుండా పంచ భూతాలకు కూడా బీజాక్షరాలున్నాయి. 

మంత్రసారా అంటే, మంత్రములో చెప్పబడిన నిర్దుష్ట స్వరూపమైన ఆ మంత్రదేవతా రూపమే. 

సకల మంత్రాల సారమైన, ఆ మంత్రసార కు వందనం. 

ఓం శ్రీ  మంత్రసారాయై నమః  


847. తలోదరీ

తలము అంటే బల్లపరుపుగా వున్న ప్రదేశం. తలోదరీ అంటే తలముగా వున్న ఉదరము కలది. 

కృశించిన ఉదరభాగము కలది ఆ మహేశ్వరీ అని తలోదరీ నామం చెప్తోంది. 

ఒక విధంగా చూస్తే, ఉదరం బానలాగా పెంచకండి అని అమ్మ హెచ్చరిస్తోంది కూడా. 

తలము అంటే లోకము. లోకాలన్నీ ఉదరంలో దాచుకున్న జగన్మాత కనుక, తలోదరీ అని 

అంటున్నాం. భూ, భువ, సువ, మహ, జన, తప, సత్య లోకాలకు ఊర్ధ్వలోకాలని పేరు. 

అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలకు అధోలోకాలని పేరు. 

ఈ పదునాలుగు లోకాలు ఆ పరమేశ్వరీ స్వరూపమే. 

ఈ తలాలన్నీ ఉదరభాగంలో కల ఆ జగజ్జననిని ఈ నామంలో తలోదరీ అంటున్నాం. 

ఈ నామాన్ని అతలోదరీ అని భావిస్తే, ఉదరము వద్ద అతలలోకము కల జగదీశ్వరి అని అర్ధం.  

పదునాలుగు భువనభాండాలనీ కడుపులో భరిస్తున్న, ఆ తలోదరి కి వందనం. 

ఓం శ్రీ తలోదర్యై నమః 

  

848. ఉదారకీర్తిః

ఉత్-అర-కీర్తి అంటే  ఉత్-ఉత్కృష్టమైన, అర-శీఘ్రముగా, కీర్తిని ఇచ్చునది అని అర్ధం.

ఉదారకీర్తి అంటే ఉత్కృష్టమైన కీర్తి కలది, ఇచ్చునది అని భావం. 

అమ్మను ఉపాసించేవారికి శీఘ్రంగా గొప్ప కీర్తి లభిస్తుంది, ఆ కీర్తి అంతటా వ్యాపిస్తుంది అని 

అర్ధం.  

అర అంటే దేవమాత సంతానం అనే అర్ధం వేదంలో వున్నది. 

కనుక ఉత్-అర-కీర్తి అంటే, దేవతలకు మించిన కీర్తి కలది అని ఒక అర్ధం. 

ఆరుడు అంటే మంగళుడు. కనుక లలితాదేవిని స్తుతిస్తే, కుజ దోషములు పోతాయని విశ్వాసం. 

ఉత్-ఆ-అర-కీర్తి అని పదవిభజన చేస్తే, అంతటనూ వ్యాపించిన అమృత సరస్సు లాగా 

గొప్ప కీర్తి కలది అని అర్ధం. 

వేదములో, "పరబ్రహ్మను సగుణోపాసన చేసిన వారికి అపరాజితమనే నగరం లభిస్తుంది. 

ఆ నగరమే పరబ్రహ్మ నగరము. ఆ నగరంలో అర, ణ్యము అనే రెండు అమృతసరస్సులు

వున్నాయి. అవి సముద్రమంత విశాలమైనవి. ఆ అమృత సరస్సు లంత గొప్ప కీర్తి కలది 

ఉదారకీర్తి", అని చెప్పబడింది. 

సూర్యమండలంలో హిరణ్మయపురుషుడుంటాడు. 

ఆ హిరణ్మయపురుషునిలో 'అర' అనే దబ్బనం వంటి ఆయుధం ఉంచిన కీర్తి కలది పరమేశ్వరి. 

దాని వలన అమ్మకు హిరణ్మయపురుషుని కన్నా ఘనమైన కీర్తి కలిగింది. 

కనుక ఆ హిరణ్మయపురుషునికి దుఃఖం కలిగించేంత ఉత్కృష్టమైన కీర్తి కలది అని ఒక అర్ధం. 

ఉదారకీర్తి అంటే, గొప్ప కీర్తి కలది, శీఘ్రముగా వ్యాపించే కీర్తి కలది, దేవతల కన్నా ఎక్కువ కీర్తి 

కలది, కుజ దోషములు పోగొట్టునది అనే కీర్తి కలది, అపరాజితా నగరంలో వున్న రెండు 

అమృతసరస్సుల కన్నా గొప్ప కీర్తి కలది, సూర్యమండలంలోని హిరణ్మయపురుషుడికి 

దుఃఖం కలిగించేటంత కీర్తి కలది, తన ఉపాసకులకు శీఘ్రముగా వ్యాపించే గొప్ప కీర్తిని ఇచ్చేది, 

వంటి అనేక అర్ధాలున్నాయి.  

శీఘ్రంగా వ్యాపించే ఉత్కృష్టమైన కీర్తి కల, ఆ ఉదారకీర్తి కి వందనం. 

ఓం శ్రీ ఉదారకీర్తయే నమః 


849. ఉద్దామవైభవా

దామము అంటే రజ్జువు, తాడు. దేనినైనా బంధించటానికి తాడును వాడతాం. 

ఆ తాడు మందాన్ని బట్టీ, పొడవును బట్టీ ఆ వస్తువు యొక్క పరిమాణాన్ని చెప్పగలం. 

అమ్మ వైభవం ఆ తాడును అతిక్రమించినది. 

అంటే కట్టులు కట్టలేనంత వైభవము కలది ఆ లలితాపరమేశ్వరి అని ఈ నామానికి అర్ధం. 

అమ్మ వైభవాన్ని చుట్టేటంత తాడు లేనే లేదు. అమ్మ వైభవాన్ని కట్ట కట్టి ఇంత అని చెప్పటం 

అసాధ్యం. అంతటి గొప్ప వైభవం కల తల్లి శ్రీలలిత. 

అందుకే అమ్మను ఈ నామంలో ఉద్దామవైభవా అంటున్నాం. 

బంధించే తాడు యొక్క కొలతలను అతిక్రమించేటంత విభవము కలది అని ఈ నామార్ధం. 

ఉత్కృష్టమైన విభవము కల, ఆ ఉద్దామవైభవ కు వందనం. 

ఓం శ్రీ ఉద్దామవైభవాయై నమః 


850. వర్ణరూపిణీ

వర్ణాలు అంటే అక్షరాలూ, రంగులు, జాతులు అనే అర్ధాలున్నాయి. 

సంస్కృతంలో యాభై అక్షరాలున్నాయి. క్షకారంతో కలిపితే అవి యాభై ఒకటి అక్షరాలు. 

ఆ వర్ణమాల లోని అక్షరముల స్వరూపమే వర్ణరూపిణీ అయిన పరమేశ్వరి. 

ఎన్ని అక్షరాలున్నాయో, అన్ని శబ్దాలున్నాయి, అన్ని రంగులున్నాయి. 

ప్రతి అక్షరానికీ ఓ రంగు వుంది. ఆ రంగులన్నీ శ్రీమాత స్వరూపాలే. 

శ్రీమాత ఆ వర్ణ స్వరూపిణి అని ఒక అర్ధం.   

పాణిని, మంత్రశాస్త్రంలో అక్షరముల సంఖ్య అరవై మూడు లేదా క్షకారంతో కలిపి అరవై నాలుగు,

అని చెప్పాడు. అమ్మ ఆ మంత్రశాస్త్రములు చెప్పిన బీజాక్షరముల స్వరూపిణి అని ఒక అర్ధం.  

వర్ణము అంటే, భగవద్గీతలో చెప్పిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే చాతుర్వర్ణాల వారు 

అనే అర్ధం కూడా వుంది. ఆ నాలుగు వర్ణాల వారూ కూడా నేనే అని అమ్మ ఈ నామంలో చెప్తోంది. 

"ఆ నాలుగు వర్ణాల వారూ నా స్వరూపమే. బ్రాహ్మణులు ముఖము, క్షత్రియులు భుజములు, 

వైశ్యులు ఊరువులు, శూద్రులు పాదములు", అని వేదములో పురుషసూక్తం చెప్తోంది. 

ఏ వర్ణము వారైనా అందరూ అమ్మ స్వరూపమే అని ఈ నామానికి అర్ధం. 

సమస్త వర్ణముల రూపమూ తానే అయిన, ఆ వర్ణరూపిణి కి వందనం. 

ఓం శ్రీ వర్ణరూపిణ్యై నమః 






------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

       

27, డిసెంబర్ 2021, సోమవారం

157. ముకుందా, ముక్తి నిలయా, మూలవిగ్రహ రూపిణీ భావజ్ఞా, భవరోగఘ్నీ, భవచక్రప్రవర్తినీ

 

ముకుందా, ముక్తి నిలయా, మూలవిగ్రహరూపిణీ 
భావజ్ఞా, భవరోగఘ్నీ, భవచక్రప్రవర్తినీ ॥ 157 ॥

838. ముకుందా

ముకుందా అంటే మోక్షమును ఇచ్చునది అని భావం. 

ముకుందుని వంటి రూపము కలది కనుక, ముకుందా అనే నామం వచ్చింది. 

మోహక్షయమును చేసి, మోక్షమును ఇచ్చునది కనుక, ముకుందా. 

విష్ణుస్వరూపము అయిన ముకుంద రూపము కలది కనుక, ముకుందా. 

తంత్రరాజములో, "లలితాదేవి శ్రీకృష్ణ రూపములో వేణుగానము చేసి, గోపికలను ఆకర్షించింది. 

వారి వినోదం కోసం తనను తాను ఆరు విధములుగా కల్పించుకుంది", అని వుంది. 

ముకుంద శబ్దముకు నిఘంటువులో, విష్ణువు, ఎర్రతామర, పాదరసము, ఒక నిధి విశేషము, 

రత్నము అనే అర్ధాలు కూడా వున్నాయి.   

మోక్షమునిచ్చే, ఆ ముకుంద కు వందనం. 

ఓం శ్రీ  ముకుందాయై నమః  


839. ముక్తి నిలయా

ముక్తి అనగా మోక్షమే నివాసస్థానముగా కలది ముక్తినిలయా. 

సామీప్య, సాలోక్య, సారూప్య, సాయుజ్య, కైవల్యములని ముక్తులు అయిదు విధములు. 

ఈ అయిదు విధములైన ముక్తులకూ నిలయమైన లలితాపరమేశ్వరియే ముక్తినిలయా. 

అందుకే అమ్మను ఈ నామంలో ముక్తినిలయా అంటున్నాం. 

ముముక్షువులు కోరే ముక్తిని ఇచ్చే, ఆ ముక్తి నిలయ కు వందనం.  

ఓం శ్రీ ముక్తి నిలయాయై నమః  


840.  మూలవిగ్రహరూపిణీ

రాజరాజేశ్వరీదేవియే మూలవిగ్రహరూపిణి. 

శ్రీచక్రంలో అగ్రభాగమైన బిందువులో స్థితమైనది ఈ తల్లే. 

బాలా, బగళా, తారా, కాళీ మొదలైన శక్తులన్నింటికీ మూలమైన విగ్రహము కనుక, 

మూలవిగ్రహరూపిణీ అనే నామం వచ్చింది. శరీరమే స్వరూపముగా కలది అని కూడా అర్ధం. 

ఈ విషయము గౌడపాద సూత్రముల ద్వారా తెలుస్తోంది. 

"ఒక్క విద్య నుంచి, శాంభవీ, విద్యా, శ్యామా అనే మూడు విధములైన శక్తులు ఏర్పడ్డాయి.

ఈ శక్తుల నుంచి ప్రత్యేకమైన అనేక శక్తులు పుట్టాయి." అని గౌడపాదుడు చెప్పాడు. 

దీనిని బట్టీ, ఒక్క శక్తియే అనేక శక్తులకు మూలమైనది అని తెలుస్తోంది. 

ఆ శక్తులన్నింటి జనకశక్తియే మూలవిగ్రహరూపిణి అయిన రాజరాజేశ్వరీ రూపమైన లలితాదేవి. 

అనేక ప్రత్యేక శక్తులకు మూల శక్తియైన, ఆ  మూలవిగ్రహరూపిణి కి వందనం. 

ఓం శ్రీ  మూలవిగ్రహరూపిణ్యై నమః  


841. భావజ్ఞా

భావజ్ఞా అంటే భావముల జ్ఞానము కలది, లేదా, భావములను గురించి తెలిసినది అని అర్ధం. 

భావజ్ఞా అంటే, భవము(సంసారము)ను గురించిన జ్ఞానము కలది. 

భావజ్ఞా అంటే, షడ్భావ వికారముల జ్ఞానమును కలిగినది. ఉత్పత్తి, స్థితి, పరిణామము, వృద్ధి, 

క్షయము, నాశము లను ఆరింటినీ భావ వికారములు అంటారు. 

భావములు, అభావములు గురించి భావాభావ వివర్జితా అనే నామంలో కూడా చెప్పుకున్నాం. 

భవుడనే శివుని మూర్తి గురించిన జ్ఞానము కలది భావజ్ఞా. 

'భ' అంటే, భక్తిభావమును ఎరిగినది భావజ్ఞా. భ అంటే కాంతి అని కూడా అర్ధం. 

కనుక, భావజ్ఞా అంటే, తన ద్వారా కాంతిని పొందుతున్న సూర్యుడు, చంద్రుడు, అగ్ని, తారలు, 

మెరుపులు వంటి కాంతి కేంద్రముల గురించి సంపూర్ణమైన జ్ఞానము కలది అని భావం. 

యోగినీ హృదయంలో, "భావజ్ఞా అంటే, భావము యొక్క అర్ధం తెలిసినది, అంటే భావార్ధమును 

ఎరిగినది", అని చెప్పారు.  

మనసులో మెదలే భావములను గురించి జ్ఞానమున్న, ఆ భావజ్ఞ కు వందనం. 

ఓం శ్రీ భావజ్ఞాయై నమః 

  

842. భవరోగఘ్నీ

భవము అంటే సంసారము, జననమరణ చక్రము. భవరోగఘ్నీ అంటే ఈ జనన మరణాదులకు 

సంబంధించిన ఆధివ్యాధులను పోగొట్టునది అని అర్ధం. 

రామాయణములో, "వృషధ్వజుడైన శంకరుని కంటే గొప్ప భిషక్కు కనబడడు", అని ఉంది. 

శివపురాణంలో, "సంసారమనే వ్యాధి వలన బాధపడువారికి, శివుడే ఔషధము" అని చెప్పారు. 

అంటే, ఈశ్వరుని సేవిస్తే, జననమరణ బాధలుండవు అని భావం. 

జననమరణ చక్రమైన భవరోగములకు, శివుడనే ఔషధమును ఇచ్చు, ఆ భవరోగఘ్ని కి వందనం. 

ఓం శ్రీ భవరోగఘ్న్యై  నమః 


843. భవచక్రప్రవర్తినీ

భవచక్రమనే సంసార మండలాన్ని నడుపుతున్నది అని అర్ధం. 

మనుస్మృతిలో, "పంచభూతములతో కలిసి, అన్ని ప్రాణులయందూ వుంది, వారిని జనన మరణ 

చక్రములో తిప్పునది భవచక్రప్రవర్తినీ అయిన ఆ లలితాదేవి" అని ఉన్నది. 

విష్ణుభాగవతంలో, "పరమాత్మ సర్వజగత్తులకూ బంధనము, మోక్షము కలిగించువాడు, శరణన్న 

వారి కష్టములు తీర్చువాడు, అని తెలిసిన భక్తులు ఆ పరమాత్మనే అర్చిస్తున్నారు" అని చెప్పారు. 

భవచక్రం అంటే శివుడు అధిపతి అయిన అనాహతచక్రం అనే అర్ధం కూడా ఉన్నది. 

విష్ణుపురాణంలో, చక్రము అంటే మనస్సు అని చెప్పబడింది. 

కనుక, భవచక్రప్రవర్తిని అంటే, శివుని మనస్సును ప్రవర్తించేయునది అని భావం. 

ఈ సంసారచక్రమును నడుపుతున్న, ఆ భవచక్రప్రవర్తిని కి వందనం. 

ఓం శ్రీ భవచక్రప్రవర్తిన్యై నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650