13, జనవరి 2022, గురువారం

శ్రీమతి విస్సా భారతలక్ష్మి గారి అభిప్రాయం

 శ్రీమతి విస్సా భారతలక్ష్మి గారి అభిప్రాయం 


ఓం శ్రీ మాత్రే నమః 

అక్కకు జిజ్ఞాస తత్త్వం వుంది. తనకు హిందూ సంస్కృతీ, సనాతనధర్మం, దేవతల మహాత్మ్యం గురించి తెలుసుకోవాలని చాలా ఉత్సాహం. అందు గురించే తాను చాలా పుస్తకాలూ, గ్రంధాలు, ఉపనిషత్తులు, వాటి తాలూకు వ్యాఖ్యానాలు చదివేది. శ్రీ సిద్ధేశ్వరానందస్వామి లాంటి వారి భాషణాల ద్వారా చాలా జ్ఞానం సంపాదించింది. భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలని సందర్శించి వాటి స్థలపురాణాలు, మహాత్మ్యాలు (ప్రసిద్ధ దేవాలయాలవి) తెలుసుకుంది. 

వీటన్నిటి ద్వారా ప్రేరేపింపబడి ఈ లలితాసహస్రనామభాష్యం వ్రాసేటందుకు తగిన జ్ఞానం, అర్హత సంపాదించింది. ఆ అమ్మవారి అనుగ్రహంతో, ఎంతో దీక్షతో ఈ వ్యాఖ్యానం వ్రాసి తాను, మనందరికీ అందించటం నిజంగా నాకు చాలా ఆనందంగా వుంది. ఇది మన అదృష్టం అని భావించవచ్చు. 

ఇక తన వ్యాఖ్యానశైలి చూస్తే, తనకు తెలుగుభాష మీద వున్న పటుత్వం తెలుస్తుంది. 
తాను వాడిన పదాలు కూడా చాలా సున్నితంగా మనసుని హత్తుకునే లాగా వున్నాయి. 

ఇందులో నాకు చాలా నచ్చిన విషయం, మొదట అమ్మవారి చిత్రం ఉండటం. చదివేవారిని ముందు లలితాదేవిని తల్చుకోమని చెప్పటమే. అలాగే నామ వివరణ చివరిలో, ఓం శ్రీ ...... నమః అని వ్రాయటంలో మళ్ళీ అమ్మవారిని స్మరించమని చెప్పటమే. అదే కదా అందులోని పరమార్ధం. 

అమ్మవారి ప్రతి నామ వివరణలో అనేకానేక అర్ధాలు, వాటి మూలాలు, సందర్భాలు కనిపిస్తాయి. వాటిని ఉపనిషత్తులు, వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇంకా ఎందరో ఋషుల ద్వారా వ్రాయబడిన గ్రంధాల ద్వారా సేకరించి, సమయోచితంగా కూర్చటం చాలా ఆసక్తికరంగా వుంది. మనకు తెలియని ముఖ్యవిషయాలు, ముఖ్యంగా మన పురాణాల లోని కొన్ని సందర్భాలు ఇందులో తాను పొందుపరిచింది. 

లలితాసహస్రపారాయణ చేసేవారికి ఈ నామ వివరణ, అమ్మవారి పట్ల మరింత శ్రద్ధ, భక్తి కలిగేటట్లు చేస్తుంది. ఎందుకంటే, ఈ అర్ధాలు, సందర్భాలు తెలియడం మూలంగా, ఆ నామం చదివేటప్పుడు అమ్మవారి శక్తి మన ముందు ద్విగుణీకృతమై నిలుస్తుంది. ఈ కారణంగా మనం యాంత్రికంగా సహస్రనామాలు చదవటం బదులు ఆ నామంతో పాటు దాని అర్ధాన్ని కూడా మనసులో తల్చుకుని పారాయణ చేస్తే, అమ్మవారి మీద మన ఏకాగ్రత పెరుగుతుంది. పారాయణానికి సార్ధకత చేకూరుతుంది. 

తాను ఎంతో దీక్షతోనూ, భక్తితోనూ, లీనమై తన విజ్ఞానాన్ని మన ముందు ఉంచినందుకు, మా విజయలక్ష్మి అక్కకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు. తాను చేసిన ఈ కృషి ఫలితం, అమ్మవారి ఆశీస్సుల ద్వారా తనకు తప్పక అందుతుందని, అలాగే అది చదివిన మనందరకు కూడా అమ్మవారి దీవెనలుంటాయని ఆశిస్తున్నాను. 


---------------------భారతలక్ష్మి 











1 కామెంట్‌: