21, జనవరి 2022, శుక్రవారం

శ్రీమతి మాధవపెద్ది ఫణి రాధాకుమారి గారి అభిప్రాయం

శ్రీమతి మాధవపెద్ది ఫణి రాధాకుమారి గారి అభిప్రాయం

 శ్రీ లలితా విజయం

(శ్రీ లలితా సహస్రనామ సరళ వ్యాఖ్యానం)

లలితా సహస్రనామాలపై సరళ వ్యాఖ్యానం వ్రాయాలనే విజయలక్ష్మి భట్టిప్రోలు గారి సంకల్పం చాలా గొప్పది.ఒక్కొక్క నామానికి ఆవిడ వ్రాసే వ్యాఖ్యానం చదువుతూంటే, విషయం ఇట్టే తేటతెల్లమవుతుంది. అంతేకాదు, ఇన్నాళ్ళూ నేను లలితాసహస్రనామాలు అర్ధం పూర్తిగా తెలుసుకోకుండా పారాయణం చేస్తున్నాననే విషయం కూడా నాకు తెలిసింది. 

నేను ఎన్నో ఏళ్ళుగా లలితాసహస్రనామ పారాయణ యాంత్రికంగా చేస్తున్నా ఈమధ్యనే అందులోని నామాలకు ఉన్న అర్ధాలను తెలుసుకోవాలని అన్పించటం, భట్టిప్రోలు విజయలక్ష్మిగారి సరళ వ్యాఖ్యానం చూడటం కాకతాళీయంగా సంభవించింది.


రోజుకొక శ్లోకం చొప్పున అవి తెలుసుకుంటూ చదువుతూఉంటే, ఎంతో ఆనందంగా అన్పించింది.
ప్రతి నామానికీ ఉన్న అర్ధాన్నీ, ప్రాముఖ్యతనూ విజయలక్ష్మి వివరించే విధానం, అందరికీ అర్ధమయ్యే చిన్నచిన్న పదాలతో విశదీకరించి చెప్పటంతో  ప్రతినామం యొక్క విశిష్టత చక్కగా అర్ధమయింది. 

ఒక్కొక్క ముత్యాన్ని గుదిగుచ్చి అందమైన ముత్యాలహారాన్ని తయారుచేసే విధంగా అమ్మవారి ఒక్కొక్క నామాన్ని విశదీకరించి, సహస్రనామ హారాన్ని సమకూర్చిన విధానం బహుధా ప్రశంసనీయం. 

అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఈ శ్రీ లలితా విజయాన్ని విజయవంతంగా పూర్తిచేయటం జరుగుతుంది. విజయలక్ష్మి ఇదేవిధంగా మరెన్నో వ్యాఖ్యానాలను విశదీకరించి మనకందించాలనీ, ఆమెకూ, ఆమె కుటుంబానికీ ఆ జగదీశ్వరి ఆయురారోగ్య  ఆనంద ఐశ్వర్యాలనూ అనుగ్రహించాలనీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.


   ------------ మాధవపెద్ది ఫణిరాధాకుమారి

2 కామెంట్‌లు:

  1. ఒక ఆలోచన వీచిక...

    మా ఊరి గురించో, విహార, సంసార, వివరాల గురించో రాయాలంటే కావాల్సింది ఆలోచన.. వివేచన.. అవగాహన.

    చిరు ప్రాయం నుంచే ఆ జిజ్ఞాస - దానికి ప్రోత్సాహం లభించడం విశేషం. సాధు సత్సంగం లో పాల్గొనడం - పండిత సభల్లో సమావేశాల్లో ప్రత్యక్ష గ్రాహ్యత తో పాటు నండూరి - నందివాడ కుటుంబ జీన్స్ (వంశీ కృతం) లీలా మాత్రంగా కలిసి వచ్చాయి అనుకోవాలి.

    ఆ తర్వాత బోధనా వ్యాసంగం ఎలాగూ ఉన్నదే!!

    వీటి తో పాటు ఏదో రాయాలన్న ప్రగాఢ కాంక్ష , వేద సాహిత్యం సంస్కృత ప్రవేశాల కలయికతో పాటు సాక్షాత్ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి - అందుకే సరైన భావ గాంభీర్యం తో లాలిత్యం తో హృదయ స్పందన తో అక్షర రూపం గా వెలసినది ఈ "లలితా సహస్రనామ సరళమైన వ్యాఖ్యానం".

    ఇది భట్టిప్రోలు వారి సహకారం తో నందివాడ విజయ లక్ష్మీ ఆచరించిన శ్రీ లలితా మహా యజ్ఞం. ఈమె తో కుటుంబం అంతా ధన్యం.

    శుభం భూయత్!! 🙏

    ******
    -- ద్రోణంరాజు వేంకట శ్రీరామచంద్ర మూర్తి

    రిప్లయితొలగించండి