22, జనవరి 2022, శనివారం

183. శ్రీ శివా, శివశక్త్యైక్య రూపిణీ, లలితాంబికా

 

శ్రీ శివా, శివశక్త్యైక్య రూపిణీ, లలితాంబికా ॥ 183 ॥
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః 

998. శ్రీ శివా

శ్రీ శివా అంటే శ్రీ తో కూడిన పార్వతి. శ్రీ అంటే సకల శుభాలూ కలిగించే దేవి అని అర్ధం. 

శ్రీమాతా నామంతో మొదటిశ్లోకాన్ని ప్రారంభించాం. 

శ్రీ శివా నామంతో చివరిశ్లోకాన్ని ప్రారంభిస్తున్నాం. 

శ్రీ అంటే, లక్ష్మి, సంపద, సమృద్ధి, శోభ, సంతృప్తి, బుద్ధి, ముక్తి, మోక్షం, మారేడు, సిద్ధి, కీర్తి, ప్రభ, 

విభూతి, అధికారం, వృద్ధి, కమలం, రాగం, మంత్రం, తంత్రం, యంత్రం, ధనం, ధాన్యం, వరం, 

ధైర్యం, విజయం, అభయం, విద్య, సంతానం, వాహనం, వస్త్రం, ఫలం, పుష్పం, బలం, బలగం,

బంధువర్గం, భృత్యవర్గం ఇలా ఎన్నో. 

ఇవి అన్నీ కలిగిన పార్వతి అని, ఈ శ్రీ శివా అనే నామానికి అర్ధం. 

ఇన్ని వున్న ఆ పరమేశ్వరుని పత్ని పార్వతీదేవి కన్నా సంపన్నులు ఎవరు. 

కనుక, శివానీయే ఆ సర్వ సంపత్స్వరూపిణి.  

సిరితో కూడిన గౌరి, ఆ శ్రీ శివా కు వందనం. 

ఓం శ్రీ శ్రీశివాయై నమః  


999. శివశక్త్యైక్య రూపిణీ

శివశక్తుల సామరస్యమే స్వరూపముగా కలది శివశక్త్యైక్య రూపిణి. 

సామరస్యం అంటే, సమరసత్వము, పరమసామ్యం, అత్యంత అభేదము అని అర్ధం. 

వాయవీయసంహితలో, "తిలల నుంచి తైలం వచ్చినట్టు, శివేచ్చతోనే, శివతత్త్వము నుండి 

విడివడి,  పరాశక్తి శక్తితత్త్వంగా వికసించింది", అని వుంది. 

సౌరసంహితలో, "ఏవిధముగా బ్రహ్మ నుంచి వచ్చిన శక్తి కూడా బ్రహ్మమే అవుతుందో, అదే  

విధంగా శక్తికి, శక్తివంతులకు కూడా భేదము లేదు", అని వుంది. 

వాశిష్ఠ రామాయణంలో, "ఏవిధంగా వాయువు నుంచి దాని స్పంద శక్తిని, అగ్నినుంచి దాని ఉష్ణ 

శక్తిని విడదీయలేమో, అదే విధముగా చైతన్యము, దాని స్పందశక్తి కూడా ఒక్కటిగానే ఉంటుంది. 

వాటిని విడదీయలేము", అని చెప్పారు. 

శివుడు వాక్కు అయితే, శక్తి ఆ వాక్కు  అర్ధం. శివుడు లింగమైతే, శక్తి పానవట్టం. శివుడు గుండె 

అయితే, శక్తి దాని చప్పుడు. ఈ రెండూ విడదీయరానివి, విడదీయలేనివి. 

విడివిడిగా నిరర్ధకమైనవి. "వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీ 

పరమేశ్వరౌ" అని మహాకవి కాళిదాసు తన రఘువంశం కావ్యంలో స్తుతించాడు. 

"శివచక్రములు, శక్తిచక్రములు కలిసి ఏర్పడినది శివశక్త్యైక్య రూపిణి. కనుక శ్రీచక్రస్వరూపమే 

శివశక్త్యైక్యస్వరూపం. ఈ శివ, శక్తి చక్రముల మధ్య గల అవినాభావ సంబంధమును తెలుసుకున్న 

వాడే, శ్రీచక్ర రహస్యమును తెలిసినవాడు." ఈ విషయము బ్రహ్మాండపురాణంలో వున్నది. 

యజ్ఞవైభవఖండంలో, " 'స' కారం శక్తి, 'హ' కారము శివుడు, ఈ రెండు బీజాక్షరములూ కలిసి 

ఏర్పడిన హంసమంత్రమే శివశక్త్యైక్యస్వరూపం", అని చెప్పారు. 

"శివుని యొక్క పంచశక్తులు, పాంచభౌతికమైన ప్రపంచమంతా వ్యాపించి వున్నవి, కనుక ఈ 

జగత్తు సర్వం శివ-శక్తి మయం", అని విరూపాక్ష పంచదశికలో చెప్పబడింది.

శివ, శివానీల సామరస్య స్వరూపమైనఆ శివశక్త్యైక్య రూపిణి కి వందనం.  

ఓం శ్రీ శివశక్త్యైక్యరూపిణ్యై నమః  


1000. లలితాంబికా

లలితమైన అంబిక, సుకుమారమైన అంబిక, ప్రభాసవంతమైన అంబిక, శృంగార చేష్ట చూపు 

అంబిక. ఈ అర్ధాలన్నీ లలితాపరమేశ్వరికి వర్తిస్తాయి. 

ఇంతవరకూ చెప్పుకున్న 999 నామాలూ అమ్మ స్వరూపము, శక్తి, మహిమ, లక్షణములు, 

నివాసము, పరివారము, జగత్రచనా నైపుణ్యం, జగన్నిర్వహణాశైలి, శిష్టరక్షణా, దుష్టశిక్షణా 

మొదలైన అమ్మ తత్త్వాన్ని తెలిపే విశేషణానామాలే. 

అమ్మ అసలైన నామం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అదే లలితాంబికా.

అంబికా అంటే తల్లి, జగజ్జనని, పార్వతి, పరమేశ్వరి, పరదేవత, 

ప్రయాగలో ఉన్న పీఠాధిదేవత, లలిత. ప్రయాగలోని లలితా ఆలయమే మొట్టమొదటి 

లలితా పీఠమని చెపుతారు. 

నైమిశారణ్యములో తపస్సు చేసుకుంటున్న ఋషులు, మునులు రాక్షసబాధను తట్టుకోలేక,

లలితను ప్రార్ధిస్తే, అమ్మ అక్కడ లలితాపీఠం ఏర్పరుచుకుని, వారికి రక్షణ కవచంగా నిలిచింది. 

లలిత అంటే లలితమైనది, సుకుమారమైనది, ప్రకాశవంతమైనది, కాంతి జనకమైనది, 

అందమైనది, రతిచేష్టలు చేయునది అనే అర్ధాలు అన్నీ వున్నాయి. 

ఇదే లలితాంబికా అంటే. ఈమే లలితాంబికా అంటే. ఈమే మన తల్లి, మనందరి తల్లి. 

ఈమె వలననే ఈ జగత్తులన్నీ, మనతో సహా, వర్ధిల్లుతున్నాయి. ఇహ పరములను అనుగ్రహించే 

శ్రీలలిత. 

తనను ఉపాసించే భక్తులకు భోగమూ మోక్షమూ రెండూ ఇచ్చే అమ్మ, లలితమ్మ, మాయమ్మ.

ఎవరికి వారు 'మా అమ్మ వంటిది మరొకరు లేరు' అని అనుకునే శ్రీమాతృస్వరూపం. 

శ్రీచక్రరాజ సింహాసనం మీద వున్నా, వెండికొండ మీద వున్నా, ఓంకారములో వున్నా, పంచదశీ 

మంత్రములో వున్నా, మనందరి హృదయపద్మాలలో వున్నా, ఎవరికి వారు నాకు మాత్రమే అమ్మ 

అనుకునే అమ్మ. మా అమ్మ.  

అమ్మంటే అమ్మే, ఇంకో నామం లేదు, ఇంకో అర్ధం లేదు, ఇంకో వివరణ లేదు, ఇంకో భావం లేదు, 

అంతే, అమ్మంటే అమ్మే....🙏

మనందరి హృదయాలలో కొలువై వున్న, మా చక్కని సుకుమార లతిక, సౌందర్య తిలక అమ్మ, 

ఆ లలితాంబిక కు వందనం. 

ఓం శ్రీ లలితాంబికాయై నమః  


ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః 

ఇవే శ్రీలలితాదేవి యొక్క విశిష్టమయిన వేయి నామాలు. 


ఇది శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వ్రాసిన శ్రీలలితావిజయం లోని 

శ్రీలలితారహస్యసహస్రనామ స్తోత్రము నందు కల 

వేయి నామాల వివరణ

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


॥ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, 

శ్రీలలితా రహస్యనామ సాహస్రస్తోత్ర కథనం నామ ద్వితీయోఽధ్యాయః॥


ఇది శ్రీబ్రహ్మాండపురాణములో, ఉత్తరఖండములో, హయగ్రీవాగస్త్యులు చేసిన సంభాషణములో,

ప్రస్తావించబడిన శ్రీ లలితా రహస్య నామ సహస్ర స్తోత్ర కధనం. 

ప్రథమోధ్యాయంలో పూర్వపీఠిక, ద్వితీయోధ్యాయంలో సహస్రనామస్తోత్రము, 

తృతీయోధ్యాయంలో ఉత్తరపీఠిక చెప్పబడినాయి. 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

॥ఇతి శ్రీలలితాసహస్రనామావళిః సంపూర్ణమ్॥  

 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


కౌండిన్యస గోత్రీకులైన శ్రీ భట్టిప్రోలు వెంకట్రామన్, శ్రీమతి రాధారుక్మిణి గార్ల రెండవకోడలు, 

భారద్వాజస గోత్రీకులైన శ్రీ నందివాడ శ్రీరామకృష్ణశర్మ, శ్రీమతి లీలాకుమారి గార్ల పెద్దకూతురు,  

శ్రీ భట్టిప్రోలు రమేష్ కుమార్ గారి ధర్మపత్ని అయిన శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి  అను నేను 

శ్రీలలితాపరమేశ్వరి పాదపద్మాలకు సమర్పించుకుంటున్న భక్తిపుష్పం, "శ్రీలలితావిజయం",

శ్రీ లలితాదేవి అనుగ్రహంతో వ్రాసిన, శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర సరళవ్యాఖ్యానం. 


సర్వం శ్రీ లలితా పరాభట్టారికా చరణారవిందార్పణమస్తు

ఓం తత్ సత్

------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

          

శ్రీలలితావిజయం పాఠకులందరికీ కొన్ని సూచనలు

శ్రీలలితావిజయం పాఠకులందరికీ కొన్ని సూచనలు

చాలామంది మాకు కొన్ని శ్లోకాలు పోయాయండీ, పొరపాటున డిలీట్ చేసాము, అనో,

 లేదా 

మొదటి నుంచీ చదవలేక పోయాము, అవి అన్నీ పంపించండి అనో,

లేదా 

ఫోన్ లో, లేదా సిస్టమ్ లో ఎన్నాళ్లని దాచుకోగలం, స్పేస్ అయిపొయింది అనో,

అనుకునే వారందరికీ కొన్ని సూచనలు. 

మీరు ఇవి అన్నీ దాచుకోవలసిన అవసరం లేదు. 

1. మీరు వాడే సెర్చ్ ఇంజన్ లో తెలుగులో, శ్రీలలితావిజయం, అని టైపు చేస్తే, ఆ సెర్చ్ లో 

మీకు ఈ సైట్ దొరుకుతుంది. 

లేదా

2. మీరు వాడే సెర్చ్ ఇంజన్ లో, www.moddeep.blogspot.com  అని టైపు చేస్తే కూడా మీకు 

ఈ సైట్ దొరుకుతుంది. లేదా ఈ పోస్ట్ ఒక్కటీ ఉంచుకుని ఈ బ్లూ లెటర్స్ ని ప్రెస్ చేసినా చాలు.  

లేదా

3. ఏదైనా ఒక్క శ్లోకం దాచుకోండి. చాలు. 

ఇప్పుడు ఈ 1, 2, 3 స్టెప్స్ లో ఏదో ఒకటి చేసాక 

కంప్యూటర్ లో సెర్చ్ అలవాటు ఉంటే సరే, లేకపోతే ఈ స్టెప్స్ పాటించండి. 

1. ఆ వచ్చిన లింక్ ప్రెస్ చేయండి. 

2. దాని కింద వరకూ వెళ్లి, అక్కడ 'go to web page' అని ఉంటుంది. దానిని ప్రెస్ చేయండి. 

మీకు అక్కడ లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్, దాని కుడి పక్కన, మొత్తం ఇండెక్స్, విషయసూచిక 

ఉంటుంది. ఆ ఇండెక్స్ సంవత్సరం వారీగా, మళ్ళీ దానిలో నెలల వారీగా, మళ్ళీ దానిలో శ్లోకం 

వారీగా ఉంటుంది. మీకు కావలసిన శ్లోకాన్ని ప్రెస్ చేస్తే,  అది చదువుకోవచ్చు. 

అవసరం అనిపిస్తే నా ఫోన్ నంబర్ కి కాల్ చెయ్యచ్చు. 

కనుక అన్ని పోస్టులూ దాచుకోవలసిన అవసరం లేదు. 

ఇంకా e book, యు ట్యూబ్ ఆడియో లింక్ కూడా చేసే ఆలోచన ఉంది. అవి సిద్ధం అయినాక బ్లాగ్ 

లో, మరియు గ్రూప్ లో ఇంటిమేట్ చేస్తాను. పుస్తకం అచ్చు వేయించడం కనుక చేస్తే, మీకందరికీ 

తెలియపరుస్తాను. చూద్దాం, ఈ సంకల్పం ఎంతవరకు నెరవేరుతుందో, అంతా లలితాదేవి కృప.

మీ అందరి ఆదరాభిమానాలకూ కృతజ్ఞతలు. లలితామాత ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ 

వుండాలని ఆ తల్లిని ప్రార్ధిస్తూ, 

🙏🙏🙏🙏🙏

మీ భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650










ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు

 


సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర-
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ ।
పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్

ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు

శ్రీలలిత కృప వలన ఈ బృహత్తర యజ్ఞం ఆరునెలల పాటు నిర్విఘ్నంగా, దిగ్విజయంగా, నిరాఘాటంగా సాగింది. ఈ రచనా క్రమంలో, సహకరించిన ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు చెప్పుకుందామని ఇది రాస్తున్నాను. 

మా చిన్నప్పుడు మేము తెనాలిలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు, శ్రీ శ్రీరామకృష్ణశర్మ గారు,  అక్కడ తాలూకా జూనియర్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఉండేవారు. ఆరోజుల్లో, మా కాలేజీకి, దాదాపుగా ప్రతి సంవత్సరం కంచి పీఠం, శృంగేరి పీఠం, కుర్తాళం పీఠం, గాయత్రీపీఠం వారు వచ్చేవారు. ఆ స్వామివార్లు పీఠం పెట్టి, పూజాదికాలు నిర్వహించి రోజూ సాయంత్రాలు, స్కూల్లో ప్రవచనాలు చెప్పేవారు. చిన్నప్పుడు నేను ఏడు, ఎనిమిది క్లాసుల్లో చదువుకునే రోజులనుంచీ కూడా, ఈ ప్రవచనాలు దాదాపు రోజూ వినేదాన్ని. మానాన్న ఒక నోట్ బుక్ లో 'నచ్చిన పాయింట్లన్నీ రాసుకో' అని చెప్పేవాడు. నేను ఒక నోట్ బుక్, పెన్ను తీసుకెళ్లి రోజూ రాసుకునేదాన్ని. ఆ బుక్ ఇప్పుడు ఏమయ్యిందో తెలియదు. బహుశా, మా నాన్నగారి ట్రాన్సఫర్లలో ఎక్కడో, ఏ వూళ్ళోనో, వదిలేసి ఉంటాం. 

ఆ రోజుల్లో శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి చెప్పే విషయాలన్నీ మైండ్ లో దూరిపోయాయి. కాకపోతే, ఆ చిన్న వయసులో, వాటి విలువ అంతగా తెలియలేదు నాకు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞాపకశక్తి వలన, అవి అన్నీ మొదట్లో పాసివ్ మెమోరీలో ఉండిపోయినా, రానురానూ యాక్టీవ్ మెమోరీలోకి వచ్చేశాయి. ఆ విధంగా నాకు లలితాదేవిని పరిచయం చేసిన తొలిగురువు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు. స్వామివారికి భక్తి శ్రద్దలతో పాదాభివందనాలు. అప్పుడు వారికి ప్రత్యక్షంగా పాదనమస్కారం చేసినా దాని విలువ నాకు తెలియదు, అందరూ పెడుతున్నారు, నేనూ పెట్టాను, అంతే. ఇప్పుడు పరోక్షంగా చేస్తున్నప్పటికీ, దీని విలువ తెలుసు. అదీ తేడా. 

ఆ రోజుల్లోనే మా స్కూల్లో ఒక సంవత్సరం సాధు పరిషత్ వారి అఖిల భారతీయ సదస్సు జరిగింది. అన్ని రాష్ట్రాల నుంచీ వందలాది సాధువులు వచ్చారు. వారిలో ఒకరు శ్రీ సచ్చిదానంద సరస్వతి. వీరికి తెనాలి నచ్చి, చాలకాలం పాటు తెనాలిలో, మాఇంట్లోనే ఉండిపోయారు. మా అమ్మ, లీలాకుమారి, ఉత్తమ గృహిణి, వీరికీ, వీరి అనుయాయులకీ కూడా మడి కట్టుకుని, భోజనాలు వండి పెడుతూ ఉండేది. సచ్చిదానందసరస్వతీస్వామి కేరళీయులు. ఇంగ్లీష్ భాష మాత్రమే మాకూ వారికీ అనుసంధాన భాష. ఆయనను ఇంగ్లీష్ స్వాములవారు అనేవాళ్ళం. మా పిల్లలందరినీ కూర్చోపెట్టి, సరస్వతీ మంత్రం చెప్పి, 'రోజూ చెప్పుకోండి, చదువు బాగా వస్తుంది' అనేవారు. నాకు ప్రత్యేకంగా పిల్లలందరికీ చెప్పిన మంత్రం కాకుండా బీజాక్షరాలతో వుండే సరస్వతీ మంత్రం, రామమంత్రం చెప్పారు. అవి ఇప్పటికీ చెప్పుకుంటూనే వుంటాను. ఆ సరస్వతీదేవి కటాక్షం వలననే, నేను ఈరోజు ఈ శ్రీలలితావిజయం రాయగలిగాను అనుకుంటాను. పైగా ఈ ఇంగ్లీష్ స్వామీజీ, రోజూ నాకు విధిగా పది భగవద్గీత శ్లోకాలు తాత్పర్యంతో అప్పచెప్పాలని కండిషన్ పెట్టారు. దాంతో రోజూ  తప్పనిసరిగా ఆ వయసులోనే శ్రీమద్భగవద్గీత అలవాటయింది. అప్పట్లో 'రోజూ ఇదేం బాధ' అనుకునేదాన్ని. ఇప్పుడు వాటి విలువ తెలుస్తోంది. ఆ ఇంగ్లీష్ స్వామీజీకి మనసారా వందనాలు.

తెనాలిలో ఆ స్కూల్లో మాకు సిలబస్ లో, సంస్కృతం కూడా ఉండేది. పదవ తరగతి వరకూ, నేను, నా పెద్దచెల్లెలు భారతలక్ష్మి సంస్కృతం చదువుకున్నాం. ఇది కాక, సాయంత్రాలు స్కూల్ మూసేసాక, సంస్కృతంలో, ఓ ఎక్సట్రా క్లాస్ ఉండేది. దాన్లో రఘువంశం వంటి కావ్యాలు చెప్పించేవారు. ఈ ఎక్సట్రా క్లాస్ మాత్రం ఆసక్తి వున్నవారికి మాత్రమే. నాకూ, మా భారతికీ 
ప్రిన్సిపాల్ గారి పిల్లలమవటం చేత ఆ ఆప్షన్ ఉండేది కాదు. రోజూ ఇంకో గంట ఎక్కువ వుండి మరీ నేర్చుకునే వాళ్ళం. కంచి స్వామీ, ఆయన ప్రవచనాలు, ఇతర పీఠాధిపతుల ప్రవచనాలూ అవీ వేరే, అవి అదనం. ఆరోజుల్లోనే మా సంస్కృతం టీచర్ మారారు. రెండో ఆయన మొదటి టీచర్ కన్నా ఘటికుడు, కఠినుడు. క్లాస్ లో అంతా సంస్కృతం లోనే రాయాలనీ, చెప్పాలనీ, మాట్లాడాలనీ నిబంధనలు కూడా పెట్టాడు. ఏం చేస్తాం, అలాగే మాట్లాడేవాళ్ళం, 'వినేవాళ్లకు కదా ఇబ్బంది, మనదేం పోయిందీ', అని. అప్పుడు ఏం అనుకున్నా, ఈ నాటికీ, నా సంస్కృత భాషా జ్ఞానానికి పునాదిరాళ్ళు వాళ్ళే. వాళ్లందరికీ శత సహస్ర వందనాలు. 

ఇది కాక తెలుగు క్లాస్ వేరే. చిన్నక్లాసుల్లో తెలియలేదు కానీ, ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి తెలుగుపై ఇష్టం, ఆసక్తీ పెరిగాయి. దొరికిన ప్రతి పుస్తకం చదివేదాన్ని. లైబ్రరీలో, స్టూడెంట్లకి సాధారణంగా అన్ని రిఫరెన్స్ పుస్తకాలూ ఇవ్వరు. నేను మా నాన్న పేరుతో తీసుకుని మరీ  చదువుకునేదాన్ని. అసలు చదువులో ఎబోవ్ యావరేజ్, ఇటువంటి చదువులో నెంబర్ 1. అందరూ కోప్పడేవాళ్లు, తిట్టేవాళ్ళు. 'అబ్బే, నాకేం తగలలా', తోసేసుకుని తిరిగేదాన్ని. మొత్తానికి ఈ సంస్కృతం, తెలుగు టీచర్ల పుణ్యమా అని కాస్త ఉభయభాషాజ్ఞానం అంటింది. ఆ టీచర్లందరికీ శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. 

ఈ మధ్యకాలంలో, అంటే 2011లో, కుర్తాళం పీఠాధిపతి, శ్రీసిద్ధేశ్వరానందభారతి గారి వద్దకు నా అవసరం కొద్దీ, మా పెదనాన్నగారి కొడుకు, కోడలు, చిన్నన్నయ్య, చిన్న వదినలతో వెళ్ళటం జరిగింది. మా వదిన, సుశీలాదేవి స్వామివారి శిష్యురాలు. కానీ నా అదృష్టం కొద్దీ, వారు నాకు మంత్రం ఇచ్చి, నన్ను కూడా శిష్యురాలిని చేసుకున్నారు. అప్పటినుంచీ వారి ప్రసంగాలు వినటం బాగా అలవాటు అయింది. అలాగని నేనేదో స్వామివారి వెన్నంటి తిరిగానని కాదు. వారి గ్రంధాలు చదవటం, వారి ప్రసంగాలు యు ట్యూబ్ లో వినడం, కొన్నేళ్ల పాటు చేసాను. ఆయన మహా జ్ఞాని, సిద్ధుడు, ఉపాసకుడు, యంత్ర, మంత్ర, తంత్ర శాస్త్రాల్లో మహా పండితుడు. భూమ్మీద నడయాడే మహాత్ముడు. వారి పరిచయం కలగటం కూడా నాలో ఒక మార్పుకి దారి తీసింది. గురువుగారికి శతకోటి ప్రణామాలు. 

ఒకసారి మా పెద్ద మామయ్యగారు, శ్రీ దాలిపర్తి సత్యనారాయణగారు నాకు గీతామకరందం ఇచ్చి చదవమన్నారు. అది చదువుతూ అలవాటుగా, నచ్చిన శ్లోకాలని ఒక డైరీలో రాసుకునేదాన్ని. 
భగవద్గీతతో నా మలి ప్రయాణం అది. హైదరాబాద్ వచ్చాక, మా ఇంకో మామయ్యగారు శ్రీ ముళ్ళపూడి సుబ్బారావు గారు, నాకు లలితాసహస్రనామస్తోత్రం పుస్తకం ఇచ్చి రోజూ పారాయణ చేసుకోమన్నారు. అప్పటికే, నాకు విష్ణుసహస్రనామస్తోత్రం పారాయణం చేయటం అలవాటుగా వుండేది. దీనితో, బస్సులో రోజూ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక స్తోత్రం, తిరిగి వచ్చేటప్పుడు ఒక స్తోత్రం చదవడం నిత్యం అలవాటయిపోయింది. సెలవల్లో పారాయణలు లేవు. వీరిద్దరికీ నా  నమస్సుమాంజలులు. 

ఉద్యోగాల నుంచి మావారు, నేను రిటైర్ అయిన తరువాత, కొన్నేళ్లపాటు వరుసగా ప్రతినెలా ఏదో ఓ ప్రాంతానికి టూర్లు చేసేవాళ్ళం. దాదాపుగా భారతదేశం మొత్తం తిరిగాం. నేపాల్, టిబెట్, శ్రీలంక కూడా వెళ్ళాం. ఈ సందర్భంగా అన్ని శక్తి క్షేత్రాలు, శివక్షేత్రాలు, విష్ణుక్షేత్రాలు, సూర్య, కార్తికేయ, గణపతి, హనుమ క్షేత్రాలు, చారిత్రాత్మక ప్రధాన క్షేత్రాలు, సరదాగా తిరిగే విహారయాత్రా ప్రదేశాలూ, ఇలా దాదాపుగా అన్ని ప్రముఖ, ప్రధాన పర్యాటక ప్రాంత్రాలన్నీ దర్శించుకున్నాం. ఎప్పుడూ లోపల ఇంకా ఏదో చేయాలని ఆరాటంగా ఉండేది. ప్రయాణోపనిషత్ అని పేరు పెట్టి, మేము తిరిగిన కొన్ని క్షేత్రాల పర్యటనా విశేషాలు రాసాను. అవి ఇంకా చాలా రాయాలి. సుమారు మేము తిరిగిన వాటిలో ఓ ఇరవై శాతం వరకు ఇప్పటికి రాసి ఉంటా. మిగిలిన ఎనభైశాతం ఎప్పుడు రాస్తానో నాకే తెలియదు. కానీ రాయాలని మాత్రం మనసులో వుంది. ఇంతవరకూ రాసిన క్షేత్రాల గురించి చదవాలనే ఆసక్తి వున్నవారు 
www.moddeep2.blogspot.com లో అవి చదువుకోవచ్చు. 

సుమారు మూడు నాలుగేళ్ల క్రితం చాలా యాదృచ్చికంగా భాస్కరరాయలవారు రాసిన సౌభాగ్య భాస్కర భాష్యం పుస్తకం దొరికింది. నేను ఈ పుస్తకం అంతకు ముందే మా సువర్చల అత్తయ్య దగ్గర చూసాను, చదివాను. కానీ ఆ ప్రతి చాలా జీర్ణావస్థలో వుంది. మంచి కాపీ దొరకలేదు. చివరకు డా. నోరి భోగీశ్వరశర్మ సోమయాజి గారు ఆ పుస్తకాన్ని పునః ప్రచురించి మాలాంటి వారికి ఎంతో 
ఆనందాన్నిచ్చారు. ఆ పుస్తకం కొనుక్కుని భాస్కరరాయ భాష్యం తీరికగా చదివాను. అయినా నేనే రాయాలని లోపల్లోపల అనిపించినా, బద్ధకం వలన రచన మొదలుపెట్టలేదు. తిరిగి భాస్కరరాయ భాష్యం నాలాంటి వారికి అందుబాటు లోకి తెచ్చిన బ్రహ్మశ్రీ నోరి భోగీశ్వరశర్మ సోమయాజి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.  

నేను రాస్తున్న శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం లోని సహస్రనామాలకూ సరళమైన భాషలో 
రాస్తున్న ఈ  వ్యాఖ్యానం అనే భగవత్ కార్యంలో నాతో పాటు పయనించినవారు ప్రధానంగా 
ముగ్గురు. ఆ ముగ్గురికీ నా కృతజ్ఞతలు.  

ఒకరు నిరంతరం నాతో  ఉంటూ, అన్నింటా సహకరిస్తూ, నేను రాసిన దానిని ప్రధమ శ్రోతగా వింటూ, నా లాప్ టాప్ ఇబ్బంది పెట్టినప్పుడు, దానిని సరిచేయిస్తూ, నన్ను రాయమని నిరంతరం ప్రోత్సహిస్తూ వుండే, మావారు శ్రీ భట్టిప్రోలు రమేష్ కుమార్ గారు. వారికి నా పాద నమస్కారాలు. వీరి సహకారం లేనిదే ఈ పని అయ్యేదే కాదు. 

ఇంకొకరు, 'నీకే ఉడుత సాయం కావాలన్నా చెప్పు, నేనున్నా',  అంటూ, నాకు అవసరమైనప్పుడల్లా టెక్నికల్ హెల్ప్ వెంటనే చేసే, మా సరోజినీ అత్తయ్య కూతురు. నేను నా 'బంగారు ఉడుత' అని ముద్దుపేరు పెట్టుకున్న, నా టెక్నికల్ హెల్ప్, సౌభాగ్యవతి లక్ష్మీరాధిక. నా చిన్నారి చెల్లి, 
రాధికకు కృతజ్ఞతలు, ఆశీర్వచనాలు.  

మూడవవారు, మా సువర్చల అత్తయ్య. ఈ అత్తయ్య మా మేనమామ శ్రీ నండూరి పార్థసారథి గారి భార్య. మాకు చిన్నప్పటి నుంచీ బాగా అలవాటు. తాను ఈ విషయాలన్నింటిలో తన చిన్నప్పటి నుంచీ ఎంతో విశేషంగా కృషి చేసి, సాధన చేసిన పండితురాలు. అత్తయ్య పాండిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. మావారు నా ప్రధమ శ్రోత అయితే, అత్తయ్య నా ద్వితీయ శ్రోత. నేను రాసినదంతా ఓపిగ్గా వినేది. ఈ ఆరు నెలల్లో మామధ్య ఎన్ని కాల్స్ నడిచాయో, అవి ఎన్ని గంటలు సాగాయో. ఇంతకూ ముందు కూడా ఏదైనా సందేహం వస్తే, అత్తయ్య తో టెలిఫోన్ సంభాషణలు సాగించటం అలవాటే. ఇద్దరిలో ఎవరిదో ఒకరి ఫోన్ డెడ్ అయ్యేదాకా మాట్లాడుకునే వాళ్ళం. మా మామయ్య కూడా మీరు మాట్లాడుకుంటే అవి గంటలు గంటలు సాగుతాయి 
అనేవాడు. ఆ మా చర్చలన్నీ నేడు ఈ పుస్తకం రావడానికి ఏంటో దోహదం చేశాయి.  అత్తయ్యకి నాలోని మథన తెలుసు, నాకు అత్తయ్య విద్వత్తూ, ఉపాసనా తెలుసు. నేను రాసిన ప్రతిదీ అత్తయ్య విని ఓకే అన్నాకే పోస్ట్ చేసేదాన్ని. శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టు, అత్తయ్య విని ఓకే అంటే, అదో తృప్తి, అత్తయ్య ఊ అన్నది కదా అని. నాకు ఎంతో ప్రేరణా, ప్రోత్సాహం, ధైర్యం  ఇచ్చిన అత్తయ్యకి నా కోటి కోటి ప్రణామాలు. లలితాదేవే అత్తయ్య రూపంలో నా వెనుక వుండి ఈ రచన చేయించి ఉంటుంది. 

ఇలా సాగింది ఈ లలితా సహస్ర నామ స్తోత్ర సరళ వ్యాఖ్యానం ప్రయాణం. మధ్యలో ఎందరో, చదివి చాలా బాగుందని అభినందించి ప్రోత్సహించారు. వారందరికీ నా కృతజ్ఞతలు. 
వారం రోజులనుంచీ తమ అమూల్యమైన అనుభవాలు, అభిప్రాయాలు వెలిబుచ్చుతూ అభిమానం ప్రకటించిన వారందరికీ నా మనఃపూర్వక నమస్సులు. 
ఇందరి దీవెనలు, సహకారం నాతో ఉన్నందుకే నేను ఈ శ్రీలలితావిజయం రాయగలిగాను. 
ఇది ముమ్మాటికీ సత్యం. అందుకే, వారందరికీ మనసారా ...  



ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 

🙏🙏🙏



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

          

 

శ్రీమతి నండూరి సువర్చలాదేవి గారి అభినందన

 శ్రీమతి నండూరి సువర్చలాదేవి గారి అభినందన

అమ్మలగన్న అమ్మ, శ్రీమాత ప్రేరణతో శ్రీలలితా సహస్రనామాల రహస్యవివరణ వ్రాసింది విజయలక్ష్మి. ఈ వివరణ జలపాతంలా, అందంగా, సరళంగా సాగింది. ఇక దీనికి పరిచయవాక్యాలు వ్రాయబూనటం సాహసమే. ఇటువంటి భగవత్ స్తోత్రాలు, భాష్యం చదవాలనుకునే భక్తులకు ఈ ముందు మాటలు అవసరం లేదు. 

జీవన సరళి కర్మతో ప్రారంభం అవుతుంది. కర్మల వలన కలిగే సుఖదుఃఖానుభూతులన్నీ భక్తిని ప్రేరేపిస్తాయి. కర్మ ద్వారా, భక్తి ద్వారా, ఉపాసనను ఎంచుకుంటాము. కర్మ, భక్తి, ఉపాసనలు జ్ఞానం కోసం తపింపచేస్తాయి. జ్ఞానతపన భాష్యాలను, వ్యాఖ్యానాలను చదివింపచేస్తుంది. 

శ్రీలలితావిజయం చదువరులకు ఆ జ్ఞానతపనకు పునాదులు వేస్తుంది అనటానికి సందేహం లేదు. శ్రీమతి విజయలక్ష్మి "విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపఱతు", అన్నంతగా తన సాధన, అనుభవాల మేళవింపుతో అతిసరళంగా, సహజంగా, 
ధారగా, అత్యంత మధురంగా వ్రాసింది. 

ఎంతని వ్రాయను, ఏమని పొగడుదు, శ్రీ లలితావిజయం వివరణ విశేషం. ఏమి వ్రాసినా, ఎంత 
వ్రాసినా తక్కువే. చదివి, మననం చేసి, అనుభవాలు పొందగలగటం అమ్మ అనుగ్రహమే. ఈ పుస్తకం అందరికీ అమ్మ అనుగ్రహం ప్రసాదిస్తుందని నమ్ముతున్నాను. 


-------------నండూరి సువర్చల








21, జనవరి 2022, శుక్రవారం

శ్రీమతి ఆకెళ్ళ గిరిజ అభిప్రాయం

 శ్రీమతి ఆకెళ్ళ గిరిజ అభిప్రాయం 


నువ్వు రాసిన శ్రీ లలితా విజయం లో ఒక్కొక్క నామానికి వివరణ చాలా చాలా బావుంది. చాలా సరళంగా, ఎంతో సింపుల్ గా, ఎవరికైనా సులభంగా అర్ధం అయ్యేలాగా రాయగలగడం నీ పూర్వజన్మ సుకృతం, దేవుడిచ్చిన అదృష్టం. 

రోజూ ఒక శ్లోకం తీసుకుని, అన్ని నామాలకి అంత వివరంగా వివరించడానికి నువ్వు యెంత కష్టపడ్డావో, నీ కమిట్ మెంట్ కి, రమేష్ గారి కోఆపరేషన్ కి, సత్తా కోటి నమస్కారాలు. దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి, ఇలాగే అన్నీ రాయించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 

నీ చిన్ననాటి స్నేహితురాలు. 


-------------Dr. Akella Girija 



శ్రీ ద్రోణంరాజు వేంకట శ్రీరామచంద్రమూర్తి గారి అభిప్రాయం

శ్రీ ద్రోణంరాజు వేంకట శ్రీరామచంద్రమూర్తి గారి అభిప్రాయం 

 

ఒక ఆలోచన వీచిక...

మా ఊరి గురించో, విహార, సంసార, వివరాల గురించో రాయాలంటే కావాల్సింది ఆలోచన.. వివేచన.. అవగాహన.

చిరు ప్రాయం నుంచే ఆ జిజ్ఞాస - దానికి ప్రోత్సాహం లభించడం విశేషం. సాధు సత్సంగం లో పాల్గొనడం - పండిత సభల్లో సమావేశాల్లో ప్రత్యక్ష గ్రాహ్యత తో పాటు నండూరి - నందివాడ కుటుంబ జీన్స్ (వంశీ కృతం) లీలా మాత్రంగా కలిసి వచ్చాయి అనుకోవాలి.

ఆ తర్వాత బోధనా వ్యాసంగం ఎలాగూ ఉన్నదే!!

వీటితో పాటు ఏదో రాయాలన్న ప్రగాఢ కాంక్ష, వేద సాహిత్యం సంస్కృత ప్రవేశాల కలయికతో పాటు సాక్షాత్ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి - అందుకే సరైన భావ గాంభీర్యంతో లాలిత్యంతో హృదయ స్పందనతో అక్షరరూపంగా వెలసినది ఈ "లలితా సహస్రనామ సరళమైన వ్యాఖ్యానం".

ఇది భట్టిప్రోలు వారి సహకారంతో నందివాడ విజయలక్ష్మీ ఆచరించిన శ్రీ లలితా మహా యజ్ఞం. ఈమెతో కుటుంబం అంతా ధన్యం.

శుభం భూయత్!! 🙏

******

------ ద్రోణంరాజు వేంకట శ్రీరామచంద్ర మూర్తి

శ్రీమతి మాధవపెద్ది ఫణి రాధాకుమారి గారి అభిప్రాయం

శ్రీమతి మాధవపెద్ది ఫణి రాధాకుమారి గారి అభిప్రాయం

 శ్రీ లలితా విజయం

(శ్రీ లలితా సహస్రనామ సరళ వ్యాఖ్యానం)

లలితా సహస్రనామాలపై సరళ వ్యాఖ్యానం వ్రాయాలనే విజయలక్ష్మి భట్టిప్రోలు గారి సంకల్పం చాలా గొప్పది.ఒక్కొక్క నామానికి ఆవిడ వ్రాసే వ్యాఖ్యానం చదువుతూంటే, విషయం ఇట్టే తేటతెల్లమవుతుంది. అంతేకాదు, ఇన్నాళ్ళూ నేను లలితాసహస్రనామాలు అర్ధం పూర్తిగా తెలుసుకోకుండా పారాయణం చేస్తున్నాననే విషయం కూడా నాకు తెలిసింది. 

నేను ఎన్నో ఏళ్ళుగా లలితాసహస్రనామ పారాయణ యాంత్రికంగా చేస్తున్నా ఈమధ్యనే అందులోని నామాలకు ఉన్న అర్ధాలను తెలుసుకోవాలని అన్పించటం, భట్టిప్రోలు విజయలక్ష్మిగారి సరళ వ్యాఖ్యానం చూడటం కాకతాళీయంగా సంభవించింది.


రోజుకొక శ్లోకం చొప్పున అవి తెలుసుకుంటూ చదువుతూఉంటే, ఎంతో ఆనందంగా అన్పించింది.
ప్రతి నామానికీ ఉన్న అర్ధాన్నీ, ప్రాముఖ్యతనూ విజయలక్ష్మి వివరించే విధానం, అందరికీ అర్ధమయ్యే చిన్నచిన్న పదాలతో విశదీకరించి చెప్పటంతో  ప్రతినామం యొక్క విశిష్టత చక్కగా అర్ధమయింది. 

ఒక్కొక్క ముత్యాన్ని గుదిగుచ్చి అందమైన ముత్యాలహారాన్ని తయారుచేసే విధంగా అమ్మవారి ఒక్కొక్క నామాన్ని విశదీకరించి, సహస్రనామ హారాన్ని సమకూర్చిన విధానం బహుధా ప్రశంసనీయం. 

అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఈ శ్రీ లలితా విజయాన్ని విజయవంతంగా పూర్తిచేయటం జరుగుతుంది. విజయలక్ష్మి ఇదేవిధంగా మరెన్నో వ్యాఖ్యానాలను విశదీకరించి మనకందించాలనీ, ఆమెకూ, ఆమె కుటుంబానికీ ఆ జగదీశ్వరి ఆయురారోగ్య  ఆనంద ఐశ్వర్యాలనూ అనుగ్రహించాలనీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.


   ------------ మాధవపెద్ది ఫణిరాధాకుమారి

శ్రీమతి లోకా అపర్ణ గారి అభిప్రాయం

 

శ్రీమతి లోకా అపర్ణ గారి అభిప్రాయం 


నా జీవితం లో నేను ఒక రోల్ మోడల్ గారు భావించే విజయలక్ష్మి మేడం గారికి పాదాభి వందనాలు.

నేను మీరు చేసిన ఈ అద్భుతమైన లలిత సహస్రనామ వివరణను గురించి మాట్లాడే స్థాయికి 
ఎదగలేదు. నా అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాను, తప్పులుంటే మన్నించగలరు. మీ వివరణ పెద్దగా భాషా జ్ఞానం లేనివాళ్లకు కూడా అర్థం అయ్యే విధంగా సరళంగా ఉంది. సరళంగా ఉండటం తో పాటు, భాష అందాన్ని కూడా తగ్గకుండా, ఎంతో అద్భుతంగా వివరించారు. మీ ప్రతి పనిలో సంపూర్ణమైన సాధికారత చూపుతూ, వివరణ ప్రారంభం, మధ్యమం, సమాప్తం అన్నిటిలోనూ
మీకంటూ వైవిధ్యమైన శైలి ఉండి, మీ కష్టం తెలుస్తోంది. మీరు మనసు పెట్టి చేశారు. 
ఆ లలితా పరాభట్టారిక మీ తోనే ఉంది. మీ అదృష్టంలో మాకు కూడా భాగాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ,

మీ అపర్ణ.

మీరు ఈ వివరణ ను పుస్తకీకరణ చేస్తే, భావి తరంలో వారికి కూడా ఉపయోగపడుతుంది మేడం గారు.

🙏🙏🙏

----------------లోకా అపర్ణ

శ్రీమతి ఉమాదేవి గారి అభిప్రాయం

శ్రీమతి ఉమాదేవి గారి అభిప్రాయం 

శ్రీమతి విజయ లక్ష్మి గారికి, 

నమస్కారములతో,
  
మీరు వ్రాస్తున్న లలితా సహస్ర నామ వివరణ మొదటి నుంచి చాలా ఆసక్తిగా చదువుతున్నాను. నాకు చాలా నచ్చింది. మా ఫ్రెండ్స్ కి కూడా ప్రతి రోజు నేను చదివిన వెంటనే పంపుతున్నాను. 
ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులగు దగు వారు చదువుతున్నారు. అమ్మవారి ప్రతీ నామ వివరణ కూడా పండిత పామర జనకంగా అనిపించింది నాకు. మీ వివరణతో ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి. వాగ్దేవతలు, కళలు, కావ్యాలు, తంత్ర విద్యలు, షోడశీ విద్యలు, తిధి నిత్యాది దేవతలు మొదలగు వాటి గురించి తెలిసింది. 

శ్రీ లలిత అమ్మవారు ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ రూపాలలో ఉంటుంది, ఆ మాత శక్తి ఎలా ఉంటుంది, మనం అమ్మ వారిని ఎలా ధ్యానించాలి, అనుగ్రహం ఎలా పొందాలి, దుష్ట శిక్షణ ఎలా చేసింది, అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ పువ్వులతో, ఏ పదార్థాలతో, ఏ ఏ వేళలో పూజిస్తే అమ్మ ప్రసన్నురాలవుతుంది, అనే విషయాలని విపులంగా విశదీకరించారు. అంతే కాకుండా శ్రీ భాస్కర రాయల వారి గురించి మాకు తెలియచెప్పారు. గత ఆరు మాసాలుగా ఆనందంతో కూడిన శ్రమతో మా కందరికి ఆధ్యాత్మిక విందు చేశారు. మీకు నా  కృతజ్ఞతలు.
 
మూడున్నర సంవత్సరాల క్రితం, నా మానస సరోవరం యాత్రలో మీ పరిచయం కలిగినందుకు చాలా ఆనందం గా ఉంది. అప్పుడు మీ గురించి గానీ, మీ ఆధ్యాత్మిక వికాసం గురించి గానీ, అంతగా తెలియదు. తరువాత ఒక సంవత్సరం నుంచీ, మళ్ళీ అనుకోకుండా మనం కలవడం ముదావహం. మీ జ్ఞాపకాల దొంతర రచనల ద్వారా, మీది చిన్నతనం నుంచీ ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న కటుంబమని తెలిసి చాలా సంతోషం కలిగింది. ఇక మీ ప్రయాణోపనిషత్ రచనల ద్వారా మీరు దర్శించిన పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు, ఇంకా తెలియని అనేక విషయాలు తెలిసాయి.  

ఆ తరువాత కూడా మీరు మీ ఇంట్లో వికసించిన బ్రహ్మ కమలం photos,  హోమం photos etc. నాకు పంపుతూ మన పరిచయం కొనసాగడానికి సహకరించారు. చివరిగా, మీకు, మీ లలితా సహస్ర నామ వివరణను ప్రచురించే ఉద్దేశ్యం ఉంటే అందులో నాకు కూడా భాగస్వామ్యం కలిగించమని కోరుతున్నాను. ఎంతయినా పుస్తకం పుస్తకమే కదా.  ఎంత technology ఉన్నా. 

రమేష్ గారికి నా నమస్కారములు తెలుపగలరు. 


--------------------ఉమాదేవి






శ్రీమతి మహేశ్వరి గారి అభిప్రాయం

శ్రీమతి మహేశ్వరి గారి అభిప్రాయం 


శ్రీ మాత్రే నమః🙏 

మీరు వ్రాసిన లలితా మాత నామాల యొక్క విశ్లేషణ చాలా చక్కగా, సరళంగా, చాలా ఆసక్తిగా ఎవరికైనా కూడా సులువుగా అర్థమయ్యే రీతిలో అద్భుతంగా ఉంది. నామాల యొక్క రహస్య విశ్లేషణ చాలా బాగా వివరించారు. చక్రాల గురించి వివరించారు. సాధన ఏ  భాగాల్లో ఎలా  జరుగుతుందో కూడా చక్కగా వివరించారు. ఎన్నో కొత్త విషయాలను మాకు తెలిపారు. అప్పుడే అయిపోయిందా అనిపించే లాగా ఎంతో బాగా, ఎంతో శ్రమపడి, మా కోసం చాలా పరిశ్రమ చేశారు. 
మీకు చాలా ధన్యవాదములు. నేను మిమ్మల్ని సహస్ర నామాలు వివరణ గురించి అడిగినప్పుడు,  చెప్పుకుందాం అన్నారు. నాకు 'అయ్యో నేను ఒక్కదాన్నే వింటే ఎలా', అనే బాధ ఉండింది.  ఆశ్చర్యంగా మీరు వెంటనే పోస్ట్ చేస్తాను, అని చెప్పగానే నేనెంతో ఆనందించాను. అన్ని నామాలు వివరణ అయిపోయింది. చదివాను. చదివినప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ కొన్ని నామాల అర్ధం మర్చిపోతూనే ఉన్నాను. కానీ నా మార్గం మాత్రం మరువలేదు. ఎక్కడ మధ్యలో మొదలుపెట్టినా
కూడా పారాయణ మాత్రం ఎల్లవేళల మానసికంగా కొనసాగుతూనే ఉంటుంది. నాకు అది బాగా అలవాటైపోయింది. మనసులో నామాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. కానీ నేను ఏనాడు పుస్తకం తీసుకుని బట్టి చేయలేదు, వాటంతటవే వచ్చేసాయి. మళ్లీ మళ్లీ మీ వివరణ చదువుతాను.  మీరు చాలా ఎక్కువే వివరించారు. నాలాంటి వాళ్లకు అది చాలు. ఆంటీ మీరు సరస్వతి మాత నాకు. అంకుల్ చాలా ఓపికగా మీకు సహకరించారు. వారికి కూడా నా నమస్కారములు, ధన్యవాదములు తెలియజేయండి. ఇదంతా లలిత అమ్మవారి అనుగ్రహం వలన సాధ్యమయ్యింది. మీరు ఇలాంటివి ఇంకా ఎన్నో వివరణ ఇవ్వాలని నా కోరిక. బ్రహ్మానంద రసం అనే సముద్రములో ఓలలాడడానికి కావలసిన శక్తిని ఇచ్చి, ఆ మార్గంలో పయనింప చేయమని లలితా మాతని వేడుకుంటున్నాను. మీలాంటి వారి పరిచయం గొప్ప అదృష్టం లాంటిది.  
ఎలాంటి సందేహాలు వచ్చినా మీరు ఎంతో చక్కగా ఓపికగా వివరించేవారు. మీరు ఇలా ఇంకా కొనసాగించాలని,  కొత్త విషయాలను మాకు నేర్పించాలని, మీకు కావలసిన శక్తి అమ్మ ప్రసాదించాలని, వేడుకుంటూ మీకు నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు తెలియజేయుచున్నాను. 

శ్రీ మాత్రే నమః, 🙏



----------------మహేశ్వరి 

182. ఆబాలగోప విదితా, సర్వానుల్లంఘ్య శాసనా శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ

  

ఆబాలగోప విదితా, సర్వానుల్లంఘ్య శాసనా 
శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ ॥ 182 ॥

994. ఆబాలగోప విదితా

బాలుర నుంచి గోపాలుర వరకూ అందరికీ తెలిసిన దేవత అని అర్ధం. 

శ్రీకృష్ణుడు ఇంద్రుడు కురిపించే రాళ్ళ వాన నుంచి యాదవులందరినీ రక్షించటానికి, చిటికిన 

వేలుతో గోవర్ధన పర్వతం ఎత్తి పట్టుకున్నాడు. ఆనాడు ఆబాలగోపాలానికీ ఆ బాల గోపాలుడంటే 

ఏమిటో తెలిసింది. అంటే, పసిపిల్లల నుంచి, పెద్దవారి దాకా ఆ గోకులంలో వారందరికీ శ్రీకృష్ణుని 

మహత్తు విదితమయ్యింది. కనుక శ్రీకృష్ణుడికి ఆనాటి నుంచీ ఆబాలగోపవిదితా అనే నామం 

వచ్చింది. శ్రీకృష్ణుడంటే శ్రీ లలిత అని ఎన్నోమార్లు చెప్పుకున్నాం. నారాయణ నారాయణీ 

రూపాలే కదా వారు. కనుక ఈనామంలో శ్రీలలితను ఆబాలగోపవిదితా అంటున్నాం. 

గోపాలుడంటే పశువులను పాలించే పశుపతి, సదాశివుడు. బాలురంటే, నిత్యమూ బాల్యావస్థలో 

వుండే సనక సనందనాదులు. 

బాలుర నుంచీ సదాశివుడి వరకూ అందరకూ తెలిసిన దేవత శ్రీలలిత అని ఈ నామార్ధం. 

సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులకు శ్రీ లలితాదేవి మాహాత్మ్యం సుపరిచితమే. 

సదాశివుడికి లలితాదేవి అర్ధాంగి. కనుక గోపాలుడైన ఆ పశుపతికీ లలితాదేవి మహత్తు తెలుసు. 

ఆ విధంగా ఆబాలగోపాలానికీ అమ్మ తెలుసు. 

కనుక అమ్మను ఈ నామంలో ఆబాలగోపవిదితా అంటున్నాం. 

నేను పామరుణ్ణి, నాకేమీ తెలియదు అనే వాడికీ అమ్మ తెలుసు. 

నాకన్నీ తెలుసు, నేను సర్వజ్ఞుడను అనుకునే వాడికీ అమ్మ తెలుసు. 

పామరులకు, పండితులకూ అమ్మ మహత్తు, సర్వజ్ఞతా విదితమే.  

ఆబాల గోపాలానికీ తెలిసిన, ఆ ఆబాలగోపవిదిత కు వందనం. 

ఓం శ్రీ ఆబాలగోప విదితాయై నమః  


995. సర్వానుల్లంఘ్య శాసనా

సర్వానుల్లంఘ్యశాసనా అంటే, సర్వ అనుల్లంఘ్య శాసనా అని అర్ధం. 

అంటే ఎవరూ ఉల్లంఘించలేని శాసనములు చేయునది, లేదా శాసనములు కలది అని భావం. 

బ్రహ్మాదులకైనా అమ్మ శాసనం ఉల్లంఘించటం అసాధ్యం. 

అందరికీ అమ్మే కదా అని, చులకన భావంతో కానీ, అతి పరిచయమైనది కదా అనే చనువు చేత 

కానీ అమ్మమాటను నిరాకరిస్తే, నిరాదరణ చేస్తే అమ్మ ఊరుకోదు. 

తాను చేసిన శాసనములను ఎవరూ ఉల్లంఘించకుండా పరిపాలన చేస్తున్న శ్రీమహారాజ్ఞి శ్రీమాత. 

రాజ్యపాలన సవ్యంగా నడవాలంటే, శాసననియమాలను పాటించవలసిందే.

అలా శాసన నియమాలను పాటించకుండా తనది కాని, అమ్మ తనకు అప్పగించని స్వర్గాధిపత్యం 

వంటివి ఆశించిన అసురుల గతి ఏమయ్యిందో అందరికీ తెలుసు. 

కనుక అమ్మ సర్వానుల్లంఘ్య శాసనా. 

సౌందర్యలహరిలో శంకరభగవత్పాదులు, 'బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు తమకు 

అప్పగించిన పంచకృత్యములనూ, నీ ఆజ్ఞ ననుసరించి నీ కనుసన్నలలో చేస్తున్నారు" 

అంటాడు. కనుక ఎవరికైన అమ్మ శాసనమే శిరోధార్యము. 

మన అమ్మే కదా అని తేలికగా చూడరాదు, అని ఈ నామం చెప్తున్నది. 

కానీ అమ్మకు ఏ నియమములూ, శాసనములూ లేవు. ఆమె సర్వానుల్లంఘ్యశాసనా, అంటే అన్ని 

శాసనములూ ఉల్లంఘించ గల ఏకైక శక్తి స్వరూపిణి శ్రీమాత. 

తన భక్తులకోసం అమ్మ తన శాసనాలను తానే ఉల్లంఘిస్తుంది. 

మిగిలిన అవతారాలలో తప్పులు చేసిన వారిని హననం చేసిన పరమేశ్వరి, 

త్రివిక్రముడిగా బలిని కరుణించలేదా. 

ఆయుష్షు తీరిన మార్కండేయుడిని యమపాశం నుంచి రక్షించి, చిరంజీవిగా చెయ్యలేదా. 

భక్తుల కోసం, తన శాసనాలను తానే ఉల్లంఘించగల మహాశక్తి ఆ త్రిపురసుందరి. 

శాసనం చేసినా, శాసనోల్లంఘనం చేసినా, శాసనోల్లంఘనం చేసిన వారిని దండించినా అమ్మకే 

చెల్లు. శాసనమూ, పాలనమూ రెండూ అమ్మ బాధ్యతే కదా.  

అన్యులెవరూ ఉల్లంఘించలేని శాసనములు గల, ఆ సర్వానుల్లంఘ్య శాసన కు వందనం.  

ఓం శ్రీ సర్వానుల్లంఘ్య శాసనాయై నమః  


996. శ్రీ చక్రరాజనిలయా

శ్రీ చక్రరాజమే ఆవాసముగా గల చక్రేశ్వరి అని ఈ నామానికి అర్ధం. 

శ్రీచక్రాన్ని చక్రరాజము అంటారు. 

ఆ చక్రరాజములో నివసించేది కనుక, ఆ శ్రీ రాజరాజేశ్వరిని శ్రీచక్రరాజనిలయా అంటున్నాం. 

శ్రీ చక్రంలో వున్న శివ, శక్తి త్రికోణాలు, శ్రీ చక్రమే శివశక్తుల నివాసమని తెలియచేస్తున్నాయి. 

పంచప్రేతముల మంచము పైన, బిందుస్థానములో,  కామేశ్వరునితో కూడి పవ్వళించే తల్లి 

కామేశ్వరి. శ్రీచక్రమంతా ఆవరించుకుని వున్న శక్తిస్వరూపమే శ్రీలలిత. 

శ్రీచక్రంలో భూప్రస్తారమనీ, మేరుప్రస్తారమనీ, కైలాసప్రస్తారమనీ అనేక రకాలున్నాయని కూడా 

చెప్పుకున్నాం. అన్ని రకములైన ప్రస్తారముల లోనూ కొలువై వున్నది కామేశ్వరీకామేశ్వరులే. 

శ్రీచక్రమే వారి గృహము. కనుక అమ్మకు శ్రీచక్రరాజనిలయా అనే పేరు వచ్చింది. 

శ్రీచక్రమనే ఇంటిలో నివసిస్తున్న, ఆ శ్రీ చక్రరాజనిలయ కు వందనం. 

ఓం శ్రీ శ్రీ చక్రరాజనిలయాయై నమః  


997. శ్రీమత్త్రిపురసుందరీ

త్రిపురసుందరి పరమశివుని భార్య. త్రిపురములంటే బ్రహ్మ, విష్ణు, శివుల శరీరాలని అర్ధం. 

ఆ మూడూ పరమశివుని అధీనంలో ఉంటాయి. పరమశివుని ఇల్లాలు కనుక లలితాపరమేశ్వరిని 

ఈ నామంలో శ్రీమత్త్రిపురసుందరీ అంటున్నాం. 

కాళికాపురాణంలో, "పరమశివుని శరీరము మూడు విధములుగా ఏర్పడింది. ఊర్ధ్వభాగము పంచ 

ముఖములతో, నాలుగు చేతులతో, పద్మకేసరవర్ణమైన తెల్లని శరీరచాయతో, బ్రహ్మస్వరూపము; 

మధ్యభాగములో నీలాంగములతో, ఏక వక్త్రముతో, చతుర్భుజములతో, శంఖ, చక్ర, గదా, పద్మ 

పాణియై విష్ణుస్వరూపము; అధోభాగములో, అయిదు ముఖములు, నాలుగు చేతులతో స్ఫటికము 

వంటి శుద్ధమైన శ్వేతవర్ణముతో, చంద్రశేఖరుడైన శివస్వరూపము ఏర్పడింది. ఆ విధముగా ఒక్క  

పరమశివుడే మూడు ఆకారములతో ఏర్పడ్డాడు. ఈ మూడు పురాలనూ శరీరముగా కలిగినవాడు 

కనుక, పరమశివుడు త్రిపురుడు అని పిలువబడుతున్నాడు", అని వుంది. 

ఆ త్రిపురుని ఇల్లాలు మహాసౌందర్యవతి యైన త్రిపురసుందరి. 

కనుకనే అమ్మను ఈ నామంలో శ్రీమత్త్రిపురసుందరీ అంటున్నాం. 

త్రిపురాలకూ ఈశ్వరుడైన పరమశివుని భార్య, ఆ శ్రీమత్త్రిపురసుందరి కి వందనం. 

ఓం శ్రీ శ్రీమత్త్రిపురసుందర్యై నమః 

  





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

         

20, జనవరి 2022, గురువారం

శ్రీమతి గానుగపాటి సీతామహాలక్ష్మి గారి అభిప్రాయం

శ్రీమతి గానుగపాటి సీతామహాలక్ష్మి గారి అభిప్రాయం 


శ్రీ మాత్రేనమః

విజయలక్ష్మీ!  నీ లలితా సహస్ర నామ వ్యాఖ్యానం చాల బాగుంది. అర్థం తెలుసుకుని చదివితే  చాల హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు ఎవరో రాసినట్టు, ఇది రెలిజియస్ గా అనిపించలేదు.  
అందరిలో దైవాన్ని చూడమన్నట్టు ఉంది. అంతే కాదు, అన్నిటిలో, ప్రకృతిలో దైవాన్ని చూడమన్నట్టు వుంది. దీనికోసం నువ్వు ఎంత కష్టబడ్డావో, అంత వివరంగా మీనింగ్ ఇవ్వటంలో తెలుస్తోంది. థాంక్ యు. 

ఇలాగే చాలా రాసి మాకు అందివ్వాలని, అందుకు దేవుడు నీకు  సహకరించాలని కోరుకుంటున్నాను. రమేష్ గారు చాల సపోర్ట్ చేసి ఇందులో భాగం అయ్యారు.
మీ ఫ్యామిలీకి అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. 


 ------------ గానుగపాటి సీతామహాలక్ష్మి 






181. అభ్యాసాతిశయజ్ఞాతా, షడధ్వాతీత రూపిణీ అవ్యాజ కరుణామూర్తిః, అజ్ఞానధ్వాంతదీపికా

 

అభ్యాసాతిశయజ్ఞాతా, షడధ్వాతీత రూపిణీ 
అవ్యాజ కరుణా
మూర్తిః, అజ్ఞానధ్వాంతదీపికా ॥ 181 ॥

990. అభ్యాసాతిశయజ్ఞాతా

మెలకువగా వున్న ప్రతి క్షణమూ పదేపదే వేదాంత విచారణ చేస్తూ ఉండటం విహితము అని 

వేదము చెప్పింది. ఈ విధంగా ప్రతి నిత్యమూ చేయటం వలన, ఆ అభ్యాసం అలవాటు 

అయిపోతుంది. నిరంతరమూ మననం చేస్తూ ఉంటే అదే రక్షిస్తూ ఉంటుంది. ఈ నిరంతర 

అభ్యాస ప్రక్రియ ద్వారా జ్ఞానము పెరుగుతుంది. 

అతిశయముగా అభ్యాసము చేస్తే, అతిశయముగా జ్ఞానము వస్తుంది. 

అప్పుడు బ్రహ్మాత్మైక్య అనుసంధానము కలుగుతుంది. 

ఆ అనుభవం వలన జ్ఞానం ఇంకా అతిశయముగా వృద్ధి చెందుతుంది. 

వేదములను పదేపదే వల్లె వేయటానికి ఘనాపాఠము అనే పద్ధతి వుంది. 

అలా పాఠము చేసేవారిని ఘనాపాఠి అంటారు. 

శ్రవణం, పఠనం, మననం, స్మరణం వలన జ్ఞాతకు అతిశయముగా విషయజ్ఞానం ఏర్పడుతుంది. 

వ్యాస, కపిల సూత్రాలలో కూడా, అనేక పర్యాయాలు స్మరణము చేయవలెనని వున్నది.

అప్పుడే జ్ఞానం సిద్ధిస్తుంది. దానికే అభ్యాసాతిశయమని పేరు. 

దీనినే, తెలుగులో 'అభ్యాసం కూసు విద్య' అంటాం. 

అభ్యాసం చేస్తూ ఉంటే, ఏ విద్య అయినా అద్భుతంగా, అతిశయంగా నేర్చుకోగలం. 

వేదములో ఒకే పన్నాన్ని ఘనాపాఠి, అదే పనిగా రకరకములుగా పాఠము చేసి, ఆ పన్నములో, ఆ 

వేదములో పూర్ణజ్ఞానము సంపాదించుకోవడం లేదూ. 

బ్రహ్మండపురాణంలో, "జ్ఞానము కేవలము ధ్యానము వలననే లభిస్తుంది. జ్ఞానశరీరమే ఆత్మ,

అదే విద్య. దానికి హృదయమే నివాసము. జీవేశ్వరైక్యమును చిరకాలము అనుష్టిస్తే జ్ఞానము  

అతిశయముగా కలుగుతుంది", అన్నారు.  

కనుక జ్ఞాత ఎంత ఎక్కువగా శ్రవణం, పఠనం, మననం, స్మరణం చేస్తే జ్ఞానం కూడా అంత 

అతిశయంగా సిద్ధిస్తుంది. 

అభ్యాసము చేస్తున్న కొలదీ జ్ఞానమును పెంపొందించు, ఆ అభ్యాసాతిశయజ్ఞాత కు వందనం. 

ఓం శ్రీ అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః  


991. షడధ్వాతీత రూపిణీ

శైవాగమములో పదాధ్వము, భువనాధ్వము, వర్ణాధ్వము, తత్త్వాధ్వము, కలాధ్వము, 

మంత్రాధ్వము, అనే షడధ్వాలు, అంటే ఆరు మార్గాలు వున్నాయి. 

ఈ ఆరు మార్గాల కన్నా అతీతమయినది షడధ్వాతీతరూపిణీ అయిన లలితాపరమేశ్వరి. 

వానిలో వర్ణాధ్వ, పదాధ్వ, మంత్రాధ్వములు శక్తి రూపములు. 

కలాధ్వ, తత్త్వాధ్వ, భువనాధ్వములు శివ రూపములు. 

కులార్ణవంలో, "జన్మాంతరాలలో ఈ ఆరు మార్గాలలో ఉపాసనలు చేసిన వారికి, ఈ జన్మములో 

త్రిపురసుందరీ ఉపాసన చేసే యోగం కలుగుతుంది. షణ్మతాల మార్గాలలో కూడా శుద్ధమనస్సు

 కలవారికి మాత్రమే కులజ్ఞానం లభిస్తుంది", అని చెప్పారు. 

ఆ మార్గములన్నింటి కన్నా అతీతమైనది, ఉత్తమమైనది దేవీఉపాసన. 

అందుకే ఈ నామంలో అమ్మను షడధ్వాతీతరూపిణీ అంటున్నాం. 

జ్ఞానార్ణవంలో, దక్షిణామూర్తి సంహితలో, షడధ్వములతో కూడిన శ్రీ చక్రాన్ని వాటి లక్షణములతో 

సహా వివరించారు. ఆ షడధ్వములను అతిక్రమించిన రూపము శ్రీదేవిది. 

షడధ్వములను మించిన ఉపాసనా రూపము కల, ఆ షడధ్వాతీత రూపిణి కి వందనం.   

ఓం శ్రీ షడధ్వాతీతరూపిణ్యై నమః  


992. అవ్యాజ కరుణామూర్తిః

వ్యాజము అంటే కారణము. అవ్యాజమంటే ఏ కారణమూ లేకపోవటం. భక్తుల పట్ల, అమ్మ కరుణకు 

ఏ కారణమూ అవసరం లేదు. కేవలము అమ్మ పట్ల విశ్వాసము చాలు. 

సర్వోత్కృష్టమైన అపార కరుణను చూపించే సహృదయ స్వరూపము శ్రీమాత.

అందుకే ఈ నామంలో అవ్యాజకరుణామూర్తీ అంటున్నాం. 

అమ్మ కరుణకు హద్దులు లేవు. సురాసురులనూ, మానవులనూ, జంతువులనూ అందరినీ ఒకే 

విధంగా ప్రేమించ కల కరుణాస్వరూపం. అమ్మ యొక్క కరుణా తత్త్వం గురించి సాంద్రకరుణా 

నామంలో కూడా చెప్పుకున్నాం. 

భక్తుల పట్ల, నిర్హేతుకంగా కరుణను చూపించే, ఆ అవ్యాజ కరుణామూర్తి కి వందనం. 

ఓం శ్రీఅవ్యాజ కరుణామూర్త్యై నమః  


993. అజ్ఞానధ్వాంతదీపికా

అజ్ఞానమనే ధ్వాంతములో దీపిక వంటిది అని ఈ నామంలో అమ్మ గురించి చెప్పుకుంటున్నాం. 

ధ్వాంతము అంటే అంధకారం, చీకటి. 'అజ్ఞానతిమిరాంధస్య, జ్ఞానాంజన శలాకయా' అని 

దక్షిణామూర్తి శ్లోకాల్లో వుంది. 

అజ్ఞానంలో దారి తోచక తిరుగుతున్న వారికి, అమ్మ దివిటీ వంటిది అని ఈ నామార్ధం. 

చీకటిని దీపము నాశము చేస్తుంది. జ్ఞానము అజ్ఞానాన్ని నాశము చేస్తుంది. 

భక్తుల మనస్సులలో, ఆ జ్ఞానము అనే దివ్వెను వెలిగించేది లలితాపరాభట్టారిక. 

శ్రీమద్భగవద్గీతలో, విభూతి యోగంలో, "భక్తుల పట్ల అనుకంపతో, నేనే వారి హృదయములలో 

ప్రవేశించి, చక్కగా ప్రకాశించే జ్ఞాన దీపముల చేత, అజ్ఞానము వలన జనించిన అంధకారమును 

నశింపచేస్తున్నాను" అంటాడు పరమాత్మ.   

ఆ విధంగా అమ్మ అవ్యాజకరుణామూర్తి కనుక, భక్తుల పట్ల కల అనుకంపతో, వారి లోపల వున్న,

అజ్ఞానమనే చీకట్లను తొలగించే జ్ఞానజ్యోతులను వెలిగిస్తున్నది.  

అందుకే అవ్యాజకరుణామూర్తి అయిన పరమేశ్వరి, అజ్ఞానధ్వాంతదీపిక కూడా అయింది. 

అంతఃకరణములో వున్న అంధకారమును తొలగించే జ్ఞానదీపిక, 

ఆ అజ్ఞానధ్వాంత దీపిక కు వందనం. 

ఓం శ్రీ అజ్ఞానధ్వాంతదీపికాయై నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650



          

19, జనవరి 2022, బుధవారం

నేనెందుకు రాశానంటే.........


ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ 
సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్

నేనెందుకు రాశానంటే.......

ఒక మూడు, నాలుగేళ్ల నుంచీ లోపల నుంచి లలితా అమ్మవారి గురించి రాయాలని, ఏదో ఎప్పుడూ తొలుస్తూ ఉంది. చివరకు, అమ్మవారి కృప వలన, ఆ మనోమథనం ఇలా పరిణమించింది. 

ఈ సోషల్ మీడియా ఉధృతి ఎక్కువయ్యాక, ఎవరెవరో వాట్సాప్ లో ఏవేవో షేర్ చేస్తూ ఉండేవారు. అన్నీ ఫార్వార్డ్సే. ఒక్కటీ అవి పంపించేవారి ఒరిజినల్ మాటర్ కాదు. విసుగేసేది. నా అభిరుచి తెలిసినవారు పుంఖానుపుంఖాలుగా ఈ దేవీ దేవతల ఫార్వర్డ్స్ పంపించేవారు. ఒక్కో రోజు, ఒకటే పోస్ట్ పదిసార్లు వచ్చేది. డిలీట్ చేసీ చేసీ విసుగేసేది. భక్తి, నమ్మకం అంటే ఇది కాదు, ఫార్వర్డ్స్ పంపించకండి అని మొత్తుకునేదాన్ని. కానీ ఆ ప్రవాహం ఆగలేదు. 

కొన్నిసార్లు శ్రీలలితాసహస్రనామాల గురించి వన్ లైనర్ ఫార్వర్డ్స్ వచ్చేవి. బొమ్మలు చాలా  బాగుండేవి. అవి కాస్త శ్రద్ధగా చూసి దాచుకునేదాన్ని. ఏవైనా సరే ఓ పదో, పాతికో వచ్చాక ఆగిపోయేవి. భలే చికాకు అనిపించేది. అలవాటు చేసి ఆపేస్తారేమిటి అని విసుక్కునేదాన్ని. సరే, బొమ్మలతో వన్ లైనర్ లు ఆగిపోయాక, మరెవరో మహానుభావులు కొంచెం వివరణతో కూడిన నామాలుమళ్ళీ ఓ పది, పదిహేను పంపించారు. అంతే, మళ్ళీ ఆగిపోయింది. ఏమిటిదంతా, అని అడిగితే, వారికి ఎవరు షేర్ చేశారో వారు ఆపేశారట. చిన్నపిల్లలకి ఏ చాక్లెట్టో, ఐస్క్రీమో నాకించి లాక్కున్నట్టు ఉండేది నా బాధ. తెలిసినవారితో, 'ఈ గోలంతా ఏమిటి, నేనే ఎప్పుడో మొత్తం రాసేస్తా' అంటూ ఉండేదాన్ని. బహుశా ఆ బాధ అంతా లోపల ఉందేమో. 

సౌభాగ్య భాస్కర భాష్యం పుస్తకం మా సువర్చల అత్తయ్య దగ్గర చూసాను, చదివాను. కానీ ఆ ప్రతి చాలా జీర్ణావస్థలో వుంది. మంచి కాపీ దొరకలేదు. చివరకు సుమారు మూడు నాలుగేళ్ల క్రితం చాలా యాదృచ్చికంగా భాస్కరరాయలవారు రాసిన సౌభాగ్య భాస్కర భాష్యం పుస్తకం దొరికింది. డా. నోరి భోగీశ్వరశర్మ సోమయాజి గారు ఆ పుస్తకాన్ని పునః ప్రచురించి మాలాంటి వారికి ఎంతో ఆనందాన్నిచ్చారు. ఆ పుస్తకం కొనుక్కుని భాస్కరరాయ భాష్యం ఈసారి చాలా తీరికగా చూసాను.

ఆ సంస్కృత భాష్యాన్ని తెలుగులో, ముఖ్యంగా అమ్మవారిమీద భక్తి, శ్రద్ధా, విశ్వాసం వుండి, ఇంకొంచెం తెలుసుకుందామనే ఆసక్తి వున్నవారికి, సంస్కృతం రాక, ఆ గ్రంధాలు చదవలేని వారికిదాదాపుగా బిగినర్స్ కి, ఉపయోగంగా సరళమైన భాషలో, కర్మ, భక్తి, జ్ఞానము, ఉపాసనా అనేవి ముఖ్య మార్గాలుగా తీసుకునినేనే రాయాలని లోపల్లోపల అనిపించినా, బద్ధకం వలన రచన మొదలుపెట్టలేదు. నేను  మొదటినుంచీ కూడా సింపుల్ గా చెప్పాలనే అనుకున్నాను. భాషాడంబరం, పదవిన్యాసం నా లక్ష్యాలు కాదు. నాకేం వచ్చో చెప్పాలని కాదు, నా పాఠకులకు ఏం కావాలో  చెప్పే  ప్రయత్నం చేశాను. భాస్కరరాయలు చాలా ధ్యానమార్గం, యోగమార్గం, ఎంతో లోతైన అంతరార్ధాలు కూడా రాశారు. ఆ మార్గం లోకి నేను పోలేదు. చాలా వ్యాకరణం రాశారు. నేను దాన్నీ టచ్ చెయ్యలేదు. కేవలం నామార్ధాలు ఆయన ఏ దృక్పథంతో రాసారని నాకు అనిపించిందో, వాటికి, నా అనుభవాలు, దర్శనాలు, అమ్మవారితో నాకున్న అనుబంధం ఆధారంగా ఈ వ్యాఖ్యానం రాసాను. ఎన్ని చదివినానా ఈ శ్రీ లలితా విజయం గ్రంధానికి కేవలం శ్రీ భాస్కరరాయ పండితుడు రాసిన సంస్కృత సౌభాగ్య భాస్కర భాష్యం మాత్రమే ముఖ్య లేదా ఏకైక ఆధారం. 

ఎందరో పారాయణలు చేస్తున్నాం, రండి అని పిలిచేవారు. చాలా భక్తి శ్రద్ధలతో చేసేవారు కూడా. కానీ వారు పదవిభజనలో, పదఉచ్చారణలో, చేసే లోపాలు చూసి బాధపడేదాన్ని. అలా కాదు, ఇలా చదవాలి అంటే, పట్టించుకునే వాళ్ళు కాదు. చెప్పి చెప్పీ విసుగేసిసుమారు ఓ పదేళ్ల నుంచీనేనే ఆ పారాయణలకి వెళ్ళటం మానుకున్నా. మధ్యలో బ్రేక్ వస్తే, బట్టీ పట్టిన స్తోత్రం మర్చిపోతామనే వాళ్ళ భయం వాళ్ళది. అవీ ఇవీ అన్నీ కలిసి, నేనే సరిగ్గా పదవిభజన చేస్తూ, అర్ధం చెపుతూ రాయాలని అనుకున్నా. అర్ధం తెలుస్తే, తప్పు చదవరేమో అన్న ఆశ మనసులో. 

సుమారు ఓ పది నెలల క్రితం మా సువర్చల అత్తయ్యతో, "అత్తయ్యా, ఒక నామం చెప్తా. నీకు ఓకే అనిపిస్తే రాస్తా" అని, మొదటి శ్రీమాతా నామానికి నాకు మనసులో స్ఫురించిన భావం చెప్పా. అత్తయ్య 'బాగుంది, రాయి' అంది. అప్పుడు అత్తయ్య నాకు ఒక మంచి ఉపయోగకరమైన సలహా కూడా ఇచ్చింది. ఎలా రాయాలీ, ఎంత రాయాలీ, అన్నప్పుడు 'రోజుకి ఒక శ్లోకం రాయి. ఆ శ్లోకంలో ఎన్ని నామాలుంటే అన్ని నామాలకీ రాయి', అని చెప్పింది. ఈ లిమిట్ బాగుంది అని చాలా సంతోషపడ్డా. నా బ్లాగ్ వుంది కదా, అప్పటికే ప్రయాణోపనిషత్, జ్ఞాపకాలదొంతర రాస్తూ వున్నా, దానిలోనే ఇది కూడా రాయాలని సంకల్పం చేసేసా. అన్నీ అనుకున్నానే కానీ, మళ్ళీ బద్ధకం ఆవహించేసింది. మొదలుపెట్టలేదు. చివరకు అకస్మాత్తుగా ఎవరో తరిమినట్టు, అప్పటికప్పుడు, 2021 గురుపూర్ణిమ నాడు మధ్యాహ్నం అన్ని పనులూ ముగించుకుని, ప్రయాణోపనిషత్ బ్లాగ్ లోనే, మొదటిశ్లోకం పోస్ట్ చేశా. ఆ రోజు నుంచీ రోజుకి ఒక శ్లోకం అనే నియమాన్ని పెట్టుకుని, దానిని ఉల్లంఘించకుండా వ్యాఖ్యానం రాసి పోస్ట్ చేస్తూనే వున్నా. 

కొన్నిసార్లు పనులు వచ్చేవి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చేది. అటువంటి రోజులలో కొన్ని ముందు నుంచీ రాసి ఉంచుకుంటే మంచిదని అనిపించింది. అప్పటినుంచీ, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, ఎప్పుడు కుదిరితే అప్పుడు రాసి పెట్టుకునే దాన్ని. అమ్మవారి కార్యం. ప్రోత్సాహం, ప్రోద్బలం అమ్మవారిదే. ప్రేరణాస్ఫురణా ఆవిడదే. చిన్న పిల్లవాడు అడవి దాటుతూ భయంతో 'కృష్ణా, తోడు రావా', అని పిలిచినట్టు, నేను కూడా, "అమ్మా, నువ్వు రాయమని అంటేనే రాస్తున్నాను. బాధ్యత నీదే. నడిపించు, నీ  చేయి పట్టుకుని నడుస్తాను", అని భారం ఆ లలితా పరమేశ్వరి మీదే వేసేసాను. తమాషా, ఎన్ని గంటలు రాసినా, ఎన్ని రాత్రుళ్ళు మేలుకునే వున్నా, అలసట అనిపించలా. హాయిగానే వుంది. మధ్యలో వచ్చే అడ్డంకులకి నేను, మావారు భండాసురులని పేరు పెట్టుకున్నాం. భండాసురులు వచ్చాయి, పోయాయి. మా పని మాత్రం ఎక్కడా ఆగకుండా చక్కగా అయిపోయింది. అందుకేనేమో, అమ్మ ఆజ్ఞ లేనిదే ఏం చేసినా ముందుకు సాగదు, అంటారు. 

కాలడిలో స్వర్ణోత్తుమన చూసి, అక్కడ మండపంలో కూర్చుని, పైన చక్కగా చెక్కలో చెక్కిన లక్ష్మీదేవిని చూస్తూ కనకధారాస్తోత్రం చదువుకోవడం, తిరువనంతపురంలో, అనంత పద్మనాభ స్వామి గుడిలో, కళ్యాణ మండపంలో కూర్చుని విష్ణుసహస్రనామస్తోత్రం చదువుకోవడం, శ్రీనగర్ లో చక్రేశ్వరీ అమ్మవారి మహాశిల ముందు కూర్చుని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ  సిందూరం అంతా పూసేసుకోవడం, త్రయంబకంలో పై నుంచి శివలింగాన్ని చూస్తూ లోపలికి  పడిపోబోవడం, రెండే రోజుల ప్రయత్నంతో, రెండే రోజుల్లో అమరనాథ్ వెళ్లి, అంతెత్తు వున్న హిమ లింగాన్ని దర్శించుకోవడం, ఇవి నా జీవితంలో కొన్ని అపురూప ఘట్టాలు. ఇప్పుడు అవన్నీ ఒక ఎత్తు,   శ్రీ లలితా సహస్ర నామ సరళ వ్యాఖ్యానం రాయడం ఒక ఎత్తు అన్నట్టు అయిపోయింది. 

ఈ శ్లోకాలన్నీ, మొదట్లో ప్రయాణోపనిషత్ అనే టైటిల్ కిందే పోస్ట్ చేశా. తరువాత చాలా టైటిల్స్ మార్చా. చాలాకాలం పాటు శ్రీ లలితా సుధావాహిని అనే పేరుతో పబ్లిష్ అయ్యింది. చివరకు, భాస్కరరాయల వారి బాటలోఅమ్మవారి పేరూ, నాపేరూ కూడా కలిసి వచ్చేలా, ఈ మొత్తం వ్యాఖ్యానానికి శ్రీ లలితావిజయం అనే పేరు నిశ్చయం  చేసుకున్నా.  

మొత్తం మీద దక్షిణామూర్తి ఆశీస్సులతోగురుపూర్ణిమ నాడు మొదటినామంతో ప్రారంభించిన ఈ వ్యాఖ్యానం, నారాయణుడి ఆశీస్సులతోవైకుంఠఏకాదశి నాడు వెయ్యో నామంతో ముగించివెయ్యి నామాల వ్యాఖ్యానమూ రాయగలిగాను. అంతా లలితా దేవి సంకల్పమూకృపా తప్ప మరేదీ కాదు. 

ఇంకో విషయం చెప్పాలి. మొదట్లో, ఈ స్తోత్రం రహస్యం కదా, ఇలా అందరికీ పబ్లిక్ గా బ్లాగ్ లో చెప్పొచ్చా అనే సందేహం కలిగింది. ఎందుకంటే స్వయంగా అమ్మవారే, 'ఇది అందరికీ చెప్పకూడదు, అర్హులైన వారికి మాత్రమే చెప్పాలి' అని ఒక నిబంధన పెట్టింది కదా. నేను ఈ సందేహంలో పడి రాయడంలో ఇంకొంచెం జాగు చేశా. ఏదో ఒక నెపంతో తప్పించుకోవాలని ఒక చిన్న దురాలోచన. అప్పుడు అమ్మవారే ఇలా చెప్పినట్టు అనిపించింది. "అర్హత సంగతి నేను చూస్తా, అది నీ పని కాదు, నువ్వు రాయి, ఎవరికి ఎలా చేరాలో నేను చేరుస్తా" అని. ఈ స్తోత్ర వ్యాఖ్యానానికి నన్ను ఉపకరణంగా ఎన్నుకున్నందుకు ఆ జగదంబకు సదా కృతజ్ఞురాలిని. నాచేత రాయించటమే కాదు, నాకు అవసరమైనవన్నీ సమకూర్చి పెట్టింది. ఈ స్తోత్రవ్యాఖ్యానం నాకు తెలియని ఎందరినో నాకు పరిచయం చేసింది. నన్ను తెలియని ఎందరికో నన్ను పరిచయం చేసింది. 

ఇప్పటికే చదివిన కొందరికి అమ్మ కనిపిస్తే, కొందరికి వారికి కావలసిన కోరిక తీర్చిపెట్టింది. ఇది సత్యం. అన్నీ నేనే చూసుకుంటాను అన్న మాట అమ్మది. పూర్వ, ఉత్తర పీఠికలలో కూడా, ఈ నామాలు పారాయణ చేసిన వారి కోరికలు తీరుస్తాను అని అమ్మ ఇచ్చిన మాట పొల్లుపోదు. 

 ఓం శ్రీ సర్వానుల్లంఘ్యశాసనాయై నమః 

ఓం శ్రీ ఆబాలగోపవిదితాయై నమః 

ఓం శ్రీ లలితాంబికాయై నమః 

 ……… భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650