శ్రీమతి లక్ష్మీ రాధిక అభిప్రాయం
|| శ్రీ మాత్రే నమః ||
శ్రీ లలితా దేవిని స్తుతిస్తూ పఠించే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉందనీ, భక్తి శ్రద్ధలతో పారాయణ చేసినవారికి సకల శుభాలూ, సౌభాగ్యాలూ, ఆయురార్యోగాలూ
ఆ పరదేవత ప్రసాదిస్తుందనీ, ఆ శ్రీమాత మీద విశ్వాసం గలవారి ప్రగాఢమైన నమ్మకం.
నేను కూడా మా అమ్మా నాన్నగార్లు ఇచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహం, ప్రోద్బలంతో వాళ్ళు చెప్పిన ప్రకారం లలితా సహస్ర నామ పారాయణ చేస్తూ ఉంటాను. అయితే నాకున్న పరిమిత జ్ఞానం వల్ల, ఆ సహస్ర నామాల అంతరార్ధాలు, వివరణ అంతగా తెలియకపోయినా, నాకు తెలిసినంతవరకు అర్ధం చేసుకుని పారాయణ చేసుకుంటూ ఉంటాను. ఆ అమ్మవారి దయవల్ల బాగానే సాగుతూ వస్తోంది.
స్తోత్రాలు పఠించటం మంచిదే. అయితే ఏ స్తోత్రమైనా బాగా అర్ధం చేసుకుని చదివితేనే, పరమార్ధం లభిస్తుంది అనేది సత్యం. నోటికి వచ్చుకదా అని మనసు పెట్టకుండా, అర్ధం తెలియకుండా చదివితే అది పరిపూర్ణం కాదు. ఈ విషయానికి సంబంధించి నాకు ఒక సమాధానం చూపించింది, శ్రీ లలితావిజయం పేరుతో, శ్రీ లలితా సహస్ర నామ సరళ వ్యాఖ్యానానికి శ్రీకారం చుట్టిన శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి. ఇప్పుడు లలితా సహస్ర నామ పారాయణ చేస్తున్నప్పుడు ప్రతీ నామం అర్ధవంతంగా, ఎంతో భక్తిపరంగా అనిపిస్తోంది.
నిజానికి ఇంటర్నెట్లో కొంతమంది ఇచ్చిన వ్యాఖ్యానాలు ఇప్పటికే కొన్ని అందుబాటులో వున్నాయి. కానీ అవి అంతగా ఎప్పుడూ చదవాలి అనిపించలేదు, పట్టించుకోలేదు గూడా. ఎప్పుడైతే మన భట్టిప్రోలు విజయలక్ష్మి, శ్రీ లలితాసహస్రనామ వ్యాఖ్యానం రాస్తోంది అని తెలిసిందో, అప్పటినించి చాలా ఆసక్తితో ఆ వ్యాఖ్యానం చదవడం మొదలుపెట్టాను. అప్పుడప్పుడూ తనతో డిస్కస్ కూడా చేసేదాన్ని, నాకేదైనా సందేహం వస్తే అర్ధం చేస్కోవడానికి. ప్రతిరోజూ ఆవిడ పెట్టే పోస్ట్స్, మొదటినించి ఈరోజు వరకూ క్రమం తప్పకుండా చదువుతూ వచ్చాను.
ప్రతీ శ్లోకమూ, అందులోని ప్రతీ నామము కూడా చాలా చక్కగా సులభమైన శైలిలో, చక్కటి వివరణలతో, ఆ నామాలకు అనుగుణంగా, సందర్భానుసారంగా వాటికి తగిన వేదాంతపరమైన విషయాలు జోడించి, చక్కగా తనదైన ప్రత్యేక రచనా శైలిలో సంకలనం చేశారు. సమగ్రంగా సహస్రనామాలలో ప్రతి నామం గురించిన వివరణ చాలా చక్కగా అమరింది.
ప్రారంభంలో అమ్మవారి ఆవిర్భావాన్ని, ఆవిడ రూపాన్ని, ఆభరణాలని, వర్ణించిన తీరు
ఆ అమ్మవారిని ప్రత్యక్షంగా చూపించినట్టుగా ఉంది. అమ్మవారి పరాక్రమాలనూ, రధాలనూ, దండనాయకురాళ్లతో ఆవిడ భండాసురాది రాక్షస సంహారం చేసిన తీరునూ, వర్ణించిన విధానం చాలా బావుంది. షట్చక్రాల ప్రాశస్త్యం, వాటిల్లోని ఒక్కో చక్రము, ఆ చక్రాల అధిష్టానదేవతలు,
ఇంద్రధనుస్సు లోని రంగులని పోలే ఆ దేవతల మేని రంగులు, ఆ చక్రాలలో ఉండే పద్మాలు, వాటి రేకుల సంఖ్య, ఆ చక్రాలు నిర్దేశించే మానవ శరీర ధాతువుల గురించి, చాలా సమాచారం సవివరంగా తెలియచేశారు. శ్రీ చక్రం, అందులో ఉండే త్రిభుజాలు, శ్రీచక్రం లోని తొమ్మిది ఆవరణల్లోనూ వున్న తొమ్మిదిమంది ప్రధాన యోగినుల గురించి కూడా చాలా వివరాలు వేదాంతపరంగా, గణిత పూర్వకంగా పొందుపరిచారు.
శివ శివాని ల మధ్య అనురాగం, ప్రేమ, శృంగారం చాలా సహజంగా, దైవత్వం తెలిసేటట్టు వర్ణించారు. శివుడు, శివాని ఒక్కరేనని, నారాయణుడు, నారాయణీ వేరువేరు కాదనీ, అద్వైత సిద్ధాంతాన్ని బలపరిచి ధృవీకరించారు.
శ్రీ లలిత, ఆబ్రహ్మకీటజననీ అనీ, అమ్మవారిని ప్రతి జీవిలోనూ చూడగలగాలనీ, సర్వం బ్రహ్మమయమనే నిజాన్ని గ్రహించాలనీ, ఆ సాధనే మనల్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్తుందనే అర్ధాన్ని కూడా విశదీకరించారు. అక్షరమాల లోని ప్రతి ఒక్క అక్షరంతో అమ్మవారి నామాల కూర్పు ప్రశంసనీయం. శ్రీ లలితాదేవిని ఒక స్త్రీ మూర్తిగా, మాతృమూర్తిగా, భార్యగా, అనురాగమూర్తిగా, గురువుగా, శిష్ట రక్షకురాలిగా, దుష్టులని శిక్షించే దేవత లాగా, కైవల్యప్రదాయినిగా, వేదమూర్తిగా, పండితురాలిగా, చతుషష్టి కళామయిగా, ఆయా నామాలకు చక్కగా సరిపోయేట్టుగా చిత్రీకరించారు, వర్ణించారు.
ఒక్కొక్క నామానికి విజయలక్ష్మి ఇచ్చిన వివరణ చదివాక తెలిసింది, ఆ సహస్రనామాలలో అంత అర్ధం దాగి ఉందనీ, ప్రతీ నామానికీ అంత వివరణ ఉందనీ. ఇంతటి మహత్కార్యాన్ని అంత చక్కగా చేయగలిగారంటే, ఆ అమ్మవారి అనుజ్ఞ, కృప విజయలక్ష్మి వెన్నంటే ఉండి ఉండాలి.
ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పటికీ భట్టిప్రోలు విజయలక్ష్మికీ, వారి కుటుంబ సభ్యులకీ ఉండాలని కోరుకుంటున్నాను. నాకూ చదవగలిగే అవకాశం కలిగినందుకు, నేను కూడా ఆ అమ్మవారికి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను.
|| శ్రీ మాత్రే నమః ||
-------------------లక్ష్మీరాధిక
చాలా చక్కగా వ్రాసారు
రిప్లయితొలగించండిThanks Radhika,for your great feedback.
రిప్లయితొలగించండిశ్రీరామ జయం! నమస్కారం లక్ష్మీ రాధిక గారు... మీ అవగాహన మీ వ్రాతలో ప్రతిబింబిస్తోంది.చాలా సంతోషం మీ పరిచయం... శ్రీమాతయైన పరాభట్టారికా అపాంగ వీక్షణీయత ఎల్లవేళలా మీపై ప్రసరించునుగాక ! శుభమస్తు!!
రిప్లయితొలగించండి